ముకులించిన కోట్ల జోతలు
వదలలేని కన్నీటి వీడ్కోలు
కదనరంగంలో ఫణంగా పెట్టిన
ప్రాణం విలువను చెప్పకనే చెబుతున్నాయి,
ఉరితాడు
రైలుపట్టాలు
పురుగుమందులు
నరికివేతలు
కాల్పుల చిట్టాలు
ఇవికావు చావంటే!
మరణంకూడా మనసున్నదే,
చనిపోయిన మరుసటి క్షణం నుండీ ఉదయించే నీ ఙ్ఞాపకాలనే అది ప్రేమిస్తుంది,
ప్రేమించామనీ
వంచించబడ్డామనీ
తెగనరికామనీ
తెగించలేకపోయామనీ
కుళ్ళిపోతూ
కుమిలిపోతూ
భయపెడుతూ
భాదపడుతూ
కాష్టం వైపు నడిస్తే
నీ ఆత్మకూడా వెంట రాదు.
నమ్మిన వంచకాలు
నమ్మని నిజాలూ
ఆశించిన ధామలూ
అనుభవించని శవాలూ
ఇవికాదు...మన చావుకు కారణాలు!!!
ఏ సంబంధం వుందని..ఉన్నిక్రిష్ణన్ తెగించాడు?
నువ్వేమవుతావని..సాలస్కర్ సాగిపోయాడు?
నా ఒక్కడితో ఏమవుతుందనుకుంటే???
వందకోట్ల మనల్ని రక్షిస్తున్న
జవానులు ఎంతమందుంటారు?
లోపల నీ ఆనందం కోసం
బయట..తమ గుండెకాయల్ని పేర్చి
కాపుకాస్తున్న ఆ త్యాగాలకు మనమందిస్తున్నదేంటి?
చావంటీ అందరికీ ఒకటే..
మనిషికీ
ముష్కరులకీ
మరి..చచ్చాక.. బ్రతుకింకా ఉండేది ఎవరికీ?
మనకోసం మరణించిన
వీరులకి నివాళులివ్వాలంటే..
మన చావుకూ పవిత్రత వుండే..జీవితాల్ని ప్రేమిద్దాం,
మన ప్రేమే వారికి దన్నుగా దేశమాత సన్నిధిలో తరిద్దాం.
[26/11 వీరులకు వందనాలతో...]
శ్రీఅరుణం