ఓడిపోయిన క్షణాలు...
ఇది పోటీ ప్రపంచం. పుట్టిన నాటినుండే అవసరాలకు వరుసలు కట్టాల్సిన బ్రతుకులు మనవి. ఆ ఎమోషన్ లేకపోతే మనకి కూర్చునే రేషన్ కూడా మిగలదు. ఒక్కొక్కదానిలో ఒక్కొక్కరకం పోటీ వుంటుంది. దానిని తట్టుకొని నిలబడిన వారి ముందుకు వెళతారు. మరి మిగిలినవారు సంగతేంటని ప్రశ్నిస్తే??? అది కోటి డాలర్ల ప్రశ్నగా వినతికెక్కుతుంది. ఒక రకంగా ఇప్పుడు మనముందు గెలుపుకోసం జరుగుతున్న ఈ ప్రయత్నాలన్నీ అలా ఓడిపోతున్న వారికోసమే.
ఒక ప్రభుత్వ ఉద్యోగాన్నే తీసుకుంటే... రెండువందల ఉద్యోగాలకి రెండు లక్షలమంది పోటీపడుతున్నారు. అంటే ఒక ఉద్యోగానికి నీతో పోటి పడేవారు సుమారుగా వెయ్యిమంది. ఇందులోనే నువ్వు మెరిట్ సాధించాలి, దానితో పాటూ రిజర్వేషన్ల వంటి సామాజికాంశాలనేకం నీ విజయాన్ని ప్రభావితం చేస్తుంటాయి. వాటన్నిటినీదాటుకుని ఈ రోజులలో ఒక ప్రభుత్వ ఉద్యోగం మెరిట్ ద్వారా సంపాదించాలంటే ఆ కష్టం కేవలం అనుభవించినవాడికే అర్ధం అవుతుంది.అలాంటిదారిలో నేను అనేక ఓడిపోయిన క్షణాలను అనుభవించాను. ఆ క్షణాలలో మనఓటమికంటే అందరూ చేసే వెలివేసినట్లుండే చూపే నరకప్రాయం. దానినుండికూడా మనం మనసాధనని సాగించాలంటే తప్పకుండా మనదైన ఒక ప్రపంచాన్ని నిర్మించుకోవాలి. అలా నాలోని ఆ భావాలని తరువాత వచ్చేవారికి ముందుగానే అందించాలని రచనని మొదలుపెట్టాను. అదే "అంతర్ భ్రమణం" పుస్తకం.
చాలామంది తాము సాధించిన విజయాన్ని ఎలా సాధించామన్నది చెప్పటమే ప్రధాన సూత్రంగా వ్యక్తిత్వ వికాసపు పుస్తకాలను రాశారు. కానీ నేను అలాంటి పుస్తకాన్ని నా ఓటమినుండే మొదలుపెట్టి విజయం అందుకున్నప్పుడు ముగించాను. అందుకే ఆ పుస్తకం రాయటానికి 4సంవత్సరాల కాలం పట్టింది.
ఈ పుస్తకాన్ని రాయటం ప్రారంభించినప్పుడు మనసులో వున్నది పై భావనొక్కటే. కానీ దీనికొరకు తవ్వుతున్న గతం, ఇతరుల జీవితాలూ, భావావేశాలూ, తర్కం.. ఇవన్నీ నాలో నన్నే విమర్శించాయి. ముందు నన్ను నేను మార్చుకోవలసింది చాలావుందని దీన్ని రాస్తున్నప్పుడు నాకు అర్ధమైంది. ఒకరకంగా అది నాకు మొదటి గెలుపు. అలా కొనసాగించిన ఈ రచన పూర్తి అయ్యేనాటికి…. నాకు ఓటమి నుండి తప్పించుకోవాలన్న అభధ్రతాభావం కంటే, విజయాన్ని అందుకోవాలన్న వాంచకంటే,
“విజయంపైనే గెలిచితీరటం జీవితపు సహజగుణం అని తెలిసిపోయింది".
ఒక గొప్ప విజయం మనిషి చేసిన తప్పుల్ని మర్చిపొయేలా చేస్తుంది. ఒక అపజయం అదే మనిషిలో లేని లోపాల్ని కూడా వెతికి తెచ్చి మరీ కృంగదీస్తుంది. ఎందువల్ల జరుగుతుందిలా? మన ఆశయాన్ని నిర్ణయించుకున్నప్పుడే.. దానికి పుల్ స్టాప్ కూడా పెట్టేసుకుంటున్నాం మరి. బ్రతికేది వందేళ్ళే అని తెలిసినా, అందులోనూ సాధారణ జీవితకాలం అరవై నుండి డెబ్బై మధ్యలోనే అని రుజువవుతున్నా, ఇంకా ఇంకా బ్రతుకీడ్చాలని ప్రాణంపై తీపి పెంచేసుకుంటున్న మనం.. మరి.. ఆ కాలమంతా ఎదుగుతూ వుండటం కూడా అంతే అవసరమని ఎందుకు భావించలేకపోతున్నాం?
అదే. ఆ అన్ బ్యాలెన్సింగ్ థాటే..మనల్ని ఓటమి దగ్గర ఓడిపోయేలా చేస్తుందని గ్రహించండి ముందుగా.
అప్పుడు జయానికీ, అపజయానికీ మధ్యనున్న తేడా పెద్దవిషయంలా మనల్ని భయపెట్టదు. ఓటమి అనుభవంగా మారుతుంది. విజయం అలవాటవుతుంది. సాగుతూవుండే జీవితగమనం మనల్ని మరింతగా ఎదిగేందుకు నిరంతరం అధ్బుతాలను చేయిస్తూనే వుంటుంది.
"అదే విజయాన్ని గెలుచుకోవటమంటే"
ఇక్కడ విజయమంటే.. నువ్వు బ్రతికీతేరాలనుకుంటున్న కాలమంతా సంపూర్ణంగా గెలుచుకొనే అలవాటుని సొంతం చేసుకోవటమే.
విజయవాడ విక్టరీ పబ్లికేషన్స్ వారు ప్రచురించిన ఆ పుస్తకం నాకు రచయితగా మంచిపేరు సంపాదించిపెట్టింది. అంతకంటే ఎక్కువగా ఆ పుస్తకం చదివిన కొందరు తమ జీవితపు విలువను తెలుసుకోగలిగామని నాతో చెప్పటం నాకు మరింత శక్తినిచ్చింది.
దానికి చెందిన ఫొటోలనే ఇక్కడ పెడుతున్నాను.
మరోపుస్తకం గురించి ఇక్కడే తరువాత కలుద్దాం.
మీ
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం