అరుణానికి సెలవిస్తారా ?
అంబరమిక బ్రతికేదేలా .
చుట్టుముట్టిన సెగలపై చిరాకుపడి
తను పుట్టిన శూన్యం దగ్గరకే పొమ్మని
సాగనంపగల వారెవరసలూ ?
మనకు తెలీదా తన అస్తిత్వం శూన్యానికి శత్రువని ,
జాగృతికి చుక్కానీలు రచించే ..ఆ..
కావ్యగణితం
తన కిరణాలతో ఎన్ని వెలుగుల్ని బ్రతికిస్తుంది .
ఆస్వాదనని హత్తుకొనే ఆ పిలుపు కోరాలే కానీ
తన జ్వాలానేత్రం నుండి ..ఎన్ని
నులివెచ్చని కంబళ్ళను
మన మంచునిద్రపై కప్పుతుంటుంది .
నిరంతరం నిప్పుల్ని తను కాగుతూ
నవ్వులరేకుల్ని నీకు పువ్వులుగా అందిస్తుంది .
ఆర్ధత నిండిన భువిని తనివితీరా కౌగిలించుకొని
లోతుల వైషమ్యాన్ని బయటకు నెట్టేస్తుంది .
ప్రేమతో ఆగినవారికి ..
ప్రేమనే పంపిస్తుంది .
పగతో వంచించేవారికి ..
లావాతో సమాధానమిస్తుంది .
మరి ?ఎలా?
అరుణానికి సెలవిస్తారు ?
తను లేకుండా ఈ నిశిలో
ఎన్నాళ్ళని దాక్కుంటారు ?