ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామ్యం చచ్చిపోయింది.
సమైఖ్యాంద్రకోసమో...
విభజనాంద్ర కోసమోకాదు...
దేశానికి ప్రాతినిధ్యం వహించే కేంద్రప్రభుత్వం ఒక కీలకమైన పనిని పాలనాదక్షతతో కాక "దొంగబుద్ది"తో చేస్తుండటంవల్ల మాత్రమే అది జరుగుతుందిప్పుడు.
మనలో నీతి వుంటే...నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేస్తాం.
మనలో సిగ్గూశరం వుంటే నిర్భయంగా నడిచే దారిని అనుసరిస్తాం.
అవిరెండూ మనలో లేనప్పుడే మనం చేసే పని దొడ్డిదారిలో నడుస్తుంది. ఇప్పుడు ఆ పని చేస్తున్నది ఎవరో??? అందరికీ అర్ధమయ్యింది. ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్థ ప్రజలకి నేర్పుతున్న పాఠం ఇదే?
భారతీయులారా...దయచేసి వీరు చెబుతున్న ఈ పాఠాన్ని నేర్చుకోకండి.
అమ్మకీ, అమ్మాయికీ
సమాజానికీ, సంతర్పణకీ
మానానికీ, వ్యభిచారానికీ తేడా తెలుసుకోకుండానే మిగిలిపోతాం.
ప్రజాస్వామ్యం అంటే..ప్రజలస్వామ్యమా? ప్రభుత్వస్వామ్యమా?
మద్యానికీ, డబ్బులకీ, అవసరాలకీ మభ్యపడుతున్న ప్రజలను శాశ్వతంగా మోసం చేసే సరికొత్త పధకానికి ఇప్పుడు తెరతీశారు జాగ్రత్త!!!
సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది. తెలుగువారికి దిక్కూమొక్కూ లేకుండాపోయిన ఢిల్లి లోనే కాలుమీదకాలువేసుకొని కూర్చొని, లోక్ సభలో ఒక ప్రాంతీయపార్టీనే ప్రతిపక్షంలో కూర్చొబెట్టగలిగి, ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వానికే అస్థిత్వపు భిక్షవేసిన తెలుగువారినే ఇంతగా దిగజారుస్తున్న వీరి ముందు మనం ఓడిపోవాల్సిందేనా? అధికారం ఎలాగైనారావొచ్చు. కానీ ఆత్మగౌరవం ఒకసారి చచ్చిపోతే ఇక మనిషికీ మృగానికీ తేడావుండదు. దానికోసమేగా శివాజీ తనకిచ్చిన సామంత అధికారాన్ని కూడా కాదని ఛత్రపతి కాగలిగాడు. దానికోసమేగా కాకతీయ ప్రతాపుడు నర్మదానదీ తీరంలో ఆత్మహత్య చేసుకున్నాడు. దానికోసమేగా అల్లూరి సీతారామరాజు ప్రాణాలు వదిలేశాడు.
ఇప్పుడు మన రాష్ట్ర విషయమే తీసుకోండి. తెలంగాణావారి ఆకాంక్షను తప్పుపట్టాల్సిన పని లేదు. వారికి జరిగిన అన్యాయనికి ప్రతిఘటిస్తూ ఉద్యమంచేసి సాధించుకోవటం వారి హక్కు. అదే సమయంలో సమైఖ్యాంద్ర ఉధ్యమం ద్వారా కష్టాలు పడుతున్న ప్రజలను కనీసం ఒక కేంద్ర నాయకుడిని పంపించయినా అనునయించటమో లేక సమస్యను పారదర్శకంగా పరిష్కరిస్తామన్న నమ్మకం కలిగించే విధంగా ప్రయత్నించటమో... ఈ ప్రజలద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరుచుకున్న వారికి లేదంటే ప్రజలను వారు ఎంత పిచ్చివాళ్ళుగా భావిస్తున్నారో గ్రహించండి. ఇది ఒక ప్రాంతానికి ఆనందాన్నీ, ఒక ప్రాంతానికి బాధకలించవొచ్చు కానీ బారతీయతకీ, ప్రజాస్వామ్యానికీ పెద్ద గొడ్డలిపెట్టు.
గాంధీజీకీ ముందూ తరువాతా అనేకమంది స్వాతంత్రోద్యమకారులున్నారు. కానీ ఆయననే దేశం ఎందుకు మహాత్ముడిగా నిలుపుకుందంటే "ఆయన ప్రజలతో,ప్రజలకోసం, ప్రజలచేత నడిపించబడ్డారు". అదే ప్రజాస్వామ్యమంటే. ప్రజలు ఏమికోరుకుంటున్నారో గ్రహించటంలో అమ్మలావుండే నాయకత్వం కావాలి దానికి. కానీ ప్రస్తుతం మన నాయకత్వం ప్రజలపాలిట రాబంధులా మారింది. ప్రజలు "చచ్చిపోతున్నాం" అంటూ మొరపెట్టుకుంటే... దానికి ఈ ప్రభుత్వం దగ్గర రెండు ఆప్షన్లున్నాయి.
ఒకటి... మీరు చస్తే మీ కళేబరాల్ని చీల్చుకుతినేందుకు మేం సిద్ధం గా వున్నాం అనేది.
రెండవది...చావండి ఎలా చస్తారో చూస్తాం అనే చేతకాని నిశ్శంబ్దంతో రెచ్చగొట్టే మారణాయుధం.
వీరికి ఏదీ అవసరం లేదు.
ప్రజాస్వామ్యం
హక్కులూ
బాధ్యతలూ
ఆఖరికి ప్రజలుకూడా
స్వార్ధపులెక్కలకి అమ్ముడుపోయిన కొందరు అధికారపు మృగాలు మనమద్యలో తారాట్లాడుతున్నారు. వారిదృష్టిలో ప్రజలంటే పిచ్చివారు. గొర్రెలమందలాంటివారు. వారు పాటిస్తున్న అహింసావాదం తమ పవర్ మీద భయంతో అనుకుంటున్నారుకానీ... రాజ్యాంగానికి వారిస్తున్న గౌరవం అని మర్చిపోతున్నారు.
అందుకే మన రాజ్యాంగానికీ ప్రజాస్వామ్యానికీ భంగం వాటిల్లుతున్న ప్రస్తుత పరిస్థితులను శుద్దిచేసే ఉద్యమంకావలిప్పుడు. మన ఓట్లద్వారా నిలబడిన ప్రభుత్వం తన సొంతింటి పేకాట కోసం మనల్ని జోకర్లుగా మారుస్తుంటే అలాంతివారికి మన వేయబోయే ఓటు మన అమ్మని అమ్ముకునే నీచం అని నమ్మండి. ఒక రాజకీయ పరిణితితో, దేశభక్తితో, రాజ్యాంగ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటే అవి పాలనలో ప్రజలలో మమేకం అయిపోతుంటాయి. కానీ ఇప్పుడు ప్రజల్నీ రాజ్యాంగాన్నీ అవమానిచే కొందరు దద్దమ్మలు దేశాన్ని స్మశానంగా మారుస్తుంటే "నా సమాధి నాకుందిగా"అని మురిసిపొతూ కూర్చుందామా?
ఉద్దేశ్యాల్ని... చర్చించాలి
ఉద్యమాన్ని...పరిష్కరించాలి
తీవ్రవాదాన్ని..అణచివేయాలి.
మన కేంద్రప్రభుత్వానికి ఇవి మూడుపట్టినట్లు లేవు. అన్నిటికీ చెవిటివాడిలా నటించటం, ఆనక తన ఆకలిని తీర్చుకోవటానికి దొంగలా హడావుడీ పడటం. ఇదే వారి రాజకీయం. ఆదారిలోన్నీసాగుతున్నాయి.
ఉగ్రవాదులను ఉరితీయటానికీ అదేదారి.
నల్లడబ్బుని వెలికితీయటానికీ అదేదారి.
సకలజనులసమ్మెకు ఆపించటానికీ అదేదారి.
సమైక్యాంద్ర ఉద్యమాన్ని అనునయించటానికీ అదేదారి.
ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం ఎలాంటిదన్న నిజంకాకుండా , ఇలా ఎందుకు తీసుకుంటున్నారన్నదే నా ప్రశ్న?
అందుకే ఈ ప్రశ్నలడుతున్నాను.
1] ఇలా దొంగలా ప్రవర్తిస్తూ ఇరుప్రాంతాలప్రజలతో ఆడుకోవటం దేనికీ. మీరు చేసే పని మంచిదైనప్పుడు ఈ అయోమయం దేనికీ?
2] దేశం అంటే ప్రజలే అయినప్పుడు... మరి ఆ ప్రజలకు ప్రతినిధులుగా "రెండువైపులవారినీ ఒకే తాటిమీదకు తెచ్చి సమస్యను పరిష్కరించే సమర్ధత మాకులేదని మీరు ఒప్పుకుంటున్నట్లేనా"?
4] అలాంటి అసమర్ధులకు ఇంకా ఈ అధికారం ఎలా వుంటుంది? అలాంటి అసమర్ధపు నాయకులుచేసే మార్పులకు ప్రజలెందుకు తలవంచాలి?
ఇన్నిలొసుగులతో సాగుతున్న చర్యలేవైనా మన ప్రజాస్వామ్యనికే ప్రమాదకరం. అందుకే మన సమైఖ్యాంద్ర ఉద్యమం ఇప్పుడు "ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం"గా మారాలి. దానిని విజయవంతం చేసుకున్న తరువాత స్వఛ్చమైన హృదయాలతో కలిసుండటమో, విడిపోవటమో చేద్దాం. ఇప్పుడున్న వాతావరణంలోనైతే ఈ పద్దతి ఒక దిక్కుమాలిన రాజకీయపు అధ్యాయాన్ని దేశానికి అందించితీరుతుంది ఖచ్చితంగా.
శ్రీఅరుణం
విశాఖపట్నం