Monday, October 20, 2008

దూరం !!!

ప్రాణమైన స్నేహితున్ని దూరం చేసుకున్నప్పుడు పడే వేదన ఇప్పుడు నేను అనుభవిస్తున్నదే. నా స్వంత పనుల వలన కొన్నాళ్ళు ఈ బ్లాగుకి దూరం కావలసి వస్తుంది. ప్రతిరోజూ మనసు పంచుకొనే మిత్రుడులా ఈ బ్లాగు విధానాన్ని కనుగొన్నవారికి తలను వంచి నమస్కరించాలి. ఈ 15 రోజుల దూరం బాదగా వున్నా..తర్వాత రెట్టించిన ఉత్సాహంతో మీతో కలిసే రోజు కొరకు ఎదురుచూస్తున్నాను. నవంబర్ ఐదున మరలా కలుద్దాం.

మీ శ్రీఅరుణం,
9885779207

Wednesday, October 15, 2008

కవన సేద్యం

యారాడ.
విశాఖ సముద్ర తీరానికి లేత యవ్వనం లాంటి ప్రకృతి ప్రసాదం ఆ ప్రాంతం.
అమాయకంగా కవ్వించే... ఆ ఏకాంతం, ఆహ్లాదం ఇక్కడే పుట్టిందా అనిపించే...కొండలు, హృదయాలను మమేకం చేసే...పచ్చదనం .....వెరసి , అదొక ఆనంద విహారం. ఒకప్పుడు ఆ యారాడలో అనుభవించిన ప్రేమానుభూతులు ఆంధ్రభూమిలో ప్రచురితమైన ఈ కవితలో నింపాను. చిత్తగించండి ఈ కవన సేద్యం కవితని.
పచ్చని పొలాల పాపిడిలో
మన ఇద్దరి అడుగుల సంగమం
ఉసిరికాయల చెట్టు దోసిళ్లలోన
పురివిప్పిన పసితనపు అస్తిత్వం
ఊటబావి నీటిపైన
నిటారున పడ్డ అరుణకిరణం
తొంగిచూస్తున్న మన ఆశలను
చటేల్మని కమ్మేస్తే
ఆ హృదయపు చేలో
మన కలల విత్తనాలు ప్రసవించిన మొగ్గలు నా కవితలు,
నీ ఙ్ఞాపకాలతో నాట్లు వేస్తుంటే..

పిల్లకాలువలా సిరా ధారా
ధరిత్రిని నూర్పిస్తూ..
ఉద్దీపించిన పంటకుప్ప అక్షరాల సేద్యం
కల్పనలకు అంట్లుకడుతుంటే
అవి కవితా పుష్పాలవుతున్నాయి,
కల్పనలనే నిజం చేసిన నీ ప్రణయపు మేరువులు
ఎన్ని అక్షర మొక్కలను నా కవన క్షేత్రంలో పండించాయే?
జిహ్వగా మారిన
కావ్యమాతే కాళిదాసు అవతారమైతే...
నా జీవాన్నే పరీవృతం చేసిన నీ
అనుభూతులు నా కవనసేద్యానికి సర్వేంద్రియాలు.

శ్రీఅరుణం.

Tuesday, October 14, 2008

త్వరలో నా నవల

మనం బ్రతకడానికి ఏం కావాలి?
నిజంగా బ్రతకాలంటే ఇంత కష్టపడాలా? అనిపించే మనుషులనూ చూస్తున్నాం .
అదే సమయంలో..
బ్రతకడానికి ఇంత నీచపు పనులు చేస్తేగానీ గడవదా? అనిపించే మనుషులనూ చూస్తున్నాం.
మనిషిని పంచుకున్నసంబంధం కోరుకునేది పరిమితం,అందుకే దాని అవసరం తీరిపోగానే.. ఏ భావమూ గుర్తులేనట్లు మారిపోతుంది. అదే మనసులను కోరుకున్న బంధం చాలా లోతుగా వుంటుంది. నమ్మకం అనే వేళ్ళు ప్రతీ క్షణం ఆ బంధాన్ని మరింతగా హత్తుకుంటాయి.అయితే ఇలాంటి బంధాల మెకప్పులు వేసుకుని కొన్ని నీచాలు మనుషులుగా మన మద్యనే తిరుగుతున్నాయి. వాటి పడగనీడలో అనేకహృదయాలు బలయిపోతున్నాయి. వీరి పరిస్థితి చూస్తుంటే... మనకే ప్రాణం మరిగిపోతుందే.... మరి!!! వారి జీవితం ఏమిటి? అలాంటి జీవన్మరణం సమస్య అనుభవించిన మనిషి మనసు స్రవించిన కధే... నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు. విశాఖలో జరిగిన వాస్తవ సంఘటనే ఈ కధ. కన్నీటి రుచి ఇష్టమైన వాళ్ళందరూ దీనిని చదవండి. మొదట 2009 జనవరి నుండి మొదలు అనుకున్నా... ఇంకా తొందరగానే మొదలు పెట్టలని నాకే అనిపిస్తుంది.అందుకే సిద్దమవుతున్నా.
మీ.. శ్రీఅరుణం.

Monday, October 6, 2008

మైల గుండెలు

మనస్పూర్తిగా నమ్మిన ప్రేమ వంచన అని తెలిసినప్పుడు.. ఆ మనసు పడే నరకం పంచుకోలేనిది. అలాంటి నమ్మకం నన్ను వంచించిందని తెలిసిన క్షణం నాలో ప్రవహించిన వేదనా జ్వాలలని ఇలా కవితాధార కురిపించుకోవటం ద్వారా శాంతింపచేసుకున్నాను.నా లాంటి బాధ అనుభవించాల్సిన వారు అవేశంతో తెగించక ,ఈ కవిత ద్వారా శాంతన పడండి.

మైల గుండెలు

గుండెలను కప్పివుంచే చున్నీలు
మొఖం దాచుకోవడానికి పనికొస్తున్నాయి.
బొట్టు మొగుడుకీ,సింధూరం ప్రియుడికీ
పంచుతున్న దొరసానులకే
పసుపంతా వ్యర్ధమై పోతుంది.
సపరేటుగది వున్న ప్రతీ మగాడూ మొగుడే ,
పందుల్ని పక్కకు నెట్టేసి..
ఆ బురదనూ కబ్జాచేసి..దొర్లుతున్నాయి
వావీ వరసల్ని అమ్మేస్తున్న రూపాలు.
బంధాలెప్పుడో కుష్టువ్యాధిగ్రస్తమై పోయాయి.
దాపరికానికి పేరు ప్రియుడయితే..
దొరికిపోతే పేరు తమ్ముడుగా మారిపోతుంది.
వికారానికే వాంతి వచ్చే
శారీరక రుగ్మతలు మనసులను నలిపేస్తున్నాయి.
అదిగో చూడు..మృగాలు వూగుతున్నాయి మానవ రూపంలో,
రెండు అబద్దాలని కలిపి.. ప్రేమ అని నామకరణం చేసేస్తున్నాయి
ఆ మొసం ఆకారం దాల్చి, పరువుల్ని పక్కలకు అమ్మేస్తుంటే..
హృదయాలు సిగ్గుపడి ప్రాచీనతను కప్పుకుంటున్నాయి.
సెల్ ఫోన్ సంభాషణలే శీలాన్ని నిర్ణయిస్తే,
ఒక్క కంప్యూటర్ చాలు..వేశ్య సంసారి కావటానికి.

అవసరం శృతిమించితే ..
మనం పెట్టించిన కన్నీరు..మన ప్రేగులనే చింద్రం చేస్తుంది.
పక్క దులిపితే చెదిరిపోయే దుమ్ములా..
మొహం నీకు మొఖం చాటేస్తుంది.

మొత్తం మీద ..
అందరి భుజాలూ నిన్ను రాసుకొని తిరుగుతుంటాయి,
గుండెలని మాత్రం నీకంటించకుండా!

శ్రీఅరుణం ,
విశాఖపట్నం.

Wednesday, October 1, 2008

మలచిన వేదన

ఎంతో కష్టపడిన జీవితంలో సమస్యలు సుడిగుండాలుగా చుట్టుముడితే, నా అనుకున్న వారంతా... మన అస్తిత్వంపై దాడి చేస్తే..ఆ వేదనలో జీవితంపై కలిగే విరక్తిని తన జీవితానికి పాజిటివ్ గా మార్చుకున్న మనిషే...ఈ మలచిన వేదన కవిత

చచ్చిపోవాలని వుంది
బ్రతుక్కు..చావే మార్గమైన చోట,
ఎంతమంది చావటం లేదు?
ఈ రేషన్ సమాధుల మద్యన.

డబ్బుల కుప్పలు పోసుకున్న
నడమంత్రపు సంబందాల...
చేతబడుల కుటుంబాలల్లో
అగ్గిపెట్టె కరువైతే..పెద్దరికం
కత్తెలమోపై ..పొయ్యిలో విరిగిపోతుంది.

నీ జన్మకు గుర్తింపు
పెరిగే ప్రతీ డిపాజిట్టూ లెక్కిస్తుంది,
కట్టలు చూసే చేతులు కడుపును పట్టించుకోవు
మెకాలి చిప్పల కేకలు వినిపించుకొనే జాలి
ఇక్కడెవరికీ తెలీదు.
యంత్రంలా నువ్వు ,మంత్రంలా జీవితం,
తంత్రంలా తాపత్రయం కలిసి గెలిచినంతవరకే..
వీరిఫంక్తిలో నీకు భొజనం .
ఒక్కసారి తడబడ్డావా ??
నీ ఆకులో విషం వడ్డించబడుతుంది!
నీ కొసం తద్దినం ఎదురుచూస్తుంది.
నీకోసమూ ఎదురుచూస్తారు..
భీమా డబ్బు రాగానే చివరి కన్నీటి బొట్టునూ
దుప్పటితో తుడిచేస్తారు .

అది తెలిసే ఇప్పుడు చావలనిపించడం లేదు,
ఆస్తి ఎంతున్నా..చావులో అస్తిత్వం లేదు,
అందుకనే మరణించిన మరుసటి రోజున
ఉదయించే నా ఙ్ఞాపకాలను ఇప్పుడే నిర్మించుకుంటున్నాను.
తెలియని నా మరోజన్మ కొరకు
ఎదురుచూడగల సేవల పరమార్దాన్ని
నా జీవనానికి రవళించుకుంటున్నాను.

శ్రీఅరుణం,
విశాఖపట్టణం
.

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.