నా దేశపు వీధిబడికి మళ్ళీ వచ్చేసింది జెండాపండుగ
వృద్ధాప్యం దరిచేరిన ఊపిరిలా జెండాకర్ర వొణికిపోతుంది,
మూడురంగులూ ముచ్చటగా నింపారు
శాంతిచక్రాన్నిమాత్రం ఎక్కడో వదిలేశారు,
ఏమయిందంటూ వెదుకుతూవెళ్ళాను...
వీధిమలుపులో చెత్తకుండీనిండా తగలబడుతున్నాయి
రాత్రి మతఘర్షణల్లో ముగిసిన జీవితాల కాష్టాలు..
ఆ కుళ్ళుభరించలేక మరోవైపు కదిలాను,
గరిక పిలిచింది "గ్రామం ఇటుందని"
ఆశల గాలితెరలు ఊతంగా నిలవగా
పొలాలచేతులుపట్టుకొనినడిచానటువైపు
ఏముందక్కడ?
స్వఛ్చమైన ఆప్యాయతలుపూరిగుడిశె చూరులో చిక్కుబడిపోయాయి
తాత కాల్చి వదిలేసిన చుట్ట ముక్కలా?
ఆ తపోభంగం నన్ను అక్కడ వుండ నివ్వక మళ్ళీ రొడ్డెక్కాను...
ఏ దిక్కున నిలబడి చూసినా...
ఇప్పుడిక్కడ భారతదేశం కనిపించనివ్వటంలేదు,
ఎవడికి కావలసిన పీలికనివాడే చీల్చుకుంటున్నాడు.
నాయకులు నయవంచకులవుతుంటే...
నమ్మకాలు నడిరోడ్డుపై ఉరితీయబడుతున్నాయి,
శాంతి ఎక్కడుందనిపించగా..
ఇంకెందుకులే అశోకచక్రం అనుకుంటూ వెనుదిరగబోయాను.
నా సణుగుడు వినిపించిందేమో...
ఓ లేతగుండె స్ఫందించింది
ఆగమని సైగచేసి భుజంపైనున్న బడిబస్తాను క్రిందకి దించి
ఆ కమ్మని హృదయపు రంగులపెన్సిళ్ళతో...
లేతనైన ఆశల మునివ్రేళ్ళతో గీసిచ్చింది అశోకచక్రాన్ని
"అంకుల్, మా కోసం ఇది అంటించండంటూ..."
శ్రీఅరుణం
విశాఖపట్నం