దేశభక్తిని మన భూజాలపై మోసేందుకు
రాజ్యాంగం అందించిన విలువైన చెక్కు,
వేస్టవుతుందనుకుంటున్న ఎలక్షన్ రోజునూ...
ఓటేసేందుకు వరసలో నిలబడే అరగంట సమయాన్నీ...
అభ్యర్ధులిస్తున్న రెండువేలలెక్కనూ...
నాయకుల వాగ్దానపు సర్కస్సునూ...ఇలాంటివాటిని కాసేపు పక్కనపెట్టి
గతకాలపు పరిపాలన పై ముడుచుకున్న మగతనిద్రనుండి ఒకక్షణం విదిలించు నీ మస్తిష్కాన్నిప్పుడు,
ప్రభుత్వ ఆఫీసులో పదినిముషాలపనికి నువ్వు చెల్లించినదెంతోలెక్క సరిపోల్చుకో ఒకసారి...
మిట్టమధ్యాన్నమే కామాంధులబారినపడుతున్న మన చెల్లెళ్ళ వేధనల్నీ...
లక్షలకోట్లరూపంలో విదేశీబ్యాంకులకు చేరుతున్న మన రక్తమాంసాలనూ...
కుక్కలసమూహంగా మారిపోతున్న చర్చావేధికల్నీ
అమ్మని డిల్లీవీధుల్లో తాకట్టుపెట్టిన చేవచచ్చిన జాతినాయకుల్నీ..
రైతుకి అర్ధరూపాయి దులిపి...ప్రజలనుండి అరవైరూపాయలు పిండుతున్న రాబంధులనీ...
నిజాయితీనిండిన కష్టాన్ని ఆత్మహత్యలకు రహదారిని చేస్తున్న యమభటులనీ...
ఒక్కసారి..ఒక్క గంట...ఒకేఒక్క రోజు...
ఆలోచించి
అవలోకించి
అవధరించి
అత్మీకరించి
కాస్తంత గుర్తుకుతెచ్చుకో,
నీకోసం
నీవారికోసం
మనకోసం
మనవారికోసం తెరిచే నీ చక్షువులు మనిషి ఆశలంత విశాలం చేయ్
ఆ గమకం నీలో నింపుకుని...ఓటువేయాలని నడువ్ ముందుకు
అపుడే...
ఏదేశమేగినా...ఎందుకాలిడినా...
నీదేశం నీకందించే విలువని గర్వంగా ఆస్వాదించగలవ్.
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం