Thursday, August 22, 2013

మహాభారత ఉధ్యమం పార్ట్ 1

క్రీ.పూ.261.కళింగ యుద్దం ముగిసినరోజులు.అప్రతిహాతమైన విజయం దక్కించుకున్న అశోకచక్రవర్తి నివాసముంటున్న రాజగృహ సముదాయమది.అపూర్వమైన ఆ విజయంతో నిజానికి శోభాయమానంగా వెలుగులుచిమ్మాల్సిన ఆ రాజభవనంలో అటువంటి చాయలేవీ కనపడుటలేదు.ఎక్కడ చూసినా ఏదో నిరాశ, ఎవరిమోములోనైనా మరేదో నిర్వేదం గోచరిస్తున్నాయి. అన్నిటికీ మూలమైన అశోకుని మందిరంలో పరిస్థితి మరింత ధారుణంగా వుంది.విజయానికి చిహ్నమైన ఆ చోటు అందుకు విభిన్నమైన అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది? ఆయన శయనమందిరం నిశ్శబ్దంతో నిండిపోయివుంది.ఆ నిశ్శబ్దపు సంధిగ్దం లోంచి పుడుతున్న గాలితెరలు ప్రశ్నలుగా సంచరిస్తున్నాయి.
ఆ ప్రశ్నలలో ఎన్నో వాస్తవాలు, గతకాలపు అనుభవాలు, భవిష్యత్తుని నమ్ముకున్న ఊహలు...ఇవన్నీ కలగలసి ఆయనని ఉక్కిరిబిక్కిచేస్తున్నాయి.వీటన్నిటినీ భేదించాలని చూస్తున్న అతని మస్తిష్కం ఏ క్షణాన్న ఎలా విస్ఫోటనం చెందబోతుందో? అని అందరూ భీతావాహులై ఎదురుచూస్తున్నారు. వారికప్పటికి తెలిసిన అశోకుడు చండాశోకుడే.
కానీ అతనిలోనే ఇప్పుడు మరో మనిషి వున్నాడన్న సత్యం గోచరమవుతుంది.అదే  ఇప్పుడు ఆయనలో జరుగుతున్నది మానసిక ఘర్షణ.  ఈ ఘర్షణ, ఆవేశం ఏవరిమీదోకాదు  తనమీద తనకే. అందుకే ఆయన నిశ్శబ్దాన్ని తోడుతీసుకున్నాడు. ఆ తోడే ఆయనకి అనేక నిజాలను హృదయం ముందు పరుస్తున్నది. వాటిని మొదటిసారిగా ఒక రాజుగాకాక, ఒక మనిషిగా చదువుకోవటం ప్రారంభించాడు.
   తండ్రి బింధుసారుడు చనిపోయిన తరువాత రాజ్యాధికారం కొరకు జరిగిన వారసత్వయుద్దంలో బంధం, బంధుత్వం, జాలీ, వివేచనా అనేవి లేకుండా రాజధర్మం అనే ద్వజాన్ని తన మనసుల్లోకి పాతుకున్నాడు. తద్వారా లభించిన బలంతో రాజ్యానీ, ప్ర జలనీ అణగదొక్కి పాలించాలనుకున్నాడు. అందుకోసం నిరంతరమూ శ్రమించాడు కూడా. దానికి ఫలితంగా తనకు లభించిన చండాశోకుడన్న పేరు చూసి గర్వించేవాడు. అప్పుడు తను నమ్మినది రాజే ప్రజలు అని. తన మనస్సు ఎక్కడ ఆనందాన్ని పొందుతుందో అదే తను నిర్వర్తించాల్సిన ధర్మం అని నమ్మాడప్పుడు.
   మరి? ఇప్పుడు...తను ఎంతో గొప్పదని నమ్మిన కళింగయుద్దవిజయం తనకెందుకు శాంతినివ్వటంలేదు?  
ఒక రాజుగా, అంతకు మించి సామ్రాట్టుగా తన ధర్మమేగా తాను సాధించాడు?
యుద్దంలో శత్రువుని వధించకుంటే వాడు తనని వదులుతాడా?
అయినా... తెగిపడుతున్న ప్రతి శిరస్సూ తన అంతరాత్మతో ఏం మాట్లాడుతుంది?
అసలు ఈ యుద్దాలు తానెందుకు చేస్తున్నాడు?
యువరాజుగా వున్నప్పుడు... తక్షశిలలో ప్రజల తిరుగుబాటుని అణచివేసినప్పుడు అసలు తాను ఏం ఆలోచించాడు? తనకున్న అదికారబలంతో వారిని అణగదొక్కాననుకున్నడనుకున్నాడే కానీ, తాను గర్వంతో వేసిన అడుగుల పక్కన నోళ్ళుకుక్కుకున్న ప్రజల వేదనలని విన్నాడా?లేదు. అదే ఇప్పుడు తనలో తిరగబడుతుందా?...
పోనీ తరువాత రాజుగా అధికారాన్ని సాధించుకున్నాకైనా సాటి మనిషి కోరుకుంటున్న ఆశలని పరిశీలించగలిగాడా అంటే? అదీ లేదు. ఎంతసేపూ ప్రజలనందరినీ తనకు విధేయులుగా నియంత్రిచాలన్న సూత్రమే తప్పించి, వారు కోరుకుంటూన్న వాటిని నిజాయితిగా తీర్చటంద్వారా వారి హృదయాలను గెలుచుకొనే ప్రయత్నమూ చెయ్యలేదు. పాపం వారెంతగా తనని ఈసడించుకున్నారో దానికి ప్రతిరూపమే ఆ చండాశోకుడన్న పేరని ఇప్పుడు అర్ధమవుతుంది.
సరే ఇక కళింగ. "ఈ విజయం ద్వారా మన రాజ్యం మరింతగా విస్తరింపచేశానని" గట్టిగా అరిచి తన ప్రజలకు చెబుదామంటే, యుద్దంలో తెగిపడిన రక్తపు ముద్దలు తమలాంటి మనుషులవేనని వారు తనతో చెబుతున్నట్లు గొంతుకు అడ్డుపడుతున్నాయి. ఇదంతా తనలో మానసిక విధ్వంసానికి దారితీస్తుందిప్పుడు. అయినా తన నమ్మకాలతో తనని అనుసరించినవారూ వున్నారు కదా? వారికి రాని ఆలోచనలు తనకెందుకు వస్తున్నాఇప్పుడు?
    వారు తమ ధర్మాన్ని కాకుండా  రాజుధర్మాన్నే పాటించారా? అయివుండొచ్చు. అలాంటి ప్రజలకోసం రాజుగా తను ఏం చేయాలిప్పుడు?
 ప్రజలు తాము ఏర్పడిన సమూహాలకి భధ్రతగా రాజ్యాన్ని నిర్మించుకున్నారు.ఆ రాజ్యాన్ని కాపాడుకోవటానికి రాజుల్ని తయారుచేశారు. ఆ రాజు ధర్మం వారిని ఆ సమాజంలో భధ్రంగా కాపాడటమే అయినప్పుడు...తను మాత్రం చేసిందేమిటి? చిన్నచిన్న రాజ్యాల మధ్యన తిరుగుబాట్లను అణచివేసి వాటన్నిటినీ కలిపి మహా సామ్రాజ్యంగా మలచాడు. ఆ దారిలోనేగా ఈ రక్తపాతం జరిగింది. ఒక పెద్ద లక్ష్యం కోసం చిన్నచిన్న సమస్యలని పట్టించుకోవాలా? అది ప్రజలకు తెలీదా? 
సొంతప్రజల మధ్యన సమైక్యతకోసం తిరుగుబాట్లను అణచినా తనకి చెడ్డపేరు తప్పలేదు. 
బయటప్రజలపై గెలిచినా చెడ్డపేరు తప్పట్లేదు.
ఏమిటీ ప్రపంచం?
అసలు ప్రజలంతా కోరుకునంటున్నదేమిటి?
రాజుగా తను ఎక్కడ తప్పుచేశాడు?
రాజ్యం నిజమా?
రావణకాష్టం నిజమా?
నమ్మకం నిజమా?
నమ్మటం నిజమా?
చక్రవర్తిగా తను నిలవటం నిజమా?
మనిషిగా తనను తాను నిలబెట్టుకోవటం నిజమా?
ఏది ఈ ప్రపంచాన్ని ఏకత్వంగా నిలిపివుంచగలుగుతుంది?
బలమా? విధ్వంసమా? పదవా? అధికారమా?....
వీటిల్లో ఏ ఒక్కటి నిజమైనా తాను యువరాజుగా వున్నపుడూ, మహారాజుగా మారినప్పుడూ, సామ్రాట్టుగా రూపొందినప్పుడూ ఎప్పుడూ ఇదే సమస్య ఎలా తలెత్తుతుంది? 
అసలు శాశ్వతమైన సామరస్యం నిరంతరమూ ఈ మనుషుల మధ్యన వుండకపోవటానికి కారణం ఎవరు?
1.ఏకత్వసాధనను కేంద్రీకరించాలనుకోవటమా?
2.రాష్ట్రాలు,ఆహారాలు,ప్రాంతాలు అని పాలనాసౌలభ్యం కొరకు విభజించిన ఫలితమా?
3.మానవ ప్రవృత్తిలోనే వున్న వ్యక్తిత్వపు నిరంకుశమా? 
ఏది ఈ విశ్వానికి శాంతి నిస్తుంది?.....
అర్ధశాస్త్రంలో వున్నట్లు ఎవరికివారు తమ పదవికున్న ధర్మాన్ని పాటించుకుంటూ పోవటమేనా జీవితసాఫల్యం. అలాగైతే, ఈ భిన్నత్వాలు ఎప్పటికీ సమసిపోవుగా. మనిషి మనిషికీ మధ్యన ఎడారి పెరిగిపోతుంది కదా. ఒకరి శాంతి మరొకరి అశాంతిగా మారని విశ్వమానవ కళ్యాణానికై ఏం చేస్తే బాగుంటుందో...అది చేయటానికి సంకల్పిస్తేనే తనలోని ఈ మానసికవేధనకి నిజమైన ప్రశాంతత కలుగుతుందేమో...
ఇలా....
 ఆయన పడిన వేధనకి సమాధానంగా బౌద్ధాన్ని అనుసరించారేమో కానీ, అది సమస్యకి పరిష్కరం మాత్రం కాలేకపోయింది.ఎందుకంటే ఆయనలోని ప్రశ్నలు మానవులందరికోసం అయినా తను చెప్పుకున్న సమాధానం మాత్రం తానొక్కడికోసమే. అంతటితో అశోకుని చిత్తం శాంతించేమోకానీ, ఈనాటికీ మనిషి మనిషికీ మధ్యన వైషమ్యాల చిచ్చు అలా రగులుతూనేవుంది. ఎలాంటి విభిన్నతల ప్రపంచం కక్కుతున్న ఉధ్యమాలకు ఏది పరిష్కారం? ఎప్పటికి ముగింపు?...
ఈ ప్రాచీనభారత యుగపు  ఆలోచనేమధ్యయుగానికి పయనించి అక్బర్ సామ్రాట్ మదిలో గూడుకట్టుకుంది. ఏదో ఒక సంధర్భంలో ఆ గూడులోంచి ఆలోచనలు భళ్ళున ఆయనను చుట్టుముట్టాయి
ఎందూకూ?
ఎలా? అంటే మరోసారి...వాటిని వచ్చేవారం ఇదేరొజు[28ఆగస్ట్]న ఇక్కడే చదువుదాం.   









atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.