Thursday, July 24, 2014

part 5


  1. ప్రత్యమ్నాయం
    ఇది నిజానికి మన ఓటమిని ఎదుర్కొనే మార్గంలో భాగం కాదు.సమస్యను ఎదుర్కొనే దిశలో మనలో సహజంగా ఏర్పడే వత్తిడి, భవిషత్తుపట్ల భయం వంటి లోపాలను తొలగించుకోవటానికి ప్రత్యమ్నాయం అనేది గొప్ప శక్తినిస్తుంది. మనం ఇంతగా తెగించి చేస్తున్న ఈపనిలో ఏదైనా కీడు జరుగుతుందేమోనన్న సంశయం, ఆశించింది దొరకకపోతే... ఏం చేయాలి? ఏమయిపోతాం? మళ్లీ ఈ కాలమూ,డబ్బూ, అవకాశమూ దొరకకపోతే ఏమైపోతాం? నిజంగా చాలామంది ఈ ఆలోచనవద్దనే ముందడుగు వేయలేక ఆగిపోతున్నారు.ఇటువంటి ఆలోచన వీరిని ఒక అడుగు ముందుకు వేస్తే.. రెండగులు వెనక్కి వేసేలా తయారుచేస్తుంది. అటువంటివారు ప్రత్యామ్నయవ్యవస్థనూ తమ దారిలో భాగంగా చేసుకోవటం ఉత్తమం.
    అప్పటికే నాకు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలున్నారు.దిగువ మధ్యతరగతి కుటుంబం.ఆదాయం నష్టాలతో వుంది.అందువల్ల మరో మార్గం చూసుకుందామని ప్రయత్నం.కానీ దానికో తెగించి డబ్బుకానీ, సమయంకానీ, బిజినెస్ కానీ త్యాగం చేయలేని పరిస్థితి???
    ఇంతా చేసి నేను అనుకున్నది సాధించలేకపోతే???
    నా ఈ ప్రయత్నం వలన ప్రతికూలమైన ప్రభావం తనతో పాటూ తన కుటుంబం కూడా అనుభవించాల్సి వస్తుంది కదా???ప్రస్తుతం చేస్తున్న బిజినెస్ కూడా దెబ్బతినవచ్చుకదా???
    మళ్ళీ నాకు జీవితాన్ని సాధించుకునే అవకాశం వుంటుందా???
    ఈ నాలుగు ఆలోచనలతో భారమైన నాఅడుగులకు నేను చూపించుకున్న సూత్రమే... "ప్రత్యామ్నాయంతో నీవనుకున్న దానిని ముందుకు తీసుకువెళ్ళగలగటం".
    మొదట నా మనసులో వున్నది ఒక పరీక్షలో విజయం సాధించటం ద్వారా సమస్యలనుండి బయటపడటం మాత్రమే. కాకపోతే.. ఆ ప్రయత్నానికి ముందు నేను కోల్పోవాల్సివున్న సమయం, డబ్బు వంటివాటిని పూరించే మార్గం కుడా కోరుకున్నాను. అవి దొరుకుతాయన్న ధైర్యం ఏర్పడితే తన ప్రయత్నం విజయవంతంగా పూర్తిచేసుకోగలననిపించింది. అందువల్ల అప్పటినుండీ నా మార్గాన్ని రెండుగా విభజించాను.
    ఒకటి... విజయం సాధించేదిశగా ప్రణాళిక.
    రెండు... ఏమాత్రం ఓటమి ఎదురైనా..నేను చేస్తున్న ప్రయత్నం ద్వారానే మళ్ళీ ఎదగటం.
    అందుకే నేను ప్రిపేరవుతున్న అంశాలను ఎప్పటికప్పుడూ క్రోడీకరించుకుంటూ..సొంతంగా తయారు చేసుకున్న నోట్స్ ప్రింట్ చేసుకుని దాచుకున్నా. నా ప్రిపరేషన్ లో భాగంగా అద్దం ముందు కూర్చుని తనకితానే క్లాస్ చెప్పుకునేవాడ్ని.అలా చెప్పుకున్న క్లాస్ ని సెల్ ఫొన్ లో రికార్డ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ వింటూ తప్పుల్ని సవరించుకునేవాడ్ని.
    ఇలా ఒక విధ్యార్ధిగానేను చేస్తున్న కృషినే, ఒక అధ్యాపకుడిగా మలుచుకున్నాను.
    రెండుమూడుసార్లు ప్రయత్నం కొనసాగింది.అతనికి మంచి మార్కులే వచ్చాయి, కానీ రిజర్వేషన్లూ మరియూ ఇతర రోస్టర్ పాయింట్ల వలన ఉద్యోగం మాత్రం దోబూచులాడుతూనేవుంది. మొదట్లో నా మనస్తత్వంలోనే నేను ఇప్పటికీ వున్నట్లయితే ఆ ఫలితానికి అతను ఎంతగా కృంగిపోయివుండేవాడినో??? కానీ ఇప్పుడు అలా జరగలేదు.
    నిజానికి పరీక్షలవగానే ఫలితాలకోసం ఎదురు చూడలేదు. అప్పటి వరకూ తయారుచేసుకున్న మెటీరియల్ అంతా సిధ్ధం చేసుకుని, పుస్తకాల రూపంలో మార్కెటింగ్ చేయటం ప్రారంభించాను. సొంతంగా ఒక ఎడ్యుకేషన్ హెల్ప్ డెస్క్ పెట్టుకుని, దాని ద్వారా చాలామందికి పరీక్షల విషయమై సహాయం చేయసాగాను.ఇలా పెరిగిన నా సర్కిల్ మరింతగా ముందుకు సాగేందుకు అవకాశం కలిగించింది. ఇంటిదగ్గరలో వున్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులుని సంప్రదించి, స్కూలు ఖాళీ సమయంలో తరగతులు నడుపుకునేలా అనుమతులు పొందాను. అలా కొందరికి ఉచితంగా శిక్షణ ఇస్తూ, తన బోధనాపటిమనూ మరియూ పరిచయాలనూ మరింతగా అభివృధ్ధి చేసుకున్నాను.
    ఫలితాలొచ్చేసరికి దాని గురించి బాధపడుతూ కూర్చోకుండా.....ఇలా తన సొంత అనుభవాలే పెట్టుబడిగా చరిత్ర, రాజనీతి శాస్త్రం, ఇంగ్లీష్ అధ్యాపకుడిగా నిలదొక్కుకున్నాను. ప్రత్యమ్నాయపు బలం అదే.
    ఇలా ఇవన్నీ సమస్య పరిష్కారానికి మార్గాలే. అయితే వాటిని ఆయా కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మన అవసరాలకు దగ్గరగా ప్రణాళికాబధ్ధమైన రీతిలో నిర్వహించగలిగినప్పుడు..జయం మీకు నల్లేరుమీద నడకే.
    ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, సమస్యని పరిష్కరించటమూ విజయం సాధించటమూ ఒకటే కాదు. రెండు దారులతో సాగే ఒకే గమ్యం అవి. సమస్యని పరిష్కరించటంలో ఇప్పటివరకూ మనం చెప్పుకున్నవి సహాయపడుతుంటాయి. విజయం సాధించటానికి మాత్రం మరికొన్ని అంశాలు కావలసివస్తాయి.పరిష్కరించబడిన సమస్య మార్గాన్ని చూపెడుతుంది, కానీ సాధించబడిన తరువాతే విజయం గమ్యాన్ని చేరుతుంది. ఈ తేడాని మాత్రం ఎప్పుడూ మరచిపోకండి. విజయం ఒక నిరంతరయానం మనకు జీవితం వున్నంతవరకూ.అది మనం గుర్తిస్తేనే హృదయమూ మెదడూ నడవడికా అన్నీ చైతన్యవంతంగా ఉండి జీవితంలో ముసలితనం అనే జడత్వాన్ని మన చెంతకు రానీవు. 114 సంవత్సరాలు బ్రతికిన మనిషి ఇంకేం సాధిస్తాడులే అనుకోవద్దు. ఆ 114వయస్సే అతను సాధించిన గిన్నిస్ రికార్డ్ కదా.
    అయితే నా ప్రధానలక్ష్యం మాత్రం ఇంకా పోరాటం సాగిస్తూనేవుంది.కాకపోతే కొందరుమనుష్యులూ, మరికొన్నిమలుపులు నాతో ఆడుకోవటమూ ప్రారంభించాయి. వాటి గురించి తరువాత భాగంలో చెప్పుకుందాం మరో నాలుగురోజులతరువాత.
    మీ
    శ్రీఅరుణం
    9885779207
    విశాఖపట్నం

Tuesday, July 15, 2014

part-4


ఒక వృత్తిపనివాడిగా వుంటూ చదువుకున్న నాకు అందుబాటులోకి వచ్చిన మొదటి అవకాశం ప్రభుత్వౌద్యోగానికై పోటీపరీక్షలకు ప్రిపేర్ కావటం. పి.జి.వరకూ సంపాదించిన అర్హత నాకు ఆ మార్గాన్నిచ్చింది. దాంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీష వారి ఉధ్యోగ ప్రకటన చూశాను.అవి గ్రూప్ 1,2,4 కేటగిరులకు సంబంధించినవి. నిజానికి అప్పటికి నా మనసులో వున్నది రెండే అంశాలకు చెందిన విఙ్ఞానం మాత్రమే. అవి..
నా డిగ్రీకి సంబంధించిన సబ్జెక్ట్స్ పై వున్న పట్టు,
మరియూ… ఆ ఉధ్యోగాలకు అప్లయ్ చేసి ప్రిపేర్ అవ్వాలన్న తపన. ఇవి రెండే నన్ను ముందుకు నడిపించాయి. వాటి సహాయంతో నేను ముందుగా ఇలా నిర్ధారించుకున్నాను.
"నా ఆదాయం తగ్గబోతుంది. ప్రస్తుతానికైతే నా అదనపు పని ద్వారా సంపాదించుకున్నది అక్కరకొస్తుంది. కానీ కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు, అందువల్ల ఇప్పటినుండే నేను మరో అవకాశం కోసం ప్రయత్నించాలి". అందుకోసం నాకు రెండు మార్గాలు తోచాయి. ఒకటి.. నాదగ్గరున్న డబ్బుతో బిజినెస్ ప్రారంభించటం,
రెండు.. కొంత కాలాన్నీ, కొంత డబ్బునీ వెచ్చించి నా దగ్గరున్న లక్షణాలతో మరింత మంచి పొజీషన్ సంపాదించటం. అందుకొరకు ప్రస్తుతం కాలం నా చేతుల్లో వుండనే వుంది. ఇక డబ్బుకుడా వుంది. కాకుంటే ఫలితం మాత్రం ఖచ్చితంగా మంచిగా రావాలి, లేకుంటే కాలంతో పాటు ఇన్నాళ్ళూ సంపాదించిన డబ్బు తిరిగిరాదు. ఇది ఒకరకంగా నాకు తప్ప మావాళ్ళెవరికీ ఇష్టం లేదు. అందువల్ల ఈసారి నేను మరింతగా హార్డ్ వర్క్ చేయాల్సివుంటుంది.
ఒకటి.. నేను గెలవటానికీ.
రెండవది.. నన్ను నమ్మిన వాళ్ళు ఓడిపోకుండా చూడటానికి.
అంటే నా వర్క్ ఇప్పుడు ఎంతో హార్డ్ గా వుండాలికదా.సరే అందుకే ఈ రెండు బాధ్యతలనీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ నేను నా హార్డ్ వర్క్ ని రూపొందించుకున్నాను.
ఇప్పుడు మా పని వున్న స్థితిలో రోజు మొత్తం మీదా ఐదు గంటలకి మాత్రమే సరిపోతుంది. ఇది మాములు ఖర్చులకు సరిపోతుంది. అంటే మిగులు కానీ, అదనపు సంపద కానీ వుండవు.
"అందువల్ల నేను ఉద్యోగానికై బయట ప్రిపరేషన్ తీసుకొనే అవకాశం దాదాపు కత్తిమీద సామే"
అంతకంటే నాకు మిగులుతున్న అదనపు సమయాన్ని మరింత ఎక్కువగా చదవటం ద్వారా, మంచి జాబ్ సాధించి ఈ వెనకబడిన పరిస్థితుల నుండి బయటపడనూ వచ్చూ, అలాగే నా వాళ్ళకు అభధ్రతా భావం లేకుండా తొలగించనూవచ్చు.
అందుకోసం `నాకు పని లేక మదన పడుతున్న సమాయాన్ని హార్డ్ వర్క్ అనే దారిలో మళ్ళీంచగలిగితే చాలు`.
అలా సుమారు మరో ఆరు సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. ఎ.పి.పి.యస్,సి, వారి గ్రూప్స్ పరీక్షలలో విజయంకోసం నేను హార్డ్ వర్క్ ప్రారంభించాను. నిజానికి మాములుగా కేవలం అదే పనిమీద మనసుపెట్టి హార్డ్ వర్క్ చేస్తే ఒక సంవత్సరంలొ జాబ్ సంపాదించవచ్చు. కానీ...
నా సొంత పరిస్థితులతో అంటే ఒకవైపు వృత్తిచేసుకోవాలి,
మరోవైపు కుటుంబబాధ్యత చూసుకోవాలి,
అన్నిటికంటే ముఖ్యమైన అడ్డంకి బయటకి వెళ్ళి చదువుకోలేని పరిస్థితి.
వీటిని ఎదుర్కొంటూ నేను ఆ విజయం సాధించాలి కనుక... ఆ సమయం పట్టింది. అయితే ఇక్కడ నాకు హార్డ్ వర్క్ అనేది నాతోపాటుగా అప్పటికే నా చుట్టూ అల్లుకున్న కుటుంబ బంధాలకు ఆలంబనగా నిలిచి, నాకు ఎంతో గొప్ప సాయం అందించగలిగిందన్నది మాత్రం వాస్తవం గా నిలిచిన సత్యం. ఇక్కడే మీకు మరో నిజం చెబుతున్నాను. నిజానికి అంతగా నేను నా లక్ష్యాన్ని నమ్మి నడుస్తున్నా...నాలోనూ కొన్ని అనుమానాలు వెంటాడుతుండేవి. అవి...
ఒకవేళ నేను ఈ ఉద్యోగసాధనలో నెగ్గలేకపోతే...తరువాత భవిష్యత్ లో ఎలా స్థిరపడాలి?
మరోక ప్రత్యమ్నాయం దొరికేంతవరకూ కాలం, డబ్బూ, బాధ్యతలూ ఆగవుకదా...వాటిని ఎలా అనుకూలంగా మలుచుకోవాలి?
ఈ ఆలోచనలే నాకు నా లక్ష్యసాధన నుండే భవిష్యత్ ప్రణాళికను కూడా తయారుచేసుకునే విధానాన్ని నేర్పాయి. అందువల్లనే నేను అధ్యాపకుడిగా కూడా మారగలిగాను. దానికి సంబంధించిన ఒక నిజాన్ని ఇక్కడ చెప్పాల్సివుంది. తరువాత భాగంలో చెప్పుకుందాం మరో రెండురోజులతరువాత.
మీ
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం-1

Saturday, July 12, 2014

part-3
నాకు తెలిసీ ఈ ప్రపంచంలో ఓడిపోవటానికంటే గెలవటానికే ఎక్కువ మార్గాలున్నాయి. ఎందుకంటే?...ఓటమి ఒక ఫలితానికి గుర్తు. కానీ...ప్రతీ ప్రయత్నానికీ గెలుపన్ననమ్మకమే నాంది. అందుకే నా అవసరాలకుసరిపడినంతగా ఆదాయం రాకున్నా ప్రస్తుతానికి అవసరం కనుక పనిలోనే కొనసాగుతూ చదువనే ఒక్క అవకాశాన్ని నమ్ముకోవటంవలన నా భవిషత్తుకోసం నాకున్న అవకాశాలను వెతుక్కోవటం ప్రారంభించగలిగాను. అలా ఒక వృత్తిదారుడనైన నాకు ఎన్ని అవకాశాలు మార్గాలుగా మొదలయ్యాయంటే... 
1.అధ్యాపకుడిగా
2.ప్రభుత్వ ఉద్యోగానికై పోటీపడే అభ్యర్ధిగా 
3.క్రీడాకారుడిగా
4.రచయితగా 
5.సామాజికసేవా చేయగలిగే ఙ్ఞానం సంపాదించగలిగేలా
6.నాటక దర్శకుడిగా,నటుడిగా
7.కొందరి మాటల్ని నమ్మి అవే వాస్తవాలని ముందుకుసాగి మోసపోయినవాడిగా,
8.ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి, మళ్ళీ నాకునేనుగా నిలదొక్కుకొని, నాలాగా బాధపడుతున్నవారి ఊరట కల్పించాలన్న సంకల్పంతో ఇలా రాస్తున్న వ్యక్తిగా...ఇలా చెప్పుకుంటూపోతే చాలారకాలుగా నాకు అవకాశాలు కనిపించటం మొదలయ్యాయి. 
ఇక్కడే మీకొక విషయం చెప్పాల్సి వుంది. ఇన్ని అవకాశాలు దొరికాయికదా మరి నా విజయాల సంగతేంటని మీకు అనుమానం రావొచ్చు. అక్కడేవుంది అసలైన ట్విస్ట్. నిజానికి మొదట్లో చెప్పినట్లు నాకు లభించిన ప్రతీదానిలో నేను జీవితాన్ని సెటెల్ చేసుకునేంతగా విజయాలను సొంతం చేసుకోలేని పరిస్థితులే ఎదురయ్యాయి. అలాంటి స్థితులలో నేను ఆత్మహత్య వరకూ వెళ్ళాలని నిర్ణయించుకున్న సందర్భాలూ వున్నాయి. అప్పుడే వాస్తవాలకూ జీవితాలకు వున్న బ్యాలెన్స్ అర్ధంచేసుకోవటం మొదలుపెట్టాను. 
జీవితం బ్రతుకుతెరువుకోసం తాపత్రయపడితే...
వాస్తవం బ్రతుకుమీద తీపిని నిలుపుకోవటానికి పనికొస్తుందని తెలుసుకున్నాను. 
ఇదంతా తెలుసుకుని నిలబడటానికి నాకు లభించిన అవకాశాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం.
మొదటగా అధ్యాపకుడిగా నాప్రస్థానం చెప్పుకుందాం తరువాత భాగంలో మరో రెండురోజులతరువాత.

శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం-530001

Tuesday, July 8, 2014

మనలో చాలామందిమి.....

PART.2
మనలో చాలామందిమి అవసరాలను తీర్చేసుకోవటానికి ఇచ్చేంత ప్రాధాన్యత, అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఇవ్వం. అయితే ఆ రెండిటికీ మద్యనున్న తేడాను స్పష్టంగా తెలుసుకొని ఆచరణలోకి తేగలిగినవారే జీవితమనే సుధీర్ఘకాలంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సరైన ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సూత్రం నాకు పుస్తకపఠనం ద్వారా లభించింది. నేను స్వర్ణకారవృత్తిలో వున్నప్పటికీ చదువంటే నాకున్న ఇష్టం ఎప్పుడూ తగ్గలేదు. చదువంటే కేవలం స్కూల్ కి వెళ్ళి చదివితే అబ్బేదికాదుకదా. అందుకే నాకున్న్నవీలునుబట్టీ పుస్తకాలు సేకరించి చదువుకునేవాడిని. అలా నాకున్న అవకాశాలను తెల్సుకుంటూ మెట్రిక్యులేషన్ ప్రైవేట్ గా రాశాను.ఉదయం 7.30 నుండి రాత్రి 9.30వరకూ నా పనిలో ఖాళీ వుండేదికాదు. మరి చదవటానికి సమయం ఎలా? ఇక్కడే నేను అవసరానికీ, అవకాశానికీ మద్యనున్న ఫలితాన్ని నమ్ముకున్నాను. నా పనివలన వచ్చే ఆదాయంతో కుటుంబ పరిస్థితులనే అవసరాలను తీరిస్తే, నా భాద్యతలు సర్దుకుంటాయి, కానీ...
సీజన్ పరంగానూ,
పోటీపరంగానూ,
మారుతున్న ఆధునికతపరంగానూ మనస్థానాన్ని నిరంతరం నిలుపుకోవాలంటేమాత్రం కొత్తకొత్త అవకాశాలకు అనుగుణంగా మనం మారాల్సివుంటుంది. ఆ మార్పుకు సరిపడేలా నన్నునేను నిలుపుకోవాలంటే మరికొంతసమయం తప్పదని నిర్ణయించుకున్నాను. దానికి సరిపడేలా రాత్రిసమయాన్ని మలుచుకున్నాను. అలా మెట్రిక్, ఇంటర్, డిగ్రీ, పి,జి. మంచి పర్సెంటేజ్ తో పాస్ కాగలిగాను. ఇదంతా నా పని మానకుండానే.
సరే....ఈలోపు పెళ్ళీ పిల్లలూ నాజీవితంలోకి వచ్చేశారు.
మరోవైపు తొంబైల్లో ప్రారంభమైన ఆర్ధికసంస్కరణల పూర్తి ప్రభావం ఈ పదిసంవత్సరాలలో పూర్తిగా అన్ని చేతివృత్తులపైనా విరుచుకుపడింది. నిజానికి నేను నా అవసరాలు తీరుతున్నాయని అక్కడే వుండిపోతే నా చేతిలో కేవలం ఒడిదుడుకుల్లో వున్న చేతివృత్తి మాత్రమే మిగిలిపోయుండేది. ఇప్పటికీ చాలామంది చేతివృత్తిదారులు అదే త్రిసంకుస్వర్గంలో నానావస్థలూ పడుతూనేవున్నారు. ఎందుకంటే వారికి అదితప్ప మరోప్రపంచం తెలీదు పాపం. చిన్నప్పుడే పనిలోకి రావటంవలన చదువుకూ దానివలన ప్రపంచవిధానాలకూ దూరంగావుండాల్సిన పరిస్థితికి వారు లోనవుతారు. దానికితోడు భద్రతలేని వృత్తి అవటంవలన నిరంతరంగా కాపాడుకోవటానికి విపరీతమైన ఒత్తిడిని అనుభవించాల్సినస్థితి!!! అందువల్లనే వారు మరోవైపుకివెళ్ళే ధైర్యం చేయలేకపోతారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే నేను పూర్తిచేసిన ఉన్నతచదువు నాకు మరో అవకాశంవైపుకి నడిపింది.
ఆ అవకాశం ఎలాంటిదో మరో రెండురోజులుపోయాక ఇక్కడే కలిసి చెప్పుకుందాం.

మీ శ్రీఅరుణం
విశాఖపట్నం
9885779207
A.V.N.COLLEGE DEGREE PHOTO.

Sunday, July 6, 2014

తొంబైవ దశకంలో మొదలైన ఆర్ధిక సంస్కరణలు...

PART 1
మాది స్వర్ణకారవృత్తి చేసుకునే విశ్వబ్రాహ్మణ కుటుంబం. నేను 8వ తరగతిలో వున్నప్పుడు నాన్నగారికి ఆరోగ్యసమస్య రావటంవలన...డాక్టర్ గారి సూచనమేరకు నేను చదువుకు తాత్కాలికంగా స్వస్తిచెప్పి స్వర్ణకారవృత్తిలోకి ప్రవేశించాను. నేను పనిలోకి ప్రవేశించేనాటికి దేశంలో ఆర్ధికసంస్కరణలు మొదలవటం ప్రారంభమయ్యాయి. కొంతకాలంవరకూ సంపాదనగానేవుంది కానీ తరువాతపరిస్థితులలో మార్పొచ్చింది.
తొంబైవ దశకంలో మొదలైన ఆర్ధిక సంస్కరణలు దేశానికి ఏం చేశాయో చెప్పడానికి పెద్ద ఆర్ధిక వేత్తలున్నారు, కానీ... వాటి ప్రభావంవలన మాలాంటి చేతివృత్తులవారి జీవితాలు ఎంతగా బుగ్గిపాలయ్యాయో మాత్రం మాకు మాత్రమే తెలుసు. ప్రభుత్వాలు ఏవో చేశాయంటున్నాయి కానీ, పని చేసేవాడికి కల్పించాల్సిన సరైన ప్రత్యమ్నాయాన్నీ మాత్రం అందించలేక పోయాయనే చెప్పాలి. పనివాడికి కావలసింది పనే. అంతేకానీ కొంత డబ్బు ఇస్తే వాడికి జీవితం ఇచ్చినట్లా? దేశం కొసం సంస్కరణలు చేయటం మంచిదే, కానీ రోజు కూలీపై బ్రతికే వారిని రొడ్డున వదిలేసి దేశాన్ని ఎలా బాగుచేస్తారు? పోనీ వారికోసం ఏదైనా కార్యాచరణ చేశారా అంటే.. అది మధ్యవర్తుల వద్దనే మ్రింగుడైపోయింది. సొంత అనుభవంతో చెబుతున్నా.. సంస్కరణలు దేశంలో పేదవారికోసం, వృత్తిదారులకోసం, స్వయంగా బ్రతుకుతున్న వారికోసం చేసిందేమీలేదు. వారంతట వారు నిలదొక్కుకోవటమో, లేక చావటమో చేస్తున్నారు...ఇప్పటికి కూడా. అలాంటి స్థితులలో నా పని కూడా దెబ్బతింది. లైసెన్సులు రద్దుకావటంతో పెట్టుబడిదారులకి దారులు పూర్తిగాతెరుచుకున్నాయి. రెడీమేట్ సంస్కృతి విచ్చలవిడిగా మారింది అన్నిటిలోనూ. ఆ దారిలో మాలాంటి వారంతా నలిగిపోయారు. ప్రభుత్వానికి లెక్కలు పెరిగితే చాలు, ఇక ఎవడికి వాడే చచ్చీచెడీ తమ జీవితాలను పునర్ నిర్మించుకోవాల్సిన స్థితి!!!
తరువాతభాగం కొరకు మరో రెండురోజుల తరువాత ఇక్కడే కలుద్దాం

శ్రీఅరుణం
9885779207

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.