Monday, April 28, 2014

ఇంకెంతదూరం...???


ఎంత సంపాదిస్తావ్? వంద..వెయ్యి...లక్ష...కోటీ...
ఎందర్ని మోసంచేస్తావ్? ఒకడ్నీ...గ్రామాన్నీ...పట్టణాన్నీ...దేశాన్నీ...ప్రపంచాన్నీ...
ఎంతని దోచుకుంటావ్? నగలు...డబ్బూ...పలుకుబడీ...పదవి...
ఎక్కడికని పెరిగిపోతావ్? ఇల్లు...ఎస్టేట్...అసెంబ్లీ...పార్లమెంట్...
ఇలాంటివెంత పోగేసిన...నీ కోసం పెట్టే చివరి పెట్టుబడి నీ సమాధి ఖర్చే.
ఎంతగా మోసపుసామ్రాజ్యాన్ని నిర్మించుకున్నా...
మరణపు ఫ్లాట్ ఫాం పై చివరికి నువ్వొక్కడివే నిలబడిపోవాలి.
అక్కడ నీపరుగు ఎన్నివంపులు తిరిగినా చుట్టుకొలత ఆరడుగులే.
అందుకే... జీవనగమనంలోనే...కాస్తంత ఆలోచించుకో...
నిప్పు కాలినా దానిని నమ్ముకుంటున్నది వాస్తవంగా బ్రతుకుతుందనే,
సంవత్సరాలు భరించిన ఆకలికేకలు
ఆర్ధతనిండిన కడుపుల అమాయకపు ఆర్తనాదాలు
గుక్కెడునీటికై ఎండుతున్న గుండెలకవాటాలు
అద్దమ్ముందు నిలబెడుతున్న మనలోని వాస్తవానికి ప్రతినిధులు.
ఇప్పటికైనా స్వార్ధపు పరదాలనుండి నిన్ను నువ్వు తొలగించుకో.
"దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్" అన్నదానికి
నువ్వే సమాధానం చెప్పాలి...
ఓటుహక్కును నిండుగా నమ్ముతూ ముందుకు అడుగేయ్.
శ్రీఅరుణం
9885779207

Friday, April 25, 2014

జ్వరo..


నీకు జ్వరమొచ్చింది..
నా గుండె కాలిపోతుంది,
నీలో వొణికిపోతున్న మనిద్దరి ఙ్ఞాపకాలు
బుజ్జి కుక్కపిల్లలా
భయంతో నీ పక్కనే కాపలా కాస్తున్నాయి.
నీ నాలుక క్రిందున్న
ధర్మామీటర్ పాదరసం వెంటే
నా కన్నీరూ పరిగెడుతుంది..
అది పెరగకుండా అడ్డుకోవాలని.
నీ దగ్గు వినిపించినతసేపూ
నా గుండెలో పిన్నీసు కలుక్కుమంటుంది...
కొవ్వొత్తుకు తెగిపడిన రెక్కల చీమలా
నీ నీరసం నన్ను పిచ్చెక్కిస్తుంది.
గబగబాతీసిన బత్తాయిరసంలో
నా కన్నీళ్ళు పడ్డాయేమో
పలచనైపోయింది.
వేధన భ్రమణం పూర్తయ్యి, వేకువ పిలుస్తున్నప్పుడు..
నువ్వు కనులు తెరిచిన వెలుగు
నా పెదవులపై మళ్ళీ పరుచుకుంటుంది.
from my book "నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు..."

“శ్రీఅరుణం”
9885779207

Tuesday, April 22, 2014

ప్రణయతీర0..


నాకోసం నిన్ను కోరుకుంటే
నాకెప్పటికీ ప్రేమ మిగలదు.
నీకోసమే నన్ను నిలుపుకొంటే
ప్రేమ నన్నెప్పటికీ విడువదు.
స్వేచ్చ హృదయంతో సంగమిస్తే

సాంగత్యం మరింతగా హత్తుకుంటుంది.
అవసరం గుండెలతో బేరాలాడితే..
అభిమానం గదులలోనే ఆరిపోతుంది.
ప్రేమను ప్రేమకోసమే ప్రేమిస్తే
ప్రళయంలోనూ ఒక ప్రాణం నీ తోడుంటుంది.


from my book "నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు..."
 
“శ్రీఅరుణం”
9885779207

Saturday, April 19, 2014

కలనిజమైంది


పేదరికంలోచదువు ఎన్ని అడ్డంకుల్ని దాటుకుని రావాలో... నాకు అనుభవపూర్వకమే. ఆ సమయంలో కొన్నిసార్లు చదువు ఆపకపోతే జీవితం ముందుకుసాగదేమో?? అన్న గడ్డురోజులు ఎన్నో.
అయినా దేవునివరంలా సరస్వతి నన్ను కరుణించింది. ఇప్పుడు సరిగ్గా అలాంటిపరిస్థితులలోవున్న ఎందరో పేదవారికినేను విధ్యాధానం చేసేఅవకాశంవుంటే ఎంత బాగున్నో అని ఎంతో ఆశ పడేవాన్ని. కానీ కుటుంబపు బాధ్యతలు నన్ను హార్ధికంగా ముందుకు నెట్టినా, ఆర్ధికంగా తెగించలేని పరిస్థితి. అందుకే పేదవారికి ఉచితంగా విధ్యాదానంచేయాలన్న నా ఆశ కలగానే కాగితాలలోనే ప్రణాళికలా వుండిపోయింది చాన్నాళ్ళు.
కొద్దిరోజులతరువాత గురజాపురవిగారు యువచైతన్య సంక్షేమసంఘం తరపున నా మనసులో వున్న ఉచిత విధ్యకు సంబంధించిన ప్రోగ్రాం చేయాలనుందనీ, ఆర్ధికంగా తనకు అవకాశం వున్నా అందుకుతగ్గ విధ్యాపరమైన నాలెడ్జ్ తనవద్దలేదని, అందుకోసం నన్ను సలహా ఇచ్చి ముందుకునడిపించాల్సిందిగా కోరారు. అప్పుడనిపించింది.కొన్నికలలైనా వాటి వెనుకనున్న ఆశయం మంచిదైతే తప్పక నిజాలవుతాయని. అలా మా ఇద్దరి నేతృత్వంలోమొదలైంది "అక్షరవెలుగు" ఉచిత ట్యూషన్ కార్యక్రమం 2012 నవంబర్ లో. మొదట 30మందితో మొదలైంది. ప్రతీరోజూ సాయంత్రం 6నుండి 8వరకు చుట్టుపక్కల వున్న ప్రభుత్వపాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్పటం, ఉచితంగా నోటుపుస్తకాలను అందించటం ప్రారంభించాం. అందుకోసం రవిగారి ఆర్ధికసహాయం, అలాగే తమ స్కూల్ ని ఖాళీగావుండే సాయంత్రం సమయంలో మేం వాడుకునేందుకు సహకరించిన మాస్టర్ గారికీ కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. ఈ మజిలీలో మేం ఎంతో ఆత్మసంతృప్తిని అనుభవిస్తున్నాం. ప్రస్తుతం ఈ2013-2014 సంవత్సరానికి 100మందితో కొనసాగుతూ రెండు సంవత్సరాలు పూర్తిచేసుకుంది నా కల. ఇప్పుడు మీ ముంది దీనిని ఉంచటానికి కారణం మన విధ్యను మరొకరికి అందించటం ఈ దేశానికి మనం చేసే నిజమైన సేవ అన్న నా నమ్మకాన్ని మీతో ఆనందంగా పంచుకోవాలనే. మీరూ ప్రయత్నించి చూడండి.

శ్రీఅరుణం 

9885779207

Tuesday, April 15, 2014

రైతన్నా...గుర్తుందా...???

రైతన్నా...గుర్తుందా...???
అన్నంపెడుతున్న నీ కండలస్వేదాన్ని
బెల్టుషాపులు తెరిచి దోచుకున్న నాయకత్వం,
కోట్లు చేతులుమారుతున్నా కానరాని నీటిధారలకై
నోళ్ళుచాపి నిన్ను ప్రశ్నిస్తున్న ధరిత్రిపగుల్లు,
ఆదరిస్తామన్న మాటల్ని
అప్పులతో నింపేసిన చేతలు,
క్రూరమృగాలు సంచరించేవేళల్లో కరెంట్ కనికరిస్తూ 
మీ బ్రతుకుల్ని అరణ్యరోధన చేసిన వాగ్దానాల్నీ,
నువ్వుపండించిన పంట ధరని
కనీసం...ఇంటికికూడా తీసుకెళ్ళనేని స్థితికి దిగజార్చినతనాన్నీ, 
పుట్టినగడ్డని నమ్ముకున్న నిన్ను
పుట్టగతులు లేకుండా ఆత్మహత్యలకు బలిచేస్తున్న చేతగానితనాన్నీ...
విత్తనాలకోసం రోజులతరబడి నీ కుటుంబం నిలబడిన వరసలూ...
ఎరువుల కోసం జరిగిన తొక్కులాటలో కాళ్ళు విరగొట్టుకున్న నీ తమ్ముడి అరుపులూ...
ప్రేమంతా పంచి పెంచిన పంట నకిలివిత్తనాలపాలిటపడినప్పటి వేధన...
అమ్ముకోలేని తడిసినధాన్యాన్ని కన్నీళ్ళతో కాల్చుకున్నరోదన...
అన్నిటినీ గుర్తుకుతెచ్చుకో....
ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్పే ఆయుధం వుంది తెలుసుకో.
మంచి అనిపిస్తే ఎన్నుకో
చెడు అనిపిస్తే "నోట" వుంది, నిలబడు.
మొత్తానికి ఓటెయ్యి...కానీ..దీనిలోనయినా..నిన్ను నువ్వు బ్రతికించుకో.
శ్రీఅరుణం
9885779207





Friday, April 11, 2014

ఎన్నికల జాగృతి

వెధవల్ని తయారుచేస్తున్న అవినీతి...
వరదలా పారుతున్న మద్యం...
చెదల్లా పేరుకుంటున్న పొత్తులూ
గేదెల్లా కొట్టుకుంటున్న నాయకులూ...
పార్టీటికెట్ కోసమే పెద్దపెద్ద ఆర్భాటాలూ...
నామినేషన్ ప్రదర్శనలకే రోడ్డెక్కుతున్న జాతరలూ
ప్రచారానికే ప్రపంచమంతా ప్రాకేస్తున్న నోట్లకట్టలు...
తిట్లూ
కోట్లాటలూ
హత్యలూ
కిడ్నాపులూ...
అసలివన్నీ కావాలా ప్రజాసేవకూ???
చూస్తున్నావా ఓ జాతిపితా? నువ్వెందుకు పైవన్నీ వాడలేదు?
మేమంతా ఇంతే...మాకూ
చరిత్ర తెలుసు
వర్తమానమూ తెలుసు
భవిష్యత్తూ తెలూస్తూనే వుంది
అయినా ఎందుకో ఇలా అమ్ముడైపోతూనేవున్నాం నోట్లకు???
మాకు నీఅంత ఓపికలేదుమరి
ఫాస్ట్ ఫుడ్స్
ఫాస్టెస్ట్ ఆలోచనలు
సూపర్ ఫాస్ట్ అనుభవాలు
బంపర్ ఫాస్ట్ అవసరరాలు మాకిప్పుడు కావాలి.
అందుకే మమ్మల్ని మోసం చేయటం అందరికీ తేలికైపోయింది.
ఓ మహాత్మా మళ్ళీ ఒక్కసారి మమ్మల్ని ఆవహించు
ఈ ఎన్నికల జాగృతిలో మాలోకలగలసిపో
నీ నడకే మా ఆశలు కావాలి
నీ చేతికర్రే మాకు చేతలు నేర్పించాలి
రాక్షసత్వం నిండిపోతున్న ఈ రాజకీయంపై తిరుగుబాటుచేయటానికి
నీ పోరాటస్ఫుర్తిని మళ్ళీమాకు ఆవాహనం చేయించు. 
శ్రీఅరుణం
9885779207
 










Sunday, April 6, 2014

ఓటు మన హక్కు


దేశభక్తిని మన భూజాలపై మోసేందుకు
రాజ్యాంగం అందించిన విలువైన చెక్కు,
వేస్టవుతుందనుకుంటున్న ఎలక్షన్ రోజునూ...
ఓటేసేందుకు వరసలో నిలబడే అరగంట సమయాన్నీ...
అభ్యర్ధులిస్తున్న రెండువేలలెక్కనూ...
నాయకుల వాగ్దానపు సర్కస్సునూ...ఇలాంటివాటిని కాసేపు పక్కనపెట్టి
గతకాలపు పరిపాలన పై ముడుచుకున్న మగతనిద్రనుండి ఒకక్షణం విదిలించు నీ మస్తిష్కాన్నిప్పుడు,
ప్రభుత్వ ఆఫీసులో పదినిముషాలపనికి నువ్వు చెల్లించినదెంతోలెక్క సరిపోల్చుకో ఒకసారి...
మిట్టమధ్యాన్నమే కామాంధులబారినపడుతున్న మన చెల్లెళ్ళ వేధనల్నీ...
లక్షలకోట్లరూపంలో విదేశీబ్యాంకులకు చేరుతున్న మన రక్తమాంసాలనూ...
కుక్కలసమూహంగా మారిపోతున్న చర్చావేధికల్నీ
అమ్మని డిల్లీవీధుల్లో తాకట్టుపెట్టిన చేవచచ్చిన జాతినాయకుల్నీ..
రైతుకి అర్ధరూపాయి దులిపి...ప్రజలనుండి అరవైరూపాయలు పిండుతున్న రాబంధులనీ...
నిజాయితీనిండిన కష్టాన్ని ఆత్మహత్యలకు రహదారిని చేస్తున్న యమభటులనీ...
ఒక్కసారి..ఒక్క గంట...ఒకేఒక్క రోజు...
ఆలోచించి
అవలోకించి
అవధరించి
అత్మీకరించి
కాస్తంత గుర్తుకుతెచ్చుకో,
నీకోసం
నీవారికోసం
మనకోసం
మనవారికోసం తెరిచే నీ చక్షువులు మనిషి ఆశలంత విశాలం చేయ్
ఆ గమకం నీలో నింపుకుని...ఓటువేయాలని నడువ్ ముందుకు
అపుడే...
ఏదేశమేగినా...ఎందుకాలిడినా...
నీదేశం నీకందించే విలువని గర్వంగా ఆస్వాదించగలవ్.

శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం

Friday, April 4, 2014

సమస్యా పురాణం


ఈ ప్రపంచంలో రెండురకాల మనుషులున్నారు.ఒకరు ప్రపంచ చుట్టూ తిరిగే వారైతే, రెండవ వారు ప్రపంచం తమ చుట్టూ తిరగాలనుకునేవారు.ఈ రెండురకాల మనుషులమధ్యన ఏర్పడే జీవనసంబంధాలే మానవమనుగడకి మూలసూత్రాలు.ఇవే తరువాత్తరువాత జీవితసత్యాలుగా మేకప్పులు వేసుకుంటూ.. మన అందరి మధ్యన సంచరించటం ప్రారంభించాయి.వాటికి అవరోధం జరిగిన ప్రతీ క్షణంలోనూ ఒక సమస్య పుట్టుకొస్తుంది.అది ఇంతింతై..వటుడింతై..అందలేనంత ఎత్తుకు ఎదిగి మనిషిని భయపెడుతుంది.ప్రతీ మనిషికీ ఇప్పుడు సమస్య నీడలా మారింది.నిరంతరం తనని వెంటాడే దానికి మనిషి మరింతగా కుచించుకుపోతున్నాడు. అటువంటి సమస్యని పరిష్కరించుకోవటం కోసం అనేక తపస్సులూ, యుద్దాలూ, ధ్యానాలూ, ఉపన్యాసాలూ, రచనలూ… ఇలా కొనసాగుతూనే వున్నాయి. వ్యక్తిత్వవికాసానికి ముందుగా సమస్య పెద్దపీఠ వేసుకొని కూర్చుంటుంది.దానిని దాటగలిగితేనే మనకి మిగిలినవి దొరుకుతాయి.
ఆదే ప్రయత్నం నేను నా మొదటి క్లాస్ లో చేశాను.
ఆసలు సమస్యంటే ఏమిటి ? అంటూ నేను అడిగిన ప్రశ్నకి అనేక సమాధానాలు వచ్చాయి.
"భయం"
"ఆభద్రత"
"ఆయోమయం"
'కల్పన"
"అసాధ్యం"
"ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వుండేది'
ఇలా అనేక రకాల అర్ధాలతో వారినిండి వెల్లువెత్తిన శబ్దాలు నన్ను ముంచెత్తుతుంటే..నాకు మాత్రం, వాటన్నిటిలో వున్న ఒకేఒక అంశం బలంగా తగిలింది!!!
అది..
సమస్య అనేకరకాలుగా సంచరించే విస్ఫోటనం లాంటిది కానీ..దాని అస్తిత్వానికై వెతికితే మాత్రం దొరికేది శూన్యమే.అయితే సమస్యని అలా వదిలేస్తే ప్రతీ క్షణం ఆరోహణం చేసే స్వభావం కలిగివుండటం వలన, అది మహాసముద్రమై మనల్ని గందరగోళంలో పడవేస్తుందని ముందు తెలుసుకొని తీరాలి.
from my book "anthar bhramanam"

SRIARUNAM
9885779207

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.