అవినీతిని నిర్మూలిద్దాం అంటూ
`అన్నా` తిండి మానేసి కూర్చుంటే..,
నీతినెప్పుడో అమ్మేసుకున్న వాళ్ళు
నీళ్ళునమలడం కూడా మర్చిపోయారు.
దొంగ దొంగ గొడవపడితే..
దాపరికం బయటపడినట్లు,
మన రాజకీయం అంతా చేరి
మనకి దాగుడుమూతల్ని మిగులుస్తారు.
ప్రాణం మనకోసం ఒడ్డిన జవానుల
శవపేటికలపైనే తమ ఖాతాల్ని నింపుకున్న వీరికి
అంత త్వరగా నీతి ఎలా మింగుడుపడుద్ది?
లోక్ పాల్ నయినా లేకి పాలనగా మార్చి
కుటుంబాల లెక్కలకు రాజ్యంగాన్ని అడ్డుగా పెట్టుకొని
విరగబడుతుంటే...
డెబ్బై ఏళ్ళ `హజరే`కి
యాభై ఏళ్ళు తగ్గిద్దాం,
ప్రతీ ఒక యువతా ..హజారేగా మారి
మరో స్వాతంత్రపోరాటం సాగిద్దాం.
శ్రీఅరుణం,
విశాఖపట్నం.