Friday, December 27, 2013

ప్రేమంటే?......

ఏడడుగులూ...
1. ప్రేమంటే?
శరీరం చెబుతుందా
మనసు పిలుస్తుందా
2.పెళ్ళంటే?
గుడిలో వేసిన మూడుముళ్ళా
గుండెలో వేసిన బిగికౌగిళా
3.విరహం???
వదిలేస్తే పుడుతుందా?
వదిలించుకుంటే వెంటపడుతుందా
4.వాంచ..?
నీ ప్రేమ కోసం.. నేను పుట్టాలనుకోవటమా
నా కోసం.. నువ్వు మరణించాలనుకోవటమా
5.బ్రతుకు ?
నువ్వు జీవించాలనుకున్నప్పుడా
నేను నిన్ను బ్రతికించినప్పుడా
6.మంచి ?
మనం నమ్మేదా
మనల్ని నమ్మించేదా
7.మనసు ?
నాలో నువ్వా
నీలో నేనా
డిసెంబర్14న ఆవిష్కరించబడిన నా కవితా సంపుటి "నీ అడుగులలో...నా ఙ్ఞాపకాలు..." నుండి.
పుస్తకానికై నాకు కాల్ చేయండి.
మరియు, 2014జనవరి5 నుండి kinigi.com ద్వారా ఇ-పబ్లిష్ గా లభ్యమవుతుంది. 
శ్రీఅరుణం
9885779207  
[ప్రస్తుతం ఒక పని మీద మీ అందరికీ నెలరోజులు దూరంగా వుండాల్సిరావటం జరుగుతున్నందుకు బాధగా వున్నాతప్పదు. మళ్ళీ ఫిబ్రవరి5న కలుద్దాం]

Monday, December 16, 2013

సృష్టి మొదలై యుగాలవరకూ ......

నా మొదటి మాట
సృష్టి మొదలై యుగాలవరకూ సాగిపోతున్న ఈ జీవనగమనంలో "ప్రేమ"  నిరంతర సాహిత్యసంపదగా ఫరిఢవిల్లుతూనేవుంది.
దానికి పరిధి  లేదు, అంతరాలు లేవు, సంధర్భం లేదు, సమయభావన అస్సలుండదు. కానీ....
తెలియదనుకొనీ తెలిసినట్లూ..
వద్దనుకొనీ కావాలనుకున్నట్లూ..
ఆంతర్యానికే సమాధానం చెప్పుకోలేని భావనాపరంపరను మన హృదయాలలో నింపేసేది ప్రేమ.
అంత అపురూపమైన సంపదను మనకందించే మనసుని సృష్టించి ఇచ్చిన భగవంతునికి మనం ఏమిచ్చి రుణం తేర్చుకోగలం? మరి.... ఈ ప్రేమ పేరుతో ఇప్పుడు సాగుతున్న దాష్టికాలకు ఏదో విధంగా కారణాభూతులం అవుతూ., ఆ దేవుని దయను మనం నాశనం చేసుకోవటం లేదూ?
బ్రతకటం భౌతికత్వం
జీవించడం అభౌతికత్వం
ఈ రెండిటి కలయికే మానవజీవితానికి పరమార్ధం. చదువు,  కీర్తీ, డబ్బూ,ఉద్యోగం ఇవన్నీ కావాలి బ్రతకడానికి.  వాటితో పాటూ ప్రేమ కావాలి జీవించడానికి.  బ్రతకటం మాత్రం తెలుసుకుంటే, నువ్వు నీచుట్టు పక్కల అందరికీ సమాధానం చెప్పగలవు.  కానీ జీవించడం కుడా నేర్చుకుంటేనే.. నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలవ్. అప్పుడే సంపూర్ణ మానవుడివవుతావు. ఆత్మసాక్షిలేని గమనం జనాభాలెక్కలకే పనికొస్తుంది.
అందుకే ఈరోజున అర్ధమే మారిపోయిన ప్రేమ గురించి నేను చేసిన పరిశోధనా పత్రం ఇది. నన్ను నేను అర్పించుకున్న ప్రేమ నాకు అందించిన మనఃసాక్షి ఈ నాలుగు అధ్యాయాలు.
ఇది ప్రేమించాలనుకొనేవారికి ప్రేమ సన్నిధిని చూపెడుతుంది.
ఇది ప్రేమలోని వియోగం అందించే కన్నీటి బరువునూ చూపెడుతుంది.
ఇది ప్రేమవియోగపు అనియంత్రిత ఖేదం చూపెడుతుంది.
ఇది ప్రేమవియోగపు అనియంత్రిత ఖేదం నుండి మనిషిగా మనం సాధించాల్సిన మోక్షం ని తెలుపుతుంది.
from my book నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు...
for  book
శ్రీఅరుణo
9885779207

Sunday, December 15, 2013

మీరు చూపిన అభిమానానికి శిరస్సువంచి నమస్కరిస్తూ....






ప్రస్తుతం...సాహిత్యానికి అంతగా ప్రోత్సాహం లభించటంలేదనేవారిని కొందరిని చూశాను. అంత ఓపిగ్గా పుస్తకాలు చదివేవారు తగ్గిపోయారు అనేవారినీ విన్నాను. అయినా ఈ సాహిత్యవనంలోకి ప్రవేశించాను.  శ్రీఅరుణం గా నాకు లభించిన సాహిత్యపరమైన గుర్తింపే ఈ పుట్టినరోజు. అన్నివిధాలా నాకంటే ఎందరో పెద్దవారు నాకు బ్లాగ్ ద్వారా, ఫేస్ బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, మెయిల్స్ ద్వారా, ఫోన్ ద్వారా  జన్మధిన శుభాకాంక్షలను తెలపటం, అలాగే నా 2వ పుస్తకం ఆవిష్కరణ సంధర్బంగా ఆచార్య దామెరవెంకట సూర్యారావుగారు, ఆచార్య వెలమల సిమ్మన్నగారు, శ్రీ నండురి రామకృష్ణగారు, విశాఖ సాహిత్య భీష్మాచార్య కొసనాగారు వంటి గొప్పసాహిత్యవేత్తల నడుమ కూర్చునే బాగ్యం నాకు కేవలం ఆ సాహిత్యరంగంలో వుండటం వల్లనే లభించింది.  మీరందరి దగ్గరా నేను చాలా చిన్నవాడిని. అయినా నాకోసం మీరు చూపిన అభిమానానికి శిరస్సువంచి నమస్కరిస్తూ ...
మీ
శ్రీఅరుణం
9885779207

Friday, December 13, 2013

ఒక అందమైన ప్రేమ సాయంకాలం గడపాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. అది నా ప్రేమకవితల కవితా సంపుటి "నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు" ఆవిష్కరణ 14/12/2013 శనివారం, సాయంకాలం 6 గంటలకి విశాఖ పౌరగ్రంధాలయం, ద్వారకా నగర్, బి.వి.కె.కాలేజ్ ఎదురుగా, ఆర్.టి.సి.కాంప్లెక్స్ వద్ద, విశాఖ,
రండి అందరం ఆ ప్రణయానుభూతులను పంచుకుందాం
శ్రీఅరుణం
9885779207 

Sunday, December 8, 2013

నా 2వ పుస్తకం ఆవిష్కరణ.




అనివార్య కారణాలవల్ల కొన్ని చిన్న మార్పులతో నా 2వ పుస్తకం ఆవిష్కరణ. అందరూ రావలసిందిగా ఆహ్వానం
శ్రీఅరుణం
988577920

Friday, December 6, 2013

తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది

తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది
"తెలంగాణా నాది", "రాయలసీమ నాది", "నెల్లురు నాది", "సర్కారు నాది"
అన్నీకలిసి మంటగలిసిన.....

                                                        తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది.
విభజనవాదం పుట్టిందీ తెలంగాణానగరంలో...
సమైక్యవాదం పుట్టింది సీమాంద్రనగరంలో...
ఈ రెండూకలిసి.... ఏదిచేసినా...
డిల్లీరోడ్డున పరువుపోయింది
మనదే మనదే మనదేరా..  

                                                         తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది.
ఇటలీమాత పుట్టినరోజుకు తెలుగునే కేకుగా అందించామూ
పక్కరాష్ట్రల కుళ్ళంతా జి.ఓ.యం.గా మారి నరికితే...మనలోమనమే కొట్టుకుచస్తున్నామూ
పిచ్చికుక్కలకు పరువునప్పగించి ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నామూ
స్వార్ధపు అవసరాలకై తెలుగుతల్లినే లాడ్జీగా మరుస్తున్న వారినెందుకు భరిస్తున్నామూ???
                                                             తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది.
ఇప్పుడందరికీ తెలిసింది..తెలుగువారంటే ఎంత వేస్టుగాళ్ళో...
ఈరోజే ప్రపంచానికి తెలిసిందీ మనిళ్ళల్లో "మమ్మి, డాడీ"లెందుకు  పెరుగుతున్నారో...
ఈ ప్రాచీనభాష పిచ్చెక్కిపొయి పార్ధివమైపోతుంటే
అందంగా విడిపోయిన రాష్ట్రల నవ్వులపాలైపోతున్నామూ 
                                                                తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది.
మనం మనం తన్నుకుంటే... పైవాడేం చేశాడు?
ఏదీపంచటం చేతకాక ,,,కొట్టుకుచావండన్నాడు...
రాష్ట్రమున్నా రాజధానిలేని అనాధరా ఒక ప్రాంతం
రాజధానున్నా హక్కులులేని బిచ్చగత్తె మరోప్రాంతం.....  
                                                                    తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది.
 [నా తెలుగురాష్ట్రం ఇంత అసంబద్దంగా విడిపోతున్నందుగు కన్నీళ్ళతో...}
శ్రీఅరుణం

Thursday, December 5, 2013

మొహo.................

నా చుట్టూ...
విశాలమైన లోయ అల్లుకుంటుంది?
దాని మొహానికి నా మధనం మెళికపడుతుంది...
ఆ చలనానికి అడ్డూపడాలని నా చక్షువులు....
వీక్షణల శరాలతో యుద్దం ప్రారంబించాయి,
పక్కనేవచ్చి కూర్చున్న చీకటి
ఏవేవో సలహాలనిస్తుందని...వింటూ వుండిపోయిన నా...
మస్తిష్కానికి వెలుగురేఖల్ని సమాధానంగా అందించి
వెళ్ళిపోయింది వేగంగా,
అంబరాన్ని ప్రశ్నించటం నేర్చుకున్న ఆశలు అప్పుడే
కాగితంపై పొర్లాడటం తెలుసుకున్నాయి.
ఆ శక్తి అందించిన తెగింపుతో...లోయలోకి దూకేశాను,
చాలాసేపు పయనించిన ఆ దారిలో పాదాలను తాకిన స్ఫర్శ
"ఆ ఇక బయలుదేరు మళ్ళీ"అంటూ పైకి తోస్తుంటే....
ఇప్పుడు
నా అదిరోహణం ఎగబ్రాకుతుంది అనుభవాన్ని ఆలంబనగా చేసుకుని
ఆ పయనంలో దొరికిన కలాన్ని మోసుకుంటూ...
శ్రీఅరుణం




Tuesday, December 3, 2013

కవిత్వం రాయాలంటే......

కవిత్వం రాయాలంటేకలానికి కన్నులు మొలవాలి
అవి వీక్షించే కలలనే
కాగితం కౌగిలించుకుంటుంది,
కనుమరుగవని ఙ్ఞాపకాల నిధులు
రాతలుగా వరసలు కడతాయి,
కావ్యరసం వొలికిపోతూ..హృదయపుజిహ్వకు
దాసోహమవుతుంది,
అప్పుడే కవి జన్మిస్తాడు.
జలగలా మారిన వంచన
హృదయపుమూలుగులోంచి తడిని
పీల్చిపారేస్తుంటే..
పాలిపోయిన కళ్ళు గ్రుడ్డివైపోయాయి,
ఆశల వెలుగులో విరజిల్లిన కల్పనల కాంతులు
కనుల ముందు వికటాట్టహాసం చేస్తూ..ప్రేలిపోయాయి,
చేతులలోని పాపాయిని లాగేసుకున్నట్లు..
స్వార్ధం నమ్మకాన్ని భేర్లు కమ్మించింది.
ఆ ప్రళయానికి ..
ఆలోచనలకు పక్షవాతం వచ్చి
మస్తిష్కం మొద్దుబారిపోతుంది,
ఇక అంతా శూన్యం!
కలం,
కాగితం,
కల్పన,
కవిత్వం.


 శ్రీఅరుణం.

Sunday, December 1, 2013

నువ్వు .....నేను.....


నేను నిన్ను కలవటానికి ముందు...
నాకు నువ్వు నిజం చేసుకోవాలనుకున్న కలవి,
నిన్ను నేను కలిసిన తరవాత...
కలయో? నిజమో? తెలియని అయోమయానివి,
మనం లాక్కొచ్చిన నిన్నటివరకూ...
నువ్వు ఎప్పటికైనా నిజమవుతావోనన్న ఆశవి,
ఇప్పుడు మాత్రం...
నా కలలకి మిగిలిన ఙ్ఞాపకానివి.

{from my 2nd book  "నీ అడుగులలో...నా ఙ్ఞాపకాలు..."nundi}
ప్రేమను నమ్మేవారందరికోసం ఇప్పటివరకూ పబ్లిష్ అయినవి మరియూ మరికొన్ని కలిపి నా ప్రేమకవితలన్నిటినీ కవితాసంపుటిగా మలచి  "నీ అడుగులలో...నా ఙ్ఞాపకాలు..."గా కళావేధికవారి అధ్వర్యంలో డిసెంబర్ 14న ఆవిష్కరించబోతున్నారు. మరిన్ని వివరాలు మరో రెండురోజుల్లో చెప్పుకుందాం.
మీ
శ్రీఅరుణం





Thursday, November 28, 2013

నా రెండవ పుస్తకం "నీ అడుగులలో...నా ఙ్ఞాపకాలు..."


ప్రేమను నమ్మేవారందరికోసం ఇప్పటివరకూ పబ్లిష్ అయినవి మరియూ మరికొన్ని కలిపి నా ప్రేమకవితలన్నిటినీ కవితాసంపుటిగా మలచి  "నీ అడుగులలో...నా ఙ్ఞాపకాలు..."గా కళావేధికవారి అధ్వర్యంలో డిసెంబర్ 14న ఆవిష్కరించబోతున్నారు. మరిన్ని వివరాలు మరో రెండురోజుల్లో చెప్పుకుందాం.

మీ
శ్రీఅరుణం

Tuesday, November 26, 2013

జై వీర జవాన్.....


ముకులించిన కోట్ల జోతలు
వదలలేని కన్నీటి వీడ్కోలు
కదనరంగంలో ఫణంగా పెట్టిన
ప్రాణం విలువను  చెప్పకనే చెబుతున్నాయి,
ఉరితాడు
రైలుపట్టాలు
పురుగుమందులు
నరికివేతలు
కాల్పుల చిట్టాలు
ఇవికావు చావంటే!
మరణంకూడా మనసున్నదే,
చనిపోయిన మరుసటి క్షణం నుండీ ఉదయించే నీ ఙ్ఞాపకాలనే అది ప్రేమిస్తుంది,
ప్రేమించామనీ
వంచించబడ్డామనీ
తెగనరికామనీ
తెగించలేకపోయామనీ
కుళ్ళిపోతూ
కుమిలిపోతూ
భయపెడుతూ
భాదపడుతూ
కాష్టం వైపు నడిస్తే
నీ ఆత్మకూడా వెంట రాదు.
నమ్మిన వంచకాలు
నమ్మని నిజాలూ
ఆశించిన ధామలూ
అనుభవించని శవాలూ
ఇవికాదు...మన చావుకు కారణాలు!!!
ఏ సంబంధం వుందని..ఉన్నిక్రిష్ణన్ తెగించాడు?
నువ్వేమవుతావని..సాలస్కర్ సాగిపోయాడు?
నా ఒక్కడితో ఏమవుతుందనుకుంటే???
వందకోట్ల మనల్ని రక్షిస్తున్న
జవానులు ఎంతమందుంటారు?
లోపల నీ ఆనందం కోసం
బయట..తమ గుండెకాయల్ని పేర్చి
కాపుకాస్తున్న ఆ త్యాగాలకు మనమందిస్తున్నదేంటి?
చావంటీ అందరికీ ఒకటే..
మనిషికీ
ముష్కరులకీ
మరి..చచ్చాక.. బ్రతుకింకా ఉండేది ఎవరికీ?
మనకోసం మరణించిన
వీరులకి నివాళులివ్వాలంటే..
మన చావుకూ పవిత్రత వుండే..జీవితాల్ని ప్రేమిద్దాం,
మన ప్రేమే వారికి దన్నుగా  దేశమాత సన్నిధిలో తరిద్దాం.
[26/11 వీరులకు వందనాలతో...]
శ్రీఅరుణం

Saturday, November 23, 2013

రిజర్వేషన్ లెక్కలలో మన జీవితాలు...

ఇది పోటీ ప్రపంచం. పుట్టిన నాటినుండే అవసరాలకు వరుసలు కట్టాల్సిన బ్రతుకులు మనవి. ఆ ఎమోషన్ లేకపోతే మనకి కూర్చునే రేషన్ కూడా మిగలదు. ఒక్కొక్కదానిలో ఒక్కొక్కరకం పోటీ వుంటుంది. దానిని తట్టుకొని నిలబడిన వారి ముందుకు వెళతారు. మరి మిగిలినవారు సంగతేంటని ప్రశ్నిస్తే??? అది కోటి డాలర్ల ప్రశ్నగా వినతికెక్కుతుంది. ఒక రకంగా ఇప్పుడు మనముందు గెలుపుకోసం జరుగుతున్న ఈ ప్రయత్నాలన్నీ అలా ఓడిపోతున్న వారికోసమే.
ఒక ప్రభుత్వ ఉద్యోగాన్నే తీసుకుంటే... రెండువందల ఉద్యోగాలకి రెండు లక్షలమంది పోటీపడుతున్నారు. అంటే ఒక ఉద్యోగానికి నీతో పోటి పడేవారు సుమారుగా వెయ్యిమంది. ఇందులోనే నువ్వు మెరిట్ సాధించాలి, దానితో పాటూ పిచ్చిపిచ్చిగా లెక్కలకందని రోస్టర్ పాయింట్లనేవి చాలా వుంటాయి...వాటిల్లో కొన్నింటిని చుద్దాం ఇప్పుడు.
రిజర్వేషన్లు:- ఇందులో మొదటిరకం. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు మంచివని దేశం రాజ్యాంగబద్దమయినప్పుడు, కొంతకాలానికై మొదలుపెట్టిన ఈ రిజర్వేషన్లు అర్ధ శతాబ్దం దాటిపోయినా ఏం సాధించాయో...మరో శతాబ్దం దాటినా తరువాత కూడా అక్కడే వుంటాయన్నది మన రాజకీయాల సాక్షిగా నేను చెప్పే నిజం. అందరికీ తెలిసీ జరగబోయే వాస్తవం కూడా. ఇవి ఎవరికేమి ఇస్తున్నాయో పక్కన పెట్టి పోటిలో వున్న మెరిట్ అభ్యర్ధులని మాత్రం నాశనం చేస్తున్నాయన్నది నిజం. ఇటివల వెలువడిన ఒక ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షాఫలితాలలో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్ధుల జాబితా చూడండి.
కేటగిరి - ఉద్యోగానికి ఎంపికైన ర్యాంకూల్లొ కనిష్ట నెంబరు {మొత్తం ఉద్యోగాలూ 64 మాత్రమే.}
ఒ.సి.------------------మగవారు 18వ ర్యాంక్ వరకూ./ ఆడవారు 483వ ర్యాంకు వరకూ = 23మంది
బి.సి. {అన్నికేటగిరులూ కలిపి}---మగవారు 2027ర్యాంక్ వరకూ / ఆడవారు 2720 వరకూ = 22 మంది.
యస్.సి---------------మగవారు 1082 ర్యాంక్ వరకూ / ఆడవారు 1566 ర్యాంక్ వరకూ = 10మంది
యస్.టి.--------------మగవారు 1410 ర్యాంక్ వరకూ / ఆడవారు 6940 ర్యాంక్ వరకూ = ఐదుగురు.
మిగిలిన కేటగిరులు కొన్ని వున్నాయి. వాటి పరిస్థితీ పెద్ద తేడా ఏమీ లేదు. ఇక్కడ నమ్మాల్సింది ఏమిటంటే...గెలుపూ ఓటమి మధ్య అసలు సంబంధమేలేదని. ఒ.సి అయ్యుండి 19వ ర్యాన్ వచ్చిన వ్యక్తికీ మరో నలబై ఉద్యోగాలున్నా ఓటమి దాపురించింది. బి.సి.ల్లో 2027వ ర్యాంక్ వచ్చినా ఒకతనికి ఉద్యోగంవచ్చింది, అదే బి.సి లలో 27వ ర్యాంక్ వచ్చినా మరొకతన్ని ఓటమి పలకరించింది. యస్.సి.ల్లొ 1082 ర్యాంక్ కి జాబ్ వచ్చింది. అదే కేటగిరిలో 427కి జాబ్ లేదు. యస్.టిలకు 1410 ర్యాంక్ వచ్చిన అతనకి ఉద్యోగం పలకరించగలిగింది. సరే, వారిలో అదే మొదటి ర్యాంక్ కనుక తప్పదు. మొత్తం మీద 65 ఉద్యోగాలకోసం జరిపిన రిజర్వేషన్ల లెక్కలలో కనిష్టంగా ఒకటవ ర్యాంకు నుండీ...6940 ర్యాంకుల వరకు జూదం ఆడాల్సి వచ్చింది.
65 ఎక్కడా? 6940 ఎక్కడా?
ఇదేనా సామాజిక సంక్షేమం?
ఇదేనా కష్టానికి దొరుకుతున్న ప్రతిఫలం?
ఇదేనా అక్షరఙ్ఞానాన్ని మనం నిలుపుకొనే నిజం?
ఈ లెక్కలను తెలుసుకున్నవారు పోటిప్రపంచంలో నిజమైన నమ్మకంతో నడుస్తారా? ఒక్కసారి ఆలోచించండి...మీరు సాగిస్తున్న రోష్టర్ పాయింట్ల క్రింద నలిగిపోతున్న నా వాళ్ళను.
నేనిక్కడ ఒక మతాన్నో , ఒక కులాన్నో, ఒక వర్గపు ప్రయోజనాలనో విమర్శించటం లేదని ముందు గమనించండి.
చదువు విలువ తెలిసిన వారే అది సాధించటానికి పడే బాధని అర్ధం చేసుకోగలరు.
అన్నం విలువ తెలిసిన వారికే ఆకలి కేకలు వినిపిస్తాయి.
నిజానికి నేనూ రిజర్వేషన్ వర్గానికి చెందినవాడినే. కానీ నాకంటె బాగా చదివి, నాకంటే మంచి విఙ్ఞానం కలిగివుండీ, ఆకలి బాధనుకూడా త్యజించి చదివి ర్యాంక్ సాధించిన, నా స్నేహితుడికి రాని అవకాశం ... సరదాగా రాసి బోటాబోటీ ర్యాంక్ సంపాధించగలిగిన మరో కడుపు నిండిన స్నేహితుడికి వచ్చినప్పుడు....నేను అనుభవించిన విచిత్రమైన పరిస్థితే ఇక్కడ చాలామంది అనుభవిస్తున్నారు. అణగారిన వారికోసం అవకాశాలు మంచివే. కానీ వారిని ఎంతకాలం అణగారిన వారుగా వుంచుతూ...తమ జీవితాలనే మార్చుకుంటున్న సరస్వతీ పుత్రులను ఇంకెంత కాలం అణగారుస్తాం? ఇదే ఫలితాలలో 1410వ ర్యాంక్ వరకు రాగలిగిన యస్. టి. సోదరుడే, యస్,టి,లలో మొదటి ర్యాంక్ సాధించినవాడంటే... సమస్య ఎక్కడుంది?
రాసిన పరీక్షహాలులోనా?
చదివిన పుస్తకాలలోనా?
వారు పుట్టిన కేటగిరి లోనా? ఎక్కడుంది నిజమైన సమస్య?
రాజ్యాంగం షష్టిపూర్తి చేసేసుకుంటున్నా... మారని మన రాజకీయాల స్వప్రయోజనాలు...ప్రజల పరిస్థితులను మాత్రం పసిప్రాయంలోనే సాగదీయటం వల్ల కాదూ? వెయ్యవ ర్యాంక్ సాధించిన వారికి ఉద్యోగం ఇవ్వటం కంటే... వారూ ఒకటవ ర్యాంక్ కి వచ్చేలా విధ్యావ్యవస్థని ఎందుకు చిత్తశుద్దితో సంస్కరించరూ? ఇక్కడ ఆలోచించండి మన ఓటమి క్షణాల గురించి.
from my book    "అంతర్ భ్రమణం"నుండి
 లభ్యమయ్యే ప్రదేశం
శ్రీ వెంకటేశ్వరా బుక్ డిపో, విజయవాడ, విశాఖ,హైదరాబాద్.
మరియు నా నెంబర్ కీ కాంటాక్ట్ చేయండి 9885779207,
మరియూ... నా ఇంటర్ నెట్ స్నేహితులందరికోసం
http://kinige.com/kbook.php?id=2298&name=antar+bhramanam
ద్వారా ఇ.పబ్లిష్ గా కూడా లభ్యమవుతుంది.

శ్రీఅరుణం  














Tuesday, November 19, 2013

కామం[sex]...????!!!!

  మనకోసం మనం ఏర్పరుచుకొన్న సమాజంలో ఇలాంటి దుశ్చర్యలు పాదుకొనిపోతుంటే...ఎవరి వ్యక్తిగతం వారిది అని వదిలేస్తామా? మన ఆదర్శాలను అవి ధ్వంసం చేస్తుంటే...వాటిపై తిరగబడేంత నరాల సత్తువ కూడా మనలో లేదా? ఇలా వదిలివేస్తున్నందువల్లనే...ఇలాంటి వీడియోలూ, ర్యాగింగులూ, అత్యాచారాలూ, వరకట్నం వంటివి స్త్రీలను ఇంకా ఆటబొమ్మలుగా వుంచుతున్నాయి.
కామం అనేది ఇద్దరు స్త్రీపురుషుల  మధ్యన జరిగే ఒక మనసిక కళగా చెప్పిన వాత్యాయనుని కామసూత్రన్ని గౌరవించండి. జీవితంలోనే అలౌకికమైన అనుభూతిని అందించే కామరహస్యాన్ని అర్ధం చేసుకోండి. ప్రేమతో నిండిన ముద్దు కూడా నీకు జీవిత కాలం ఆనందించగలిగే అనుభూతిని అందిస్తుందన్న సత్యాన్ని, అనుభవపూర్వకంగా చెబుతున్నా నమ్మండి. "వస్తాను నాకోసం చూస్తుండు" అని నా ప్రేయసి నాతో చెప్పిన ప్రేమ పలుకులే, నా ఊహలతో  ఆశలై.. నాకు కవిగా గొప్ప అనుభూతులను అంధించగలిగాయి.  ఇక ఆమె నా కౌగిళిలోకి వస్తే...అంతకంటే కామం నాకు ఏ దేవుడివ్వగలడు? అదే మీ ఆశ కావాలి కామసుఖం కొరకు.
వాంఛనీయమైన శృంగారానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి వివాహం. రెండు, నీకోసం ఏదైనా చెయ్యగల తోడుని అందించగలిగే ప్రేమ. ఇవిలేకుండా పొందే కామం... కేవలం అవసరం లేదా వ్యాపారం అంతే. అది మనిషికైనా పశువుకైనా ఒకటే. అలాకాకుండా...
సంద్రపు ఇసుక తిన్నెలపై...
పౌర్ణమి అందాన్ని వీక్షిస్తూ...
కెరటాల నీటితుంపరలు చల్లచల్లగా పలకరిస్తుంటే...
గాలికూడా దూరనంతగా బిగికౌగిళి బంధించివేస్తూండే అధ్బుత క్షణాలను అనుభవించి చూడండి.
ప్రేమ మాత్రమే నిండిన రెండు అరసున్నలవంటి స్త్రీపురుషుల శరీరాలూ ఆత్మలూ సంగమిస్తుంటే... అలాంటి కామంకోసం ఆనందంగా చచ్చిపోవాలన్న  ఎదురెళ్ళమూ....?
from my book    "అంతర్ భ్రమణం"నుండి
 లభ్యమయ్యే ప్రదేశం
శ్రీ వెంకటేశ్వరా బుక్ డిపో, విజయవాడ, విశాఖ,హైదరాబాద్.
మరియు నా నెంబర్ కీ కాంటాక్ట్ చేయండి 9885779207,
మరియూ... నా ఇంటర్ నెట్ స్నేహితులందరికోసం
http://kinige.com/kbook.php?id=2298&name=antar+bhramanam
ద్వారా ఇ.పబ్లిష్ గా కూడా లభ్యమవుతుంది. 
శ్రీఅరుణం  



Thursday, November 14, 2013

నియంత్రణరేఖ. 1వ సీన్ నా 100వ పోస్ట్ ద్వారా

జీవితంలో అన్ని దొరకవు కానీ, దొరికించుకునే మార్గాలుమాత్రం మనకెప్పుడూ అందుబాటులోనే వుంటాయి.  ఇదే నకు అనుభవపూవకంగా తెలిసిన సత్యం. చాలా విషయాలలో నేనూ ఓడిపోయాను. వాటిల్లో నా శ్రమ,నమ్మకం కంటే నాపై మరొకరు చూపించిన ఆధిపత్యమే నిండిపోయింది. కానీ నాకున్న స్వేఛ్చని సంపూర్ణంగా వినియోగించగలిగిన సాధన ఒక్క రచనావ్యాసంగమే. అందులోనూ నేను ఇంటర్ నెట్ ద్వారా మరింత ప్రయోజనం పొందలిగాను. దీని ద్వారానే నా కవితలు చాలామందికి దగ్గరయ్యాయి. నా అభిప్రాయాలు చాలామందితో పంచుకోగలిగాను. వాటన్నిటినీ క్రోడీకరించుకుంటూ నేను రాసిన అంతర్ భ్రమణం పుస్తకం విక్టరీ వారిద్వారా, తరువాత కినిగి.కాం ద్వారా పబ్లిష్ అయ్యి మంచి పేరు తెచ్చాయి. అందుకు నా మిత్రులందరికీ నేను కృతఙ్ఞతలు.
ఇప్పుడు నియంత్రణరేఖ అనే మల్టీ స్టారర్ సినిమా స్టోరీ రాసే పనిలో వున్నానంటూ నేను బ్లాగ్ లో పెట్టగాఏ సుమారు 1000మందివరకూ దానిని ప్రోత్సహిస్తూ నన్ను కదిలించారు. అందుకే వారికోసం అందులోని మొదటి సీన్ ను ఇక్కడ పెడుతున్నాను. మీ ఆశీర్వచనాలతో అతిత్వరలో దీన్ని పూర్తీచేసే పనిలో వున్నాను. చదివి ఎలా వుందో తెలుపుతూ, నన్ను మరింత ఉత్సాహంగా ముందుకునడిపే మీ అభిప్రాయాలను పంపుతారని ఆశిస్తూ...నా 100వ పోస్ట్ ను మీముందుంచుతున్నాను. 
మీ... శ్రీఅరుణం
సీన్ 1
"ట్రింగ్...ట్రింగ్...ట్రింగ్"
రాత్రి ఒంటిగంట సమయం. రెండు ఫొన్లు కలుసుకున్నాయి.
"సులేమాన్! ఎలాగైనా మీరిప్పుడున్న టౌన్ లో విధ్వంసం సృష్టించగలగాలి, లేకుంటే మనం ఉత్త చేతుల్తో మిగిలిచావాల్సొస్తుంది"ఒక వృద్ధకంఠం అదే ఆదేశంగా చెప్తుంది.
"అదికాదు సాబ్! ప్రస్తుతం మన పొజీషన్ ఏంటి?"
"నిజం చెప్పాలంటే మనకిప్పుడు పొజీషనేలేదు"
"సాబ్! మీరు మరీ ఎక్కువ టెన్షన్లో వున్నట్లున్నారు..."
"లేదు. బాగా ఆలోచించిన తరువాతనే ఇలామాట్లాడవలసి వస్తుంది. మనకున్న పరిస్థితి దృష్ట్యా... మనం పొజీషన్ గురించి ఆలోచించే స్థాయిలోకాదుకదా, కనీసం ఊహించేస్థితిలోకూడా లేము. ఇది నాలో వున్న టెన్షన్ తో కాదు, అనుభవంతో చెబుతున్న వాస్తవం. దానికోసమే మనం వీలైనంతత్వరగా ఏదైనా ఆపరేషన్ చేయాలి"
"కానీ ఆపరేషన్ చేసేంత ఎక్వీప్ మెంట్స్ మనదగ్గర ప్రస్తుతానికి అందుబాటులో లేవుకదా సాబ్?"
"అందుబాటులోకి తెచ్చుకోవటానికేగా ఈ ప్రయత్నం"
"ఏం చేద్దామంటారు?""మన దగ్గర ఇప్పుడున్న ఆయుధాల మీద నీకు ఐడియావుందా?"
"ఆ! చాల తక్కువ. ఇంతక్ముందు స్టాక్ పెట్టిన అర్.డి.యక్స్., డిటోనేటర్స్ మొన్నటి దాడిలో వాళ్ళచేతుల్లోకి వెళ్ళిపొయాయి. మనవాళ్ళు తప్పించుకోగలిగారుకానీ, కొన్ని హ్యాండ్ సెట్స్ తప్పించి ఎవరికీ సరిపడినంత వెపన్స్ మిగుల్చుకోలేకపోయారు. దట్స్ వై, నౌ ఉయ్ ఆర్ ఇన్ క్రిటికల్ పొజీషన్ సాబ్"
"చూశావా పరిస్థితి నువ్వే చెప్పేశావ్"
"నిజమే కానీ కమాండోల స్థాయిలో వున్న మేమే పరిస్థితి తీవ్రతని బయంకరంగా చూపితే అందరూ డిస్టర్బవుతారనీ..."
"ఆ. ఆ. అందుకేకదా నా అనుభవంతో ఆలోచించి ఇంతరాత్రప్పుడు ఫోన్ చేసింది. సరే. కావలసినంత మనదగ్గరలేనప్పుడు వున్నదానితోనేఆలోచించగలగటం వివేకవంతుని లక్షణం. మనదగ్గర వున్నది అయిపోయేలోపు బయటనుంచి అందుకోగలగాలి. పైనుండి మెసేజ్ వచ్చింది. వారిదగ్గర మనకు కావలసిన వెపన్స్, ఇతర అవసరాలూ సిద్ధంగా వున్నాయట. కాకపోతే లోపలున్న సెక్యూరిటీ ఎక్కువవటంవల్ల ఇబ్బందిగా మారిందట. అందుకొరకు ఇక్కడున్న సెక్యూరిటీ చూపుల్ని మరల్చేలా మనల్నే ఏదైనా??? సృష్టించమంటున్నారు..."
"అదేంటిసాబ్. ఇంత సెక్యూరిటీ పరిధిని చూపు మరల్చాలంటే మనం చేసేదానికీ పరిధి ఎక్కువే వుండాలికదా. అంత అవకాశం మన చేతిలోలేకేకదా ఈ బాధంతా. మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావిస్తే...ఎ..లా..."
" భాయ్. సాధ్యమైనవి అందరం చేస్తాం. అసాధ్యమైనవి కొందరే చేస్తారు. అలాంటివాటికోసం దారి ఎక్కడుందో వెతకటమే మనలాంటివారికిచ్చిన పని. మనకి వాస్తవం మాత్రమే తెలుసు. అదిప్పుడు పనిచేయదనీ తెలుసు. అందుకే ఇప్పుడు అద్భుతాలు చేసేవాడు కావాలి. అలంటివ్యక్తి నీ వింగ్ లో వున్నాడుకనుక నీకు ఫోన్ వచ్చింది."
"ఆ సాబ్ అర్ధం అయింది. మీరు చెబుతున్నది మన పవన్ గురించేగా"
"యస్.మన ప్రస్తుత పరిస్థితుల్లో...అలాంటి వ్యక్తే సరైన అస్త్రాలను అందించగలడు. తనకి చెప్పు. మన ఆపరేషన్ కి మెటీరియల్ తక్కువగ వుండాలి. కానీ, మానవవనరులకి ఎక్కువ ప్రాధాన్యత కల్గించాలి.నీకు అర్ధమైందనుకుంటాను. దానికి సరిపోయేలా ఒక ప్లాన్ సిద్ధంచేసి మరో అరగంటలో నాకు చెప్పమనాలి. క్విక్"
సరిగ్గా మరో పన్నెండు నిముషాలతరువాత...
మళ్ళీ ఆ రెండు ఫోన్లూ కల్సుకున్నాయ్. అటువైపు పాత స్వరమే. ఇటువైపుమాత్రం పవన్ అనబడే వారి ఆపరేషన్స్ ఛీఫ్ స్వరం.
"చెప్పు పవన్ భయ్యా"
"మన దగ్గరున వెపన్స్ అన్నిటినీ యూజ్ చేసుకున్నా మనం కావాలన్నంతస్థాయిలో విధ్వంసం సృష్టించలేం. అందువల్ల ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్న పీక్ సిట్యువేషన్ ని వాడుకుంటూ.., అందులో కలిసిపోతూ మన విధ్వంసాన్ని ఎక్కువ చెయ్యవచ్చు. దాని నుండి మనకు కావలసినంత గ్యాప్ వే ని సాధించుకోవచ్చు. అదే నాప్లాన్ కి సూత్రం" చెబుతున్నది వొణికించే విషయమే అయినా, ఆ స్వరం మాత్రం చాలా కూల్ గా వుంది...
"డీటేల్స్...?"
"ప్రస్తుతం మజీ సి.యం.ని అరెస్ట్ చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. అదీ మరోకొద్దిగంటల్లోనే జరగబోతున్నట్లు తెలుస్తుంది. దానిపై ఆ సి.యం. పార్టీ వాళ్ళు భారీ ఎత్తున హింసకిపాల్పడాలని ప్రణాళికసిద్ధం చేస్తున్నారట. బహుశా..ఇదంతా జరగటానికి మరో పదిగంటలసమయంపట్టవచ్చు. ఆ టైం కల్లా మనవాళ్ళని పెట్రోల్ బాటిల్స్ తో రడీగావుంచగల్గితే...చాలు. ఆ ఘర్షణల్లో మనవాళ్ళనీ కలిసిపోమనండి. కాకపోతే మనవాళ్ళు ఆ గొడవల్ని మనకు అనుకూలమైన వాతావరణం వైపుకి మళ్ళించేలా ప్రయత్నించగలగాలి. ఆ ప్రయత్నమొక్కటే తీవ్రంగావుంటే చాలు. మనం అదే సమయంలోమన ట్రాన్స్ పోర్ట్ ని "హడావుడీ" పేరుతో తరలించేవాటి ముసుగులో సులభంగా రప్పించుకోవచ్చు."
"వెల్ డన్ పవన్ భయ్యా. ప్రతిసారీ నువ్వు చెప్పే ప్లాన్లతో మాకు భలే బలం సమకూరుతుంది. అందుకే నిన్ను అపరేహన్స్ కి ఛీఫ్ ని చేశారేమో..."కానీ ఆయన మెచ్చుకోలుని ఏమాత్రం యాక్సెప్ట్ చేయని సమాధానం అటువైపునుండి మొదలైంది "బట్! ఒక్కవిషయం"అంటూ
"ఏమిటది?"
విధ్వంసం అనేది ఇష్టానుసారం జరగవచ్చు కానీ, ఇష్టమునంతసేపు మాత్రం జరగదు. అదుపు తప్పేవి కొన్ని క్షణాలే. తరువాత అణచివేత కార్యక్రమాలలో నియంత్రణకోసం మొదలయ్యే ప్రయత్నాలు మనమూహించలేం. అందువల్ల ఒకే సమయంలో రెండుపన్లని ఇక్కడ వేగంగా నిర్వర్తించగల బ్యాలెన్స్ చాలాముఖ్యమిక్కడ"
"డీటేల్స్...???"
"మొదటిది విధ్వంసం సృష్టించటం, పెంచటం అయితే. రెండవది మన రవాణాని ఆ విధ్వంసం ముసుగులో దొరికే కొద్దిసెకండ్స్ లోనే తరలించేసుకోవాలి. ఇక్కడ ఆవేశం, టైం సెన్స్ వంటి రెండు భిన్నమైన అంశాలూ ఒకేసారి పాటించగలగాలి. విధ్వంసం జరిగేసమయాన్ని మనం కొంతవరకూ ఊహించవచ్చు కానీ,దాని అణచివేతకార్యక్రామలను మాత్రం అంచనావేయలేం. అవి అవతలవారి సామర్ధ్యాన్ని బట్టి వుంటాయికదా. అందుకే ఆ రెండు విషయాల మద్యన మనకు లభించే సమయాన్ని మనం లెక్కించకుండా ముందుకు సాగాల్సివుంటుంది. అంటే మన ట్రాన్స్ పోర్టింగ్ అంతా విధ్వంసం మొదలైన క్షణం నుండే మొదలవ్వాలి. అదే ఇక్కడ కీలకం"
"చాలా హారిబుల్ గా వుందే..."
"నిజానికి ఇదేమీ మనకి కొత్తకాదు. బాంబులు పేల్చి చెలరేగుతున్నా ఆ మంటలలోనే సరిహద్దుల్లోకి చొరబడుతుంటామే... ఇదీ ఇంచుమించు అలాంటిదే"
'యా! ఈ క్షణం నుంచే ఎలార్ట్ గా వుంటాం"
"ప్రతీ సెకనునూ అంచనా వేయండి.అప్పటి పరిస్థితుల్లో దేన్ని కదిపితే ఎక్కువ విధ్వంసం సృష్టించవచ్చో... వాటిమీదనే ఎక్కువ దృష్టి పెట్టమనండి. ఎలాగూ అవతలివారు హింసకి పాల్పడాలని చూస్తుంటారు కనుక మనవారికి ఎక్కువ రిస్క్ అవసరం వుండదు. కాకపోతే ఒక్కవిషయం గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మనం చేసేది కేవలం ఘర్షణని పెంచే ఒక సాధారణ విషయంలా  మాత్రమే వుండాలి తప్ప ప్రాణాలకి ఏ మాత్రం హానీ వుండకూడదు. అలా జరిగితే మనమీద మరింతగా వత్తిడి పెరిగిపోతుంది. ప్రస్తుతం అది మనకంత మంచిదికాదు"
"అలాగే. మీమాటల్లొ విధ్వంసం అనేమాట చాలాసార్లు వస్తుందే"
అవతలనుండి రెండు సెకండ్స్ నిశ్శబ్దం తరువాత మాటలు వినిపించాయి," నాకు అప్పగించిందే విధ్వంసం కదా?...ఇష్టమున్నా లేకున్నా మనం చేస్తున్న పనిని లీనమైచేస్తేనేకదా ఇక్కడ మనకు మనుగడ. లేకుంటే ఆ తరువాత లెక్కించుకోవటానికికూడా మిగలని ఉద్యోగాలు మనవి"
"అవును. మీకు అది బాగా తెలుసు.అందుకే అంతలా లీనమవుతారు..."
"థ్యాంక్స్" మరో మాట లేకుండా కట్టయ్యింది ఫోన్.




Wednesday, November 6, 2013

నాకు రాయాలనిపించినప్పుడు...[www.kinigi.com ద్వారా ]


"
కలలు మనసును నిలుపుతాయి..
మనసు కవిత్వాన్ని నింపుతుంది..
కవిత్వం జీవితాన్ని నిలబెడుతుంది..
జీవితం మనిషిని నిలబెడుతుంది..
మనిషి ప్రపంచాన్ని నిలబెడతాడు..
ప్రపంచం వాస్తవాన్ని నిలుపుతుంది..
వాస్తవం ఆశల్ని బ్రతికిస్తుంది..
ఆశలే మనకు రేపటిని ముందుంచుతాయి. ఇదే నా పుస్తకం రాస్తూ నాకు నేను తెలుసుకున్న నిజం.
జీవితంలో ప్రతీక్షణం ఓడిపోతూ..మూడు నాలుగుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించబోయీ.. విరమించుకున్న ఒక మనిషి, విషాదపు కోరలలో తనకు కరవైన `తోడు`ని మిగిలిన వారికీ ఇవ్వటం ద్వారా నేడు అనేకమందిలో పేరుకుపోయిన అంతర్మధనాన్ని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నమిది.
పుస్తకాన్ని రాయటం ప్రారంభించినప్పుడు మనసులో వున్నది పై భావనొక్కటే. కానీ దీనికొరకు తవ్వుతున్న గతం, ఇతరుల జీవితాలూ, భావావేశాలూ, తర్కం.. ఇవన్నీ నాలో నన్నే విమర్శించాయి. ముందు నన్ను నేను మార్చుకోవలసింది చాలావుందని దీన్ని రాస్తున్నప్పుడు నాకు అర్ధమైంది. ఒకరకంగా అది నాకు మొదటి గెలుపు. అలా కొనసాగించిన రచన పూర్తి అయ్యేనాటికి.. నాకు ఓటమి నుండి తప్పించుకోవాలన్న అభధ్రతాభావం కంటే, విజయాన్ని అందుకోవాలన్న వాంచకంటే, విజయంపైనే గెలిచితీరటం జీవితపు సహజగుణం అని తెలిసిపోయింది". ఒక గొప్ప విజయం మనిషి చేసిన తప్పుల్ని మర్చిపొయేలా చేస్తుంది. ఒక అపజయం అదే మనిషిలో లేని లోపాల్ని కూడా వెతికి తెచ్చి మరీ కృంగదీస్తుంది. ఎందువల్ల జరుగుతుందిలా? మన ఆశయాన్ని నిర్ణయించుకున్నప్పుడే.. దానికి పుల్ స్టాప్ కూడా పెట్టేసుకుంటున్నాం మరి. బ్రతికేది వందేళ్ళే అని తెలిసినా, అందులోనూ సాధారణ జీవితకాలం అరవై నుండి డెబ్బై మధ్యలోనే అని రుజువవుతున్నా, ఇంకా ఇంకా బ్రతుకీడ్చాలని ప్రాణంపై తీపి పెంచేసుకుంటున్న మనం.. మరి.. కాలమంతా ఎదుగుతూ వుండటం కూడా అంతే అవసరమని ఎందుకు భావించలేకపోతున్నాం?
అదే. అన్ బ్యాలెన్సింగ్ థాటే..మనల్ని ఓటమి దగ్గర ఓడిపోయేలా చేస్తుందని గ్రహించండి ముందుగా.
అప్పుడు జయానికీ, అపజయానికీ మధ్యనున్న తేడా పెద్దవిషయంలా మనల్ని భయపెట్టదు. ఓటమి అనుభవంగా మారుతుంది. విజయం అలవాటవుతుంది. సాగుతూవుండే జీవితగమనం మనల్ని మరింతగా ఎదిగేందుకు నిరంతరం అధ్బుతాలను చేయిస్తూనే వుంటుంది.
"
అదే విజయాన్ని గెలుచుకోవటమంటే"
ఇక్కడ విజయమంటే.. నువ్వు బ్రతికితీరాలనుకుంటున్న కాలమంతా సంపూర్ణంగా గెలుచుకొనే అలవాటుని సొంతం చేసుకోవటమే.
from my book    "అంతర్ భ్రమణం"నుండి 
 లభ్యమయ్యే ప్రదేశం
శ్రీ వెంకటేశ్వరా బుక్ డిపో, విజయవాడ, విశాఖ,హైదరాబాద్.
మరియు నా నెంబర్ కీ కాంటాక్ట్ చేయండి 9885779207,
మరియూ... నా ఇంటర్ నెట్ స్నేహితులందరికోసం, పది రోజుల తరువాత నుండి www.kinigi.com ద్వారా ఇ.పబ్లిష్ గా కూడా లభ్యమవుతుంది.    
శ్రీఅరుణం 

 

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.