అబ్బా!పెరికేశావా...
ఒక కంటిలో నలుసుపడిందని చూపిస్తే
రెండుకళ్ళనూ నరికేసి దూరంగా విసిరేశావా.
ఎన్నివేల సంవత్సరాలుగా కూర్చుకున్న అక్షరాలకు
తెలుగుతల్లివని రూపం ఇచ్చి
నేనే పసిపాపనై..నిన్ను పూజించుకున్నానే,
అలాంటిదిప్పుడు
నాలో ఎక్కడో లోపంవుందని...నిలువునా నరికేయటం...
నైతికమా? నీచమా?
నిన్ను చీల్చటానికి ఎందరో నడుంకట్టారు,
రాజులున్నారు
పేదలున్నారు
గురువులున్నారు
విధ్యార్ధులున్నారు
అందరితోకలిసిపోయిన దొంగలూ వున్నారు.
ఇప్పుడు నువ్వు చంపబడింది ఆ దొంగల చేతిలోనేకావటం మాత్రం నిజంగా ధారుణం.
ఇది నిజంగా అవసరమా?
పాలు చాలటంలేదని అమ్మ స్తనాల్ని రెండుగా చీల్చినట్లుంది నీ విభజన
ఆశలు అఖండజాతిని ముక్కలు చేస్తుంటే...
అవసరాలు సమగ్రతని నాశనం చేస్తున్నాయి...
అటువారైనా, ఇటువారైనా...అమ్మమీద ఒట్టేసి చెప్పండి
ఇదంతా సాటిమనుషుల మంచికోసమే చేశారా?
మరి ఎటువైపైనా ఎందుకు ఆత్మహత్యలు కొనసాగుతూనేవున్నాయ్?
పిచ్చికుక్కల పైశాచికత్వానికి
రాజకీయపు క్యాబరేనాట్యం కలగలసి చేసిన దోపిడీ చేస్తుంటే..
58రోజుల ఆమరణ సమైక్యంకోసం ఎన్నికోట్ల రక్తపు కట్టేలలో చలనం రాలేదెందుకని?
ఓట్ల ఎంగిలి విస్తరాకులు పంచుకోవటానికి
అంగలార్చిన కాకులు నడిపిన కుళ్ళినమాంసపు పంపిణీలా
అమృతం లాంటి తెలుగుగడ్డ విరిగిపడిపోయింది.
ఏప్రాంతమైనా నాకనవసరం, నేను మొదట భారతీయుడ్ని...
ఓట్ల అంగడిలో మానాల్ని అమ్ముకుంటున్న రాజకీయవేశ్యల వొంపులకు
నా మరో సోదరుడు బలయ్యిపోయాడిప్పుడు,
రక్తపుచుక్కలు కారుతున్న కన్నీళ్ళతో నా సోదరునికి వీడ్గోలు చెప్పలేక చెబుతున్నా నీ మాటల్ని...
జాగ్రత్త...జాగ్రత్త...భారతీయ సోదరా...
రాజకీయబందిపోట్లు దేశంలో నిండిపోయారు
వాళ్ళ బొక్కసాలు నింపుకోవటానికి నీ ఇంటిని నాశనం చేస్తున్నారు
ఆ పిశాచాల అరుపులను నమ్మి నువ్వూ పరిగెత్తకు
ఏదో ఒకరోజు నిన్నే సరిహద్దు అవతల పారేస్తారు.
ఇప్పుడు మా ఇంట్లో జరుగుతున్నదదే...
అదిగో అలాంటివాళ్ళ మాటలు వినే నా సోదరుడు వెళ్ళిపోతున్నాడు ఇంటిలోంచి....
2013జులై30నాటి రాజకీయ చదరంగానికి బలైన కొందరి ఆశల్ని నేను ఇక్కడ వ్యక్తీకరిస్తున్నాను.ఇందులో నేను అడుగుతున్నది ఏ ఒక్క ప్రాంతానికి సంబందించినది కాదు. సామాన్యుల మనసులలో వున్న బాధకి రూపం ఇవ్వటమే నా ఉద్దేశ్యం.ఆనాడు కలిసివుండటానికి చేసిన 6సూత్రాల పధకానికి బదులుగా ఈ 6 ప్రశ్నల విషయాన్ని ఇప్పుడు కాస్త పరిశీలించండి.
1.నీటి భాగాలు,పదవులు లాంటివాటికంటే ముందు మనిషికి మార్పుతాలుకా సంకేతం నమ్మకం అందించాలి. లేకుంటే తరువాత ప్రక్రియ శాంతియుతంగా సాగలేదు.ప్రజల మనోభావాలు దెబ్బతినటానికి కారణం కూడా అదే ఇప్పుడు.
2. ఉద్యోగాలకోసం ఎదురుచూస్తూ, ప్రకటించిన కొత్త నోటిఫికేషన్లకోసం వేలకువేలు కట్టి రాత్రింబగళ్ళు చదువుతున్న విధ్యార్ధులకు మీరు ఇవ్వబోతున్న నమ్మకం ఏమిటి? ఆ నోటిఫికేషన్లు అలాగే వుంటాయా? రద్దవుతాయా? వుంటే ఆ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది? లేకుంటే ఇల్లు, పొలాలూ అమ్మి కట్టిన కోట్ల రూపాయల మా ఫీజులను ఎవరు రికవరీ చేస్తారు?
3.ఆంధ్రా,తెలంగాణాలో వుంటూ అక్కడే తమ జీవితాలను నిలుపుకున్నవారికి మీరు ఏం చేయబోతున్నారు?
4.ఒకేరాష్ట్రంగా వున్నప్పుడే ఆంధ్రప్రాంత,తెలంగాణాప్రాంత ఉద్యోగులని నానా అవమానాలకు గురిచేసినప్పుడు, ఇప్పుడు విడిపోబోయే ప్రకటన పూర్తయ్యేముందు మీరు తీసుకోబోతున్న విధానమేమిటి?
5.పెద్దమనుషుల ఒప్పందాన్ని రాజకీయ అవసరాలకు తుంగలోతొక్కి తెలుగుప్రజలను విడదీసిన పాపం మూటగట్టు కున్న వాళ్ళను మళ్ళీ నమ్మాలంటే మా కోసం మీరు ఏం చేయబోతున్నారు?
6.14రాష్ట్రాలు 28 అయినాయి. అందులో మరొకటి ఇప్పుడు బయలుదేరింది.సరే దేశాన్ని అసలు ఎన్నిరాష్ట్రాలుగా విభజించాలనుకుంటున్నారు? దానికి అంతం లేదా? మన సమగ్రతకోసం ఏదైన చేద్దామన్న ఆలోచనలేదా? వీటికి సంబంధించిన మార్పులపై ఎప్పటికైనా దృష్టి సారిస్తారా? లేకపోతే ఎప్పుడు ఏ రాష్ట్రానికి చెందినవాడిగా నేను మారతానో తెలియని అయోమయంలోనే నేను మిగిలి[పోవాలా?
శ్రీఅరుణం
No comments:
Post a Comment