నే వెళ్ళిపోయాను.. నీ పక్క చోటులోంచి..
నీదైన హృదయం పెడరెక్కలు విరిచి కట్టి
నా మదిని దూరంగా విసిరికొడితే..
ఏమయిందో అర్ధంకాని పసితనపు దీనత్వంతో
నే వెళ్ళిపడ్డాను
నీ నిశ్శబ్దపు చేతకానితనానికి బలవుతూ!
ఇప్పుడూ నిన్ను అందుకోవాలనే వుంటుంది
పరిగెత్తమంటూ ఆత్మకు చెబుతున్నా..
కాళ్ళు కదలని అవిటితనాన్ని నమ్మిస్తుంది.
నా ప్రాణాన్ని మూటకట్టుకున్న నీ నవ్వును చూడాలంటే..
రెప్పలు విప్పితే సరిపోతుంది,,
కానీ.. కన్నీరు కనుగ్రుడ్లను ఎప్పుడో మ్రింగేసింది.
అరగంటకొక్కసారి నిన్ను పిచ్చెక్కించిన నా ఫోన్ కాల్
మూగదై
జాలిగా
నిన్ను చూస్తూ రోదిస్తున్నట్లు అనిపిస్తుందా?
అదేరా నేను నీదగ్గర వదిలేసిన ఆఖరి నిఛ్ఛ్వాసం.
ఒరేయ్ ఎప్పుడైనా గుర్తొస్తానా???
పిల్లల నవ్వులలో
పిచ్చి గెంతులలో
హడావుడీ పరుగుల్లో
ఆర్ధత నిండిన కన్నులలో
గుప్పెట స్ఫర్శించే ప్రేమ కౌగిళిలో
నేను వేరనుకున్నప్పుడు రగిలే గుండెకోతలో
వర్షంలో తిన్న ఐస్ క్రీం చాక్లేట్లలో
ఇద్దరం విడివిడిగా తాగినప్పుడు.. ఏడుపుమొఖం పెట్టిన కూల్ డ్రింక్ సీసాలో,"నీ చేతులతోనే పెట్టరా" అంటూ కొనిపించుకున్న పువ్వుల నవ్వులలో,
అయినా.. నా ఆత్రం కానీ.. నువ్వున్న ఎందులో నేనుండను?
నీ ప్రతీ అడుగు క్రిందా మెత్తగా తగిలే స్పర్శ నాదే గా
రోజుకొక్కటైనా కన్నిటిబొట్టు నాకోసం విడవకపోతావా
బస్ లో వెళుతూ కిటికీ పక్కగా కూర్చుని
రోడ్లను ప్రశ్నించే నీ చూపు..
వెళ్ళిపోతున్న వేల స్కూటర్ల వంక ఎంతగా పరిగెడుతుందో..
అందులో ఒక్కటైనా నాది కాకపోతుందా? అని నమ్ముతూ.
నీకు తెలీదురా
నేనూ వస్తాను
నిన్ను చూడాలని
నా కన్నులు బూతద్దాలై అందించే నీ రూపాన్ని
మెదడు నిండా నింపుకుంటాను.
కానీ నీకు కనిపించాలంటేనే భయం
నిన్ను చూసే క్షణాలలొ కట్టలు త్రెంచుకొనే నా గుండెలను
నేను నియంత్రించుకోలేనన్న ఆందోళన.. నన్ను అక్కడ నిలవనివ్వదు.,
అందుకే పక్కకి తప్పుకుంటాను..వర్షించలేని మేఘంలా.
క్షమించరా. ఇక రాయలేకపోతున్నాను.
రాయాల్సినవి లేక కాదు..
ఇప్పటికే కన్నీళ్ళు నా కన్నులను పూర్తీగా బంధించివేశాయి.