ప్రజాస్వామ్యమే గెలిచిందిప్పుడు. ఎన్ని ఆశలను ఎరవేసినా ప్రజల మనసులోతుల్లో చూపిన ప్రభావమే ఎప్పటికీ నిజమైన ఫలితాన్నిస్తుందనేది ఈ ఎన్నిక ఫలితాలు మరోసారి నిరూపించాయి. డబ్బూ, మద్యం, పధకాలూ, వాగ్దానాలూ...ఎవరు ఎన్ని చెప్పినా అంతిమ ఫలితందగ్గర మాత్రం ప్రజలమనోనిశ్చయాన్ని ఏమాత్రం మార్చలేకపోయారన్నది వాస్తవం. రాష్ట్రవిభజనపేరుతో ఒక సాధారణ విషయాన్ని తేల్చటానికి రెండుప్రాంతాల ప్రజల జీవితాలని అస్తవ్యస్తం చేసిన వారికి తమ సత్తా చూపించారు. తెలంగాణా కొరకు ఎందరో యువకులు బలిదానాలు చేస్తున్నా, నేలలతరబడి ప్రజలు రోడ్డుమీదకొచ్చినా, అలాగే సమైఖ్యాంద్ర కొరకు నెలలతరబడి ప్రజలు అరచి గగ్గోలుపెట్టినా, పిల్లలుసైతం ఎండలో ఉద్యమాలు చేసినా చలించని ప్రభుత్వానికి ఇలాంటి సమాధానం చెప్పి రెండుప్రాంతాలప్రజలు నిజమైన ప్రజాస్వామ్యన్ని బ్రతికించుకున్నారు. తెలంగాణాలో కాంగ్రేస్ కి కొంత అధిక్యం వచ్చినా అది తమ కలని నిజంచేసిందన్ని కొద్దిపాటి విశ్వాసం మాత్రమే. అంతకంటే తెలంగాణాకోసం అవిర్భవించిన టీఅర్.యస్. ని ప్రజలు ఎక్కువగా ఆదరించటానికి కారణం అంతిమంగా ప్రజలుకోరుకున్న లక్ష్యసాధానకోసం దేనికైనా తెగించినిలబడినందుకే అన్నది ఇక్కడ గమనార్హం. అదే భావజాలం సీమాంద్రలోనూ కనిపించింది చూడండి. సమైఖ్యాంద్ర సాధనలో భాగంగా ఎవరెన్ని మాయలను ప్రజలముందు ప్రదర్శించాలని చూసినా ప్రజలిచ్చినతీర్పులో కాంగ్రేస్ ఏమయ్యిందో...చూశాం కదా. అదొక్కటే నిజమైన ప్రజాతీర్పుకు సూచిక. మిగిలిన పార్టీల విషయమంతా వారివారి సొంతవ్యవహారం గానే సాగిందికదా. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నవి రెండు అంశాలే.
ఒకటి...ప్రజాస్వామ్యం మన దేశంలో ఇంకాబ్రతికేవుందన్న నమ్మకం.
రెండు...ఎన్ని రాష్ట్రాలుగా విడదీసినా తెలుగువాడి మనసు ఒకేలా ఆలోచించగలిగే భావజాలం కలిగివుంటుందన్న నమ్మకం.
ఈ రెండూ మిగిల్చిన ఆనందంతో నాభారతావనికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.
శ్రీఅరుణం
విశాఖపట్నం
9885779207