Tuesday, February 12, 2013

జీవితాన్ని గెలుచుకోవటానికి వ్యక్తిత్వవికాసం లక్ష్యంగా నిలుపుకొనే మార్గం అవసరం. దాని కోసం ఎందరి జీవితాలనో అన్వేషించి నేను రాస్తున్న  పుస్తకానికి పెట్టిన పేరు " FACTS OF INNER SELF". ఉగాదికి నేను విడుదల చేయబోయే దీని పేరు ఎలావుందో.. ఈ ప్రారంభం చదివి తెల్పండి.

"కలలు మనసును నిలుపుతాయి..
మనసు కవిత్వాన్ని నింపుతుంది..
కవిత్వం జీవితాన్ని నిలబెడుతుంది..
జీవితం మనిషిని నిలబెడుతుంది..
మనిషి ప్రపంచాన్ని నిలబెడతాడు..
ప్రపంచం వాస్తవాన్ని నిలుపుతుంది..
వాస్తవం ఆశల్ని బ్రతికిస్తుంది..
ఆ ఆశలే మనకు రేపటిని ముందుంచుతాయి. ఇదే నా ఈ పుస్తకం రాస్తూ నాకు నేను తెలుసుకున్న నిజం.
జీవితంలో ప్రతీక్షణం ఓడిపోతూ..మూడు నాలుగుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించబోయీ.. విరమించుకున్న ఒక మనిషి, ఆ విషాదపు కోరలలో తనకు కరవైన `తోడు`ని మిగిలిన వారికీ ఇవ్వటం ద్వారా నేడు అనేకమందిలో పేరుకుపోయిన అంతర్మధనాన్ని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నమిది. 
ఈ పుస్తకాన్ని రాయటం ప్రారంభించినప్పుడు మనసులో వున్నది పై భావనొక్కటే. కానీ దీనికొరకు తవ్వుతున్న గతం, ఇతరుల జీవితాలూ, భావావేశాలూ, తర్కం.. ఇవన్నీ నాలో నన్నే విమర్శించాయి. ముందు నన్ను నేను మార్చుకోవలసింది చాలావుందని దీన్ని రాస్తున్నప్పుడు నాకు అర్ధమైంది. ఒకరకంగా అది నాకు మొదటి గెలుపు. అలా కొనసాగించిన ఈ రచన పూర్తి అయ్యేనాటికి..  నాకు ఓటమి నుండి తప్పించుకోవాలన్న అభధ్రతాభావం కంటే, విజయాన్ని అందుకోవాలన్న వాంచకంటే, విజయంపైనే గెలిచితీరటం జీవితపు సహజగుణం అని తెలిసిపోయింది". 
మీ
శ్రీఅరుణం
  

Tuesday, January 29, 2013

ప్రేమ రూపం


నే వెళ్ళిపోయాను.. నీ పక్క చోటులోంచి..
నీదైన హృదయం పెడరెక్కలు విరిచి కట్టి
నా మదిని దూరంగా విసిరికొడితే..
ఏమయిందో అర్ధంకాని పసితనపు దీనత్వంతో
నే వెళ్ళిపడ్డాను
నీ నిశ్శబ్దపు చేతకానితనానికి బలవుతూ!

ఇప్పుడూ నిన్ను అందుకోవాలనే వుంటుంది
పరిగెత్తమంటూ ఆత్మకు చెబుతున్నా..
కాళ్ళు కదలని అవిటితనాన్ని నమ్మిస్తుంది.
నా  ప్రాణాన్ని మూటకట్టుకున్న నీ నవ్వును చూడాలంటే..
రెప్పలు విప్పితే సరిపోతుంది,,
కానీ.. కన్నీరు కనుగ్రుడ్లను ఎప్పుడో మ్రింగేసింది.
అరగంటకొక్కసారి నిన్ను పిచ్చెక్కించిన నా ఫోన్ కాల్
మూగదై
జాలిగా
నిన్ను చూస్తూ రోదిస్తున్నట్లు అనిపిస్తుందా?
అదేరా నేను నీదగ్గర వదిలేసిన ఆఖరి నిఛ్ఛ్వాసం.

ఒరేయ్ ఎప్పుడైనా గుర్తొస్తానా???
పిల్లల నవ్వులలో
పిచ్చి గెంతులలో
హడావుడీ పరుగుల్లో
ఆర్ధత నిండిన కన్నులలో
గుప్పెట స్ఫర్శించే ప్రేమ కౌగిళిలో
నేను వేరనుకున్నప్పుడు రగిలే గుండెకోతలో
వర్షంలో తిన్న ఐస్ క్రీం చాక్లేట్లలో
ఇద్దరం విడివిడిగా తాగినప్పుడు.. ఏడుపుమొఖం పెట్టిన కూల్ డ్రింక్ సీసాలో,
"నీ చేతులతోనే పెట్టరా" అంటూ కొనిపించుకున్న పువ్వుల నవ్వులలో,
అయినా.. నా ఆత్రం కానీ.. నువ్వున్న ఎందులో నేనుండను?
నీ ప్రతీ అడుగు క్రిందా మెత్తగా తగిలే స్పర్శ నాదే గా
రోజుకొక్కటైనా కన్నిటిబొట్టు నాకోసం విడవకపోతావా

బస్ లో వెళుతూ కిటికీ పక్కగా కూర్చుని
రోడ్లను ప్రశ్నించే నీ చూపు..
వెళ్ళిపోతున్న వేల స్కూటర్ల వంక ఎంతగా పరిగెడుతుందో..
అందులో ఒక్కటైనా నాది కాకపోతుందా? అని నమ్ముతూ.

నీకు తెలీదురా
నేనూ వస్తాను
నిన్ను చూడాలని
నా కన్నులు బూతద్దాలై అందించే నీ రూపాన్ని
మెదడు నిండా నింపుకుంటాను.
కానీ నీకు కనిపించాలంటేనే భయం
నిన్ను చూసే క్షణాలలొ కట్టలు త్రెంచుకొనే నా గుండెలను
నేను నియంత్రించుకోలేనన్న ఆందోళన.. నన్ను అక్కడ నిలవనివ్వదు.,
అందుకే పక్కకి తప్పుకుంటాను..వర్షించలేని మేఘంలా.
క్షమించరా. ఇక రాయలేకపోతున్నాను.
రాయాల్సినవి లేక కాదు..
ఇప్పటికే కన్నీళ్ళు నా కన్నులను పూర్తీగా బంధించివేశాయి.







Monday, January 14, 2013

అమ్మ అంటే అమృతం
నాన్న అంటే ఆశయం
అన్నయ్య అంటే బలం
అక్క అంటే తోడు
భర్త అంటే భాధ్యత
భార్య అంటే ప్రేమ
పిల్లలు మన అడుగులు...
వీటన్నిటి కలయికే కుటుంబం..
ఆ కుటుంబానికి ప్రతిరూపం మన సంక్రాంతి పండుగ.
అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
మీ
శ్రీఅరుణం
విశాఖపట్నం.    

Wednesday, January 9, 2013

పెద్ద పండుగ


మా ఇంటి చివరన
సందుమూలన
మురికికాలువ పక్కన
చిరిగిన గోనిపట్టాని పరుచుకొని
కొబ్బరిబొండాలమ్ముకొనే మామ్మ,
ఒక్కరొజు సెలవు పెట్టి
నేతచీర కట్టుకొని
బోసినవ్వులతో కనిపించిందంటే...
ఆ రోజు నాకు సంక్రాంతి పండుగని అర్ధం అయిపోతుంది.
గుమ్మం అంచున చెల్లి
బ్యాలెన్స్ గా నిలబడి
బావ రాకకోసం
కనుగ్రుడ్లను రోడ్డుకు అతికించుకొంటే
పండగొచ్చిందని తెలిసిపోయింది.
మేమంతా కొత్తబట్టలు కట్టుకొంటే
చూడాలని అమ్మ కళ్ళు ఆత్రంగా వెదుకుతుంటే
నేనూ సిద్దం అయిపోయాను కనుమ కోసం.
మా అందరి ఆశలూ తీర్చడం కోసం నాన్న
మౌనంగా షావుకారింటికి అప్పుకోసం బయలు దేరితే
పూర్తిగా తెలుసుకున్నా...
మన పెద్ద పండుగ ఇదేనని.
శ్రీఅరుణం విశాఖపట్నం.
9885779207 

Wednesday, December 26, 2012

విశ్వం రేప్ చేయబడుతుంది...


"అమ్మా"
ఒరేయ్ రాక్షసుడా
నువ్వు నాపై విరగబడిన ఆ క్షణాలలో..
తట్టుకోలేని బాధతో నేనరిచిన ఆరుపు..
నీకు ఒక్కసారైనా నీ అమ్మను గుర్తుకుతేలేదురా.
నిన్ను కనటానికి.. నీ అమ్మ చించుకున్న శరీరమార్గమేరా..
నువ్విప్పుడు ఇంత దాష్టికం జరిపిన కోవెల,
నీప్రాణం నిలపడానికి అమ్మ పిండిన స్తనాల అమృతం..
నువ్విప్పుడు నాశనం చేసిన ఆడతనం.
అసలు నారక్తం పీల్చడానికి???
నీవంట్లో వున్నది అశుద్దమేనా.
అర్ధరాత్రి తిరిగినా, అర్ధాకలితో వొణికినా
నా దేశం మాకూ స్వాతంత్ర్యం ఇచ్చిందన్న నమ్మకంతోనే,
మరి.. నడిరొడ్డే మాకు పడక గది కంటే పిపీలికమౌతుంటే..
ఆధునికం మాకు మిగిల్చేది మాంసపుదుకాణమేనా?
నవమాసాలూ మోసి కనే స్వర్గధామం కోపిస్తే..
నవ్వులన్నీ కుష్టురోగాలొచ్చి కుళ్లిపొవా?
ఆ ప్రళయం.. మేకేం మిగులుస్తుంది?
కన్నిటి ఆలయాలైన కళ్ళు..కామంతో ప్రేలిపోతుంటే..
అంజలి ఉదయించే చేతులు..అమ్మని ఆరగించేస్తుంటే..
స్త్రీ సిగ్గు ఇళ్ళలో శవాల కంపుకొడుతుంటే..
ఇప్పటికైనా నమ్మండి
ఆడదంటే.. ఆత్మ
ఆడదంటే..తోడు
ఆడదంటే,,ప్రేమ
ఆడదంటే,..ప్రళయం
ఆడదంటే..విలయం
ఆడదంటే..శూన్యం.

Thursday, December 13, 2012

ప్రేమసామ్రాజ్యo

ప్రేమసామ్రాజ్యo
ఎన్నాళ్ళయినా ...
నీ కన్నీటి సెలయేరులో శుద్దిస్నానం చేసేవాళ్ళు వస్తారన్న
హృదయఘోష.
బీటలువారుతున్న ఆశలలోగిళ్ళను ...
తన రక్తంతోనయినా మొలిపింపచేసే ప్రాణం
అందుకుంటానన్న నిశ్చయం.
కెరటం కోసేస్తున్నా...
సంద్రాన్ని వీడని ఇసుకరాయి ఆపేక్ష.
అరచేతుల నిండా నింపుకున్న కాంక్షను
నీ చుట్టూ అల్లేసిన ఆత్మ బంధంగా అస్తిత్వాన్నిచ్చిన
ఆర్ధత.
నీ దూరం తన గుండెల్లో లోయల్ని సృష్టిస్తుంటే..
యుగాలుగా అంటించిన నయనాల్న్ని పెరుక్కొని తెచ్చి
నీ ప్రతీ అడుగునీ కాపాడే
క్షణాలూ.
నిరంతరం నీకు గొడుగు పడుతుందని
ఆకాశాన్ని దొసిళ్ళలో పట్టి నీకివ్వాలన్న
తపన.
అనంతమైన మస్తిష్కాల మధ్యనా
నిన్ను నిన్నుగా గుర్తించగల కంటిపాప
కౌగిళింత.
ఇవే..నీ ప్రేమసామ్రాజ్యపు చుట్టుకొలతలు.


Monday, November 26, 2012

మన అడుగులు


మన అడుగులు
అంబరం పుట్టినప్పుడే అవినీతీ పుట్టిందేమో..
కానీ అదే ఇప్పుడు అంబరమైపోయింది.
హాయిగా నవ్వాలన్న కాంక్ష
అద్భుతాలు చెయ్యాలన్న విశ్వాసం
అన్నం పెట్టాలన్న తపన
అపదన్ అడ్డుకోవాలన్న ధైర్యం
ఇవన్నీ.. అవినీతి పంచలో మోకాళ్ళపై కూలబడ్డాయి.
ఆకలి దాడి చేసినప్పుడల్లా అరవటం ప్రారంభిస్తాయి,
కడుపు నిండిన తక్షణం కాళ్ళను ముడుచుకుంటాయి.
ఇలాంటి ఆశయాలు ఆత్మని వదిలేసినప్పుడే..
అవినీతికి పట్టభిషేకం జరిగిపోయింది,
అప్పుతెచ్చుకున్నందుకు బ్రతుకులు వడ్డిలకే సరిపోతుంటే
అసలెప్పుడో స్విస్ బాంకులో  తలదాచుకుంది,
ప్రజాస్వామ్యపు ఉషోదయం కోసం తీరంలొ వేచివున్న వారిని
రాజకీయపు వడదెబ్బ నడినెత్తిన కొడితే..
కల్పనలకే ఓటుని వ్రేలాడదీస్తూ కాలంగడిపేస్తున్నారు,
అయినా.. వెయ్యిరూపాయలకి నీ హక్కుని నువ్వు అమ్ముకుంటుంటే 
నిన్ను పాలిస్తానన్నవాడు..వ్యాపారం కాక ఏం వుద్ధరిస్తాడు?

మార్పంటే..
మెసేజ్ పంపించటం కాదు..
కోల్పోయిన దానిని సాధించుకోవటం.

ఆశలు యాత్రల మంత్రసానుల్లా నీ చుట్టు పొర్లుతుంటే..
వారిని కరిణించే నీ మనసాక్షి.. దేనికి ప్రతీక.

అసలిప్పుడేం కావాలి మనకి?
మన కష్టాన్ని మ్రింగిన అవినీతి కొలతా
దారిద్రానికి సరైన లెక్క కట్టలేని సాంకేతికతా 
దొగలకు కాపలా కాయటం నేర్పిస్తున్న చదువుల దందానా
కడుపులు పగులుతున్న ఆకలిపై కుక్కల విహంగమా
ఇవేమీ అక్కరలేదు మనకి..

అమ్మ పెట్టే గోరుముద్దకోసం..సరిపడే బియ్యం గింజలు,
మాంసం కరిగిస్తున్న రైతన్నకు.. పిడికెడు ప్రాణాలు,
పరాయి దేశాలలో వ్యభిచారం నేర్చుకున్న అవినీతి పరువు కట్టలు,
రేపన్నది వుందని నమ్మి..
రెండవ తరగతికే భూతద్దాలు తెచ్చుకుంటున్న పాపాయిల మెరిట్ కి అవకాశాలు..  

ఇవి కావాలి మనందరికీ
ఇక మన అడుగులు అటే పడాలి.


[కేజ్రీవాలా కొత్త పార్టి సంధర్బంగా]  

    


Monday, November 19, 2012

నిర్వచన0..

నిర్వచన0..
గుండెకున్న తీపిని
నయనాలు వీక్షించగలిగితే..స్ఫురించేది ప్రణయం.
నిశీధివీదులలోకి కిరణం
చొచ్చుకువచ్చే అధ్బుతం..కాంచగలిగేది ప్రణయం.
హృదయాన్ని చేరటానికి
గులాబీరేకులతో దారులునిర్మిస్తే..ఆ అడుగుల స్ఫర్శ ప్రణయం.
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న
కెరటం అంచులలో నాట్యంచేసే.. ఉత్తేజపుమెరుపు ప్రణయం.
అభివ్యక్తీకరించలేని ఆత్మని
తన్మయత్వపు రంగులతో కలగలిపి..ఆకృతీకరించే కాన్వాసు ప్రణయం.
కాలానికి నగిషీ,
కలానికి జీవం,
ప్రకృతికి నేస్తం,
ప్రగతికి ప్రాణం ప్రణయం.
ఇన్ని అస్తిత్వాల ప్రణయం..మేరువులు తొలగిన వేళ..
ప్రళయం కాకుండా వుండటమే నిజమైన ప్రణయం..!

sriarunam
9885779207
 

Monday, November 12, 2012

నా దీపావళి


దీపావళి అనగానే నా చిన్నతనం ముందు కొచ్చి కూర్చుటుంది
ఆ రోజంతా ఆనాటి ఙ్ఞాపకాల వెలుగుల్ని నా చుట్టూ
పరుచుకొని మురిసిపోతుంటాను.
అప్పుడే మొదలైన చలిగాలులు దుప్పట్లో దూరకుండా
కప్పుకుంటూ కుస్తీలుపడుతుంటే
రాత్రంతా కష్టపడి తయారుచేసిన
సీమటపాకాయల్ని పొద్దున్నే పరీక్షించటం ప్రారంబించేసాడు అన్నయ్య.
మరోపక్క అమ్మ చెవి మెళిపెట్టి లేపి
కుంకుడుకాయ పులుసుని నెత్తిపై మర్ధించేది,
కంట్లో చురుక్కుమన్న భాదకి కెవ్వున నేను పెట్టే ఏడుపుకి
చెల్లి నవ్వుతో జతకలుపుతూ చిచ్చుబుడ్డిలా గెంతేది.
ఉండుండీ వినిపించే టపాకాయల శబ్దం..
కాలు నిలవనిచ్చేది కాదు.
సర్రున బయటికి పరిగెడితే..వెనకనే..
కర్ర పట్టుకొని వచ్చే నాన్నమ్మను.. కాసేపు ఏడిపించి,
పక్కసందులో నిన్న కాల్చేసిన నరకుని బొమ్మ శిధిలాలలో
మిగిలిపోయినవేమన్నా వున్నాయేమోనని వెతికేవాడ్ని,
అప్పటికే .. ఆ పని పూర్తి చేసిన స్నేహితుల నవ్వు చూసి
అలిగొచ్చి మంచంపై ముడుచుకొనేవాడ్ని.
అమ్మ చేసే హల్వా పూరీలని చప్పరిస్తూ..
రాత్రికి కాల్చబోయే టపాసుల గురించి సమావేశమయ్యేవాళ్ళం.
ఆ క్షణం నుండీ మొదలయ్యేది..
నాన్న అడుగులశబ్దం కోసం మా కర్ణభేరీల వెదుకులాట.
సాయంత్రం వరకూ నాన్న తెచ్చిన బరువైన సంచి దగ్గరే
ప్రాణమంతా కాపలాకాసేది,
అప్పటికే మా వదనాలు సగం దీపావళిని చేసేసుకొనేవి..
ఇంక రాత్రికి ఎలా వెలిగిపోయేవో మీరే ఊహించుకోండి.

శ్రీఅరుణం
9885779207





Friday, November 9, 2012

గుర్తుకొస్తున్నాయి..


నీకు గుర్తుందా?
మనమెప్పుడు కలిశామో ,
నాకు తెలుస్తుంది
మనమెలా కలిశామో?
మా అమ్మనాన్న పెళ్ళిరోజూ
మీ అమ్మా నాన్న పెళ్ళిరొజూ
రెండింటితో దేవుడు సంధానమైనప్పుడు..
మనిద్దరి కలయికకి శ్రీకారం.

నీకు గుర్తున్నాయా
మనం గడిపిన క్షణాలు?
నాకు గుర్తున్నాయి
మనిద్దరి యుగాలు,
నాగురించి నువ్వూ
నీగురించి నేనూ
తలచుకోని క్షణాలని తీసివేస్తే..
ఆ మిగిలిందంతా మన కలయికే.

నీకు గుర్తుకొస్తున్నాయా?
మనమేమనుకున్నామో???
నేను మర్చిపోలేదు
మనమెంతనుకున్నామో,
మనస్సు ఎంతవరకూ పయనిస్తుందో...
శూన్యం దేనిని ప్రశ్నిస్తుందో..
అమ్మ త్యాగం విలువెంతో..
ఆకలికి హేతువేదో..
హృదయానికి నిజమైన స్థానం ఎక్కడో..
అదంతా ఒకేచొట రూపం దాల్చితే
అక్కడ మన బంధం ప్రణమిళ్ళుతుందని. 









Monday, October 29, 2012

4వ పేజీ.

     నువ్వు మిగిల్చిన మన జీవితo..
నరకానికి చిరునామా..
నువ్వు దూరమైన అడుగులే.
నువ్వు నాలో పుట్టించిన ప్రేమతత్వాన్ని
మళ్ళీ నానుండి నువ్వే పట్టుకెళ్ళిపోతూ
నా మనసుని శూన్యం చేసేశావు.
ఇన్నిరోజులూ నా గుండెవెలుగుకి దోసిళ్ళుపట్టిన నువ్వే
హఠాత్తుగా నామెడను నరికేస్తుంటే.. 
ఆ వాస్తవంలోంచి తేరుకొనేలోపునే నేను మాయమైపోతున్నాను.  
దేవుడు కనికరించాడనుకున్న మన కలయిక
ఇప్పుడెందుకిలా హృదయాన్ని ద్రేవేస్తుంది?
ఇన్నాళ్ళూ నాతో గడిపినదంతా
అవసరాల క్షుద్రయాగంగా మారుతుంటే..
నాలో మొలిపించిన నయనాలకు చుట్టూ స్మశానం పరుచుకుంటుంది. 
అరగంట  లేటును "ఏరా మర్చిపోయావా" అంటూ..
గద్దించిన నీ స్వరం.. ఏ ఎడారులకు పారిపోయింది?
నే కనిపించినప్పుడు నీ కళ్ళల్లో కనిపించే మెరుపులే
ఇప్పుడు నా కళ్ళక్రింద నల్లని చారలయ్యాయి.
నీ సన్నిధిని కోల్పోయిన నా చలనానికి పక్షవాతమొచ్చింది.
జరిగింది నిజమా?
జరుగుతున్నది నిజమా?
జరగబోయేది నిజమా? అనుకుంటూ..
నా కలలన్నీ అయోమయాన్ని నింపుకున్నాయి
ఇన్ని జరుగుతున్నా నాకు మిగిలిన ఈ శూన్యంలోనే ప్రేమవారధి కట్టాలనుకుంటున్నాను
ప్రేమను అనుభవించిన బాధ్యతది.
ఎందుకంటే...
నువ్వు నాదానివి కాకున్నా.. ప్రేమ నాకెన్నో నేర్పింది..
పడకగది ఇరుకైతే పారిపోదది,
సెల్ ఫోన్ మార్చుకుంటే వదిలిపోదది,
కావ్యాలెన్ని రాసిన కరిగిపోని అమృతధారది,
ఈ సత్యాలన్నీ దాటిపోవాలనుకున్నా
మనలో ప్రణయం వదుకుకోలేదు...అందుకే..
నీకు నువ్వుగా కుచించుకుపోయినా
నన్ను నేనుగా బ్రతికించుకొనే వుంటాను..
మనిద్దరి లోకాన్ని జీవింపచేస్తాను.

sriarunam










Friday, October 19, 2012

మూడవ పేజీ



ఎదురుచూపు...
ప్రాణం పోస్తున్న చల్లనిగాలి స్పర్శే..
నా పక్కన నువ్వున్నావంటుంది.
నీ మౌనంతో జడత్వాన్ని నింపుకున్న రోజులన్నీ
నాకు రుతువులు లేని కాలమే.
నువ్వంతా నాదే కదరా అంటూ
అల్లుకుపోయే నీ తపనని
నా హృదయపువనంలో ఎప్పుడో నాటుకున్నాను.
అమ్మకొచ్చే కోపంలా
నన్ను విదిల్చికొట్టే నీ విరహపు బాధని చూసి
మురిసిపోతూ మళ్ళీ నీ గుండెలో కుచించుకుపోతాను.
మన కలయికకోసం నీ స్వరతంత్రి ఎన్నోసార్లు
నా గుండెకాయపక్కనే పచార్లు కొట్టడం చేసాను.
ఎందుకో దేవుడు
మన రెండు ఆశల మధ్యనా లోయల్ని సృష్టిచాడు???
వాటిలోకి దూకి కలుద్దామంటే
మన మనసులు పాషాణాలు కావే.
అలాంటివయితే.. ఇంత ప్రేమెలా పుడుతుందీ?
అందుకే ఆశల చుక్కానీ తగిలించుకొని
నక్షత్రాలను వెక్కిరిస్తున్న మిణుగురుల్లా
నీ అడుగులు వెతుక్కుంటూ నడుస్తున్నాను.





Thursday, October 11, 2012

రెండవ పేజీ


              
 నిద్రలేచిన మెలకువ..
నిద్రలేచిన మెలకువ
పరుగున తోటలోకి పోయి
కాన్వాసు ముందు కాళ్ళు చాపుకు కూర్చుని
రాత్రి కలలను తలుచుకుంటుంది.
కల ఆదేశించిన గుర్తు
ప్రేమకు రూపం చిత్రించమంటూ.,
అప్పటినుండీ ఇదేస్థితి!
నువ్వూ.. నేనూ..
మనం.. ఆకాశం..
చెట్టూ.. పుట్టా..
అవకాశం.. అనంతం..
మస్తిష్కపు పరుగులెంతగా చుట్టేస్తున్న
మన తొలి కలయిక చిగురే
మదివనంలో స్ఫురణకు రావట్లేదు?!? 
ప్రేమంటే ఏమిటీ?
వెన్నెలను చదవటమా..
వన్నెలను కొలవటమా..
ప్రకృతితో సంగమమా..
పరవశంతో పరిగెత్తటమా..
ఎడతెగని మదనానికి శూన్యమూ 
పిపీలికమొతుంది.
ఆ అంతర్మధనంలో..తూలిపడబోయిన నన్ను 
ఒక స్పర్శ ఆదరించింది..!
అది బౌతికమైనా..
అబౌతికమైనా..
నా ఆర్తిని నిలిపింది.
అదేనేమో..నేను కోరుకున్న నువ్వు!
నువ్వేనేమో..నాక్కావలసిన నేను.

  





Tuesday, September 18, 2012

నా పరిభ్రమణంలో తొలి పేజీ



మరో నిఘంటువు

ఆనందం=కన్నుల ముందు గంతులేసేది.
తన్మయం=గుండెలతో ఉసులాడేది.
హృదయం=ఎప్పుడూ కన్నీరే మిగిల్చేది.
ధనం=వద్దంటూనే హృదయంగా మారగలిగేది.
బంధం=పరిస్తితులకు చెలికత్తె.
ప్రేమ=అవసరాలకు పర్యాయపదం.
పెళ్ళి= ఎప్పుడూ గడియారంతో ఓడిపోయేది.
స్నహం-జీవిత ప్రయాణంలో ప్లాట్ ఫారం.
అమ్మ=విశ్వం ఇంకా నిలిచేవుందని చెప్పే సాక్షం.
నాన్న=శూన్యంలోనూ నీకు ఆధారం చూపే దారి.
ప్రేయసి=ఎప్పుడూ ఆలోచనల్లోనే వుండేది.
భారయ=ఎల్లప్పుడూ ప్రక్కనే వుండగలిగేది.
జననం=మరో సినిమా టిక్కెట్.
మరణం=మనస్సును అనాధను చేసేది.
మనిషి=దేవుడిచ్చిన కొత్త వుద్యోగం.
జీవితం=మనిషికొచ్చే జీతం.
ప్రారంభం=ఆవులింత.
ముగింపు=శూన్యం.

శ్రీ అరుణం







Wednesday, September 5, 2012

v3

సేవాదృక్పధంతో..
విజయం సాధించిన అనుభవంతో..
సాధించితీరాలన్న తపన వున్నవారికోసం..
ఇంటర్వూ ద్వారా సెలక్ట్ చేసుకొని, కేవలం 30మందికి మాత్రమే..
కంప్లీట్  కోచింగ్ ద్వారా మంచి భవిష్యత్ అందించాలన్న ఆశయంతో..
సిలబస్, మెయింటెనెన్స్ ఖర్చులతో మాత్రమే......
గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లకు  ఉచిత శిక్షణ.
 

 V3
 

vagdevi vidya vision
 


contact: 9885779207
sssvas123in@rediffmail.com
 


atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.