కలానికీ కాలానికి వివాహం నిశ్చయమైతే...
తెల్లనికాగితపు కాన్వాసుపై పొర్లాడే అక్షరాలే వారి తొలిరేయి ఙ్ఞాపకాలు.
జీవితకొక్కాలకు తగిలించేసిన ఆశల బూజు దులిపి
తెల్లారినా తరగని కావ్యకచేరీ చేస్తూనేవుంటారు.
గతజన్మలో వదిలేసిన గమకాలనూ ఏరుకొచ్చి
అనుభూతుల కోనేరుగట్టున.....
అనురాగపు మట్టిబొమ్మలను తయారుచేస్తుంటారు.
అంతస్థులచూరు పలకరిస్తున్నా...
తాటకులగుండెల్లోకి తొంగిచూస్తుంటారు,
అమృతంలో ఏముందంటారు?
గంజినీళ్ళతోనే ఘీంకరిస్తుంటారు,
శూన్యాన్ని అద్దంలో నింపేసి ప్రపంచంతో వాజ్యాన్ని మొదలెడతారు,
చందమామ సాంగత్యాన్నీ కాదని...
సూర్యుని భూజాలకెక్కాలని ప్రాకులాడుతుంటారు,
కర్ణున్నీ కృష్ణున్నీ కాదని...
మద్యలో లేచిన వికర్ణునిపై పుంఖానుపుంఖలు రాసిపడేస్తుంటారు,
భావాలను ఎక్కడ దొరుకుతాయో... అక్కడకు
పదాల అణుబాంబులను మూటలుగా భూజాన్న వేసుకుని
ప్రపంచవీదులన్నిటినీ ఊహల విమానాలతో చుట్టేస్తుంటారు,
కన్నీళ్ళు వారి కలానికి ఇంధనం
నోబుళ్ళూ, ఙ్ఞానపీఠ్ లూ వారి సాంగత్యానికి వారసత్వాలు
కక్షలలో బంధించబడిన కాంక్షలను సమాజానికి శుద్దిచేసి అందించే
వసుధైక కుటుంబానికి వారిద్దరే నిజమైన అమ్మా నాన్నలు.
శ్రీఅరుణం
విశాఖపట్నం-530001
సెల్ = 9885779207
e mail = sssvas123in@rediffmail.com