Wednesday, August 28, 2013

మహాభారత ఉద్యమం పార్ట్2

 మద్యయుగంలో జాతీయసార్వభౌముడు అనిపించుకున్న అక్బర్ చక్రవర్తికీ అదే ఆలోచన. 
చక్రవర్తి ఆయినా మొదటినుండీ తను ఎవరో ఒకరి నీడనే బ్రతకాల్సివచ్చింది.కొన్నాళ్ళు భైరంఖాన్, మరికొన్నాళ్ళు సవతితల్లి.ఇప్పుడు ఆ పరదాలనుండి బయటకొచ్చితననితాను నిలుపుకోవాలన్న కాంక్షతో ప్రజలమద్యకు వెళ్ళాడు.కానీ అక్కడ తను ఊహించని అనేక వాస్తవాలు కళ్ళముందు కదిలాయి.తాను నమ్మిన సామ్రాజ్యవ్యవస్థ ఒక భౌతికరూపమే అని తెలుస్తుంది.వాస్తవంగా ప్రజలమద్యన అనేక పరదాలున్నాయి.
ముఖ్యంగా మతం అనే పరదా.
అది ఎంత బలంగా వుందో...అంత సున్నితంగానూ కనిపిస్తుంది.
ఒకరి మతం చెప్పేది మరొకరి మతంలో విరుద్ధం,
ఒకరి మతంలో చేయదగినది మరొకరికి అనైతికం
అన్నిటికంటే పెద్ద ప్రమాదమేమిటంటే, ఒకరికోసం ఏదైనా చేయటమంటే...మరొకరికి వ్యతిరేఖం అనే భావనని నరనరాలలోనూ ప్రజలు జీర్ణించుకున్నారు.అందువల్ల వీరికోసం పనిచేసినా ప్రమాదమే, చేయకపోయినా ప్రమాదమే అన్నట్లుంది తన పరిస్థితి.
చీకటీ వెలుగు, ఈ రెండు పార్శాలేగా వున్నాయి సృష్టికి. మరి మూడొదీ కావాలంటే ఏమివ్వాలి?నిజానికి ఇప్పుడు ప్రజలనుండి ఎదురౌతున్న సవాలిదే తనకి.అది చేయలేకపోయినా కనీసం వారి మద్యన శాంతికోసం తాను ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేశాడు.   
1563లో తను మొదలుపెట్టిన రాజపుత్రవిధానం వెనుకనున్న ఆంతర్యం ఏమిటి?
కేవలం రాజ్యాన్ని విస్తరించుకోవటమే అయితే యుద్దాలుచేసి సాధించుకొనే బలం తనవద్దలేకనా? కాదే.చక్రవర్తి అనేస్థానాన్ని ప్రజల మనసులలో సంపాదించుకోవటానికి. బలంతోకాకుండా బంధంతో అందరిమద్యనా సమగ్రత సాధించాలనేకదా. అందుకే తను పరాయి మతంవారితోనూ వివాహసంబందాలను నెరిపాడు.అలా ఒక అత్యున్నతమైన లక్ష్యంతో మొదలుపెట్టినా, ఆ సంగమంలోని వాస్తవాన్ని లోతుగా అనుభవించాక తెలుస్తుంది...మతానికంటే అతీతమైనది మనసని. దాన్ని పరిపూర్ణంగా చూడగలిగిన క్షణాలు తనకేం తెలియచేశాయి???
మనిషి మనిషికీ మద్యనా
రాజ్యం రాజ్యానికీ మద్యనా
మతం మతానికీ మద్యనా...అసలు ఏమి జరుగుతుంది ప్రతీసారి.
భర్త అయినా,భార్యా అయినా తమ మద్యనున్న అనురాగానికి మతం ఏక్కడ కొలతలు చూపించగలిగింది? ఒక భర్తగా తనకెప్పుడూ..తెలీని తేడా, భార్యగా తనపై అనురాగం తప్ప మరోటి చూపని తన భార్య ప్రేమకు మతం ఎప్పుడైనా గుర్తొచ్చిందా? కానీ ఈ మనుషులెందుకు తమ బంధాన్ని విమర్శిస్తారు? ప్రత్యక్షంగా అనుభవించిన తానే తెలుసుకోలేని దోషాలు... అంతంతదూరంగా తమ ఆత్మలను బంధించుకుని బ్రతుకుతున్న వీరికేమి కనిపిస్తుంటాయి?  ఎప్పటికైనా ఇది మారుతుందా?అంటే తనకి తాను చెప్పుకొనే సమాధానం తప్ప మరోటి కనిపించటంలేదే...
హృదయానికంటే రక్తానికెందుకింత ఆభిజాత్యం?
మతానికి సంబంధించిన పన్నులను రద్దుచేసినా
ఇబదత్ ఖానాను[1575] నిర్మించినా
అమోఘత్వ ప్రకటను[1579] చేసినా
చివరకు ధీన్-ఇ-ఇల్లాహి[1582]ని ప్రచారం చేసినా
ఇవన్ని తను ఏదో ఒక మతంకోసం చేయలేదని ఎవరికీ అర్ధంకావటంలేదెందుకని?
ఇవన్నీ మనిషికోసం చేశాడు తను...
మనిషి తననుతాను నమ్ముకోవాలనుకున్నాడు...
అలా తనను నమ్ముకోవటం ఎప్పుడైతే మనిషి మొదలుపెడతాడో..అప్పుడే కదా మనుషులందరి మద్యన సామరస్యం నెలకొంటుంది.
కానీ, ఏ మాతానికామతం నివురుగప్పిన నిప్పులకుంపటిలా వుంటే దాని ముందు ఈ  మనుషులు తమ నమ్మకాలని కాచుకుంటున్నారు. అది వారి ఆశలను ఎలా సేదతీరుస్తుందో..అలాగే అవసరమనుకుంటే ఆ నిప్పునే కాగడాలుగా మారుస్తుందేమోకదా. కాలం ఎప్పుడూ మారుతూనేవుంటుంది. రేప్పొద్దున్న వచ్చే సామ్రాట్టులవల్లనో..., మరో ఉపద్రవం వల్లనో... వారిమద్యన ఏ చిన్న నిప్పుకణిక ఫేటేల్మని చిమ్మినా అదే లావాలా ప్రవహించకమారుతుందా? అదే తన భయం. అక్బర్ చక్రవర్తి గొప్పసామ్రాజ్యాన్ని సాధించాడు అనే పేరు కంటే, తనకున్న జాతీయ సార్వభౌముడన్న పేరుకు సార్ధకత సాధించాడన్న మాటే తన ఆత్మకు శాంతినిచ్చే మంత్రం. కానీ ప్రజల మనసులలో భిన్నత్వపు భావనేలేని ఏకత్వాన్ని సాధించగల శక్తిని వారి హృదయాలలో ఎప్పటికి సంపాదించుకుంటాడు?
ప్రాచీన కాలంలో తిరుగుబాట్లకు ప్రధానకారణాలు రాజ్యానివైతే, ఇప్పటి మద్యయుగానికి అవి మరింతగా పెరిగాయి
మనిషిపరంగా
మతపరంగా
అధికారపరంగా
సంధర్బానుసారంగా
ఇలా ఎన్నో విభిన్నతలు మనిషికీ మనిషికీ మద్యన దూరంపెంచుకోవటానికి కనిపెడుతూనేవున్నారు.
కానీ, కష్టపడి సాధించుకున్నవాడికి ఆ కష్టం నిష్ఫలమైపోతే...ఎంత రోదన మిగులుతుందో తనలాంటివారికే అనుభవమవుతుందేమో? తానేంతో కష్టపడితేకానీ సాద్యంకాని జాతీయత అనే పేరు కలకాలం నిలబడుంటుందన్న నమ్మకం చరిత్ర ఇవ్వటం లేదు.భవిష్యతు మన చేతుల్లో వుండదు.తను వుండగానే దీనిపై ఒక స్థిరత్వం సాదించగలడా?
ఎక్కడ శాశ్వతమైన శాంతిని నిలపగల ఒక దీపం లభిస్తుంది? 
ఎప్పటికి ఈ ప్రజలందలూ ఒకే కుటుంబమనే భావనను జీర్ణించుకుంటారు?
ఇది జరుగుతుందా...
జరిగే అవకాశం కలుగుతుందా..."
ఇలా సమగ్రతకోసం,ఏకత్వభావనకోసం పరితపించిన ఇద్దరు మహా చక్రవర్తుల ఆలోచన... కనీసం ఆధునికయుగంలో మనం ఎంతో పోరాటం సాగించి సాదించుకున్న స్వాతంత్ర్యమైనా మనకు అందించిందా?
దానికోసం మనం ఆధునికయుగంలోకి వద్దామా? వచ్చేవారం సెప్టెంబర్3న మళ్ళీ కలుద్దాం.
శ్రీఅరుణం



 

         
 

 


Thursday, August 22, 2013

మహాభారత ఉధ్యమం పార్ట్ 1

క్రీ.పూ.261.కళింగ యుద్దం ముగిసినరోజులు.అప్రతిహాతమైన విజయం దక్కించుకున్న అశోకచక్రవర్తి నివాసముంటున్న రాజగృహ సముదాయమది.అపూర్వమైన ఆ విజయంతో నిజానికి శోభాయమానంగా వెలుగులుచిమ్మాల్సిన ఆ రాజభవనంలో అటువంటి చాయలేవీ కనపడుటలేదు.ఎక్కడ చూసినా ఏదో నిరాశ, ఎవరిమోములోనైనా మరేదో నిర్వేదం గోచరిస్తున్నాయి. అన్నిటికీ మూలమైన అశోకుని మందిరంలో పరిస్థితి మరింత ధారుణంగా వుంది.విజయానికి చిహ్నమైన ఆ చోటు అందుకు విభిన్నమైన అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది? ఆయన శయనమందిరం నిశ్శబ్దంతో నిండిపోయివుంది.ఆ నిశ్శబ్దపు సంధిగ్దం లోంచి పుడుతున్న గాలితెరలు ప్రశ్నలుగా సంచరిస్తున్నాయి.
ఆ ప్రశ్నలలో ఎన్నో వాస్తవాలు, గతకాలపు అనుభవాలు, భవిష్యత్తుని నమ్ముకున్న ఊహలు...ఇవన్నీ కలగలసి ఆయనని ఉక్కిరిబిక్కిచేస్తున్నాయి.వీటన్నిటినీ భేదించాలని చూస్తున్న అతని మస్తిష్కం ఏ క్షణాన్న ఎలా విస్ఫోటనం చెందబోతుందో? అని అందరూ భీతావాహులై ఎదురుచూస్తున్నారు. వారికప్పటికి తెలిసిన అశోకుడు చండాశోకుడే.
కానీ అతనిలోనే ఇప్పుడు మరో మనిషి వున్నాడన్న సత్యం గోచరమవుతుంది.అదే  ఇప్పుడు ఆయనలో జరుగుతున్నది మానసిక ఘర్షణ.  ఈ ఘర్షణ, ఆవేశం ఏవరిమీదోకాదు  తనమీద తనకే. అందుకే ఆయన నిశ్శబ్దాన్ని తోడుతీసుకున్నాడు. ఆ తోడే ఆయనకి అనేక నిజాలను హృదయం ముందు పరుస్తున్నది. వాటిని మొదటిసారిగా ఒక రాజుగాకాక, ఒక మనిషిగా చదువుకోవటం ప్రారంభించాడు.
   తండ్రి బింధుసారుడు చనిపోయిన తరువాత రాజ్యాధికారం కొరకు జరిగిన వారసత్వయుద్దంలో బంధం, బంధుత్వం, జాలీ, వివేచనా అనేవి లేకుండా రాజధర్మం అనే ద్వజాన్ని తన మనసుల్లోకి పాతుకున్నాడు. తద్వారా లభించిన బలంతో రాజ్యానీ, ప్ర జలనీ అణగదొక్కి పాలించాలనుకున్నాడు. అందుకోసం నిరంతరమూ శ్రమించాడు కూడా. దానికి ఫలితంగా తనకు లభించిన చండాశోకుడన్న పేరు చూసి గర్వించేవాడు. అప్పుడు తను నమ్మినది రాజే ప్రజలు అని. తన మనస్సు ఎక్కడ ఆనందాన్ని పొందుతుందో అదే తను నిర్వర్తించాల్సిన ధర్మం అని నమ్మాడప్పుడు.
   మరి? ఇప్పుడు...తను ఎంతో గొప్పదని నమ్మిన కళింగయుద్దవిజయం తనకెందుకు శాంతినివ్వటంలేదు?  
ఒక రాజుగా, అంతకు మించి సామ్రాట్టుగా తన ధర్మమేగా తాను సాధించాడు?
యుద్దంలో శత్రువుని వధించకుంటే వాడు తనని వదులుతాడా?
అయినా... తెగిపడుతున్న ప్రతి శిరస్సూ తన అంతరాత్మతో ఏం మాట్లాడుతుంది?
అసలు ఈ యుద్దాలు తానెందుకు చేస్తున్నాడు?
యువరాజుగా వున్నప్పుడు... తక్షశిలలో ప్రజల తిరుగుబాటుని అణచివేసినప్పుడు అసలు తాను ఏం ఆలోచించాడు? తనకున్న అదికారబలంతో వారిని అణగదొక్కాననుకున్నడనుకున్నాడే కానీ, తాను గర్వంతో వేసిన అడుగుల పక్కన నోళ్ళుకుక్కుకున్న ప్రజల వేదనలని విన్నాడా?లేదు. అదే ఇప్పుడు తనలో తిరగబడుతుందా?...
పోనీ తరువాత రాజుగా అధికారాన్ని సాధించుకున్నాకైనా సాటి మనిషి కోరుకుంటున్న ఆశలని పరిశీలించగలిగాడా అంటే? అదీ లేదు. ఎంతసేపూ ప్రజలనందరినీ తనకు విధేయులుగా నియంత్రిచాలన్న సూత్రమే తప్పించి, వారు కోరుకుంటూన్న వాటిని నిజాయితిగా తీర్చటంద్వారా వారి హృదయాలను గెలుచుకొనే ప్రయత్నమూ చెయ్యలేదు. పాపం వారెంతగా తనని ఈసడించుకున్నారో దానికి ప్రతిరూపమే ఆ చండాశోకుడన్న పేరని ఇప్పుడు అర్ధమవుతుంది.
సరే ఇక కళింగ. "ఈ విజయం ద్వారా మన రాజ్యం మరింతగా విస్తరింపచేశానని" గట్టిగా అరిచి తన ప్రజలకు చెబుదామంటే, యుద్దంలో తెగిపడిన రక్తపు ముద్దలు తమలాంటి మనుషులవేనని వారు తనతో చెబుతున్నట్లు గొంతుకు అడ్డుపడుతున్నాయి. ఇదంతా తనలో మానసిక విధ్వంసానికి దారితీస్తుందిప్పుడు. అయినా తన నమ్మకాలతో తనని అనుసరించినవారూ వున్నారు కదా? వారికి రాని ఆలోచనలు తనకెందుకు వస్తున్నాఇప్పుడు?
    వారు తమ ధర్మాన్ని కాకుండా  రాజుధర్మాన్నే పాటించారా? అయివుండొచ్చు. అలాంటి ప్రజలకోసం రాజుగా తను ఏం చేయాలిప్పుడు?
 ప్రజలు తాము ఏర్పడిన సమూహాలకి భధ్రతగా రాజ్యాన్ని నిర్మించుకున్నారు.ఆ రాజ్యాన్ని కాపాడుకోవటానికి రాజుల్ని తయారుచేశారు. ఆ రాజు ధర్మం వారిని ఆ సమాజంలో భధ్రంగా కాపాడటమే అయినప్పుడు...తను మాత్రం చేసిందేమిటి? చిన్నచిన్న రాజ్యాల మధ్యన తిరుగుబాట్లను అణచివేసి వాటన్నిటినీ కలిపి మహా సామ్రాజ్యంగా మలచాడు. ఆ దారిలోనేగా ఈ రక్తపాతం జరిగింది. ఒక పెద్ద లక్ష్యం కోసం చిన్నచిన్న సమస్యలని పట్టించుకోవాలా? అది ప్రజలకు తెలీదా? 
సొంతప్రజల మధ్యన సమైక్యతకోసం తిరుగుబాట్లను అణచినా తనకి చెడ్డపేరు తప్పలేదు. 
బయటప్రజలపై గెలిచినా చెడ్డపేరు తప్పట్లేదు.
ఏమిటీ ప్రపంచం?
అసలు ప్రజలంతా కోరుకునంటున్నదేమిటి?
రాజుగా తను ఎక్కడ తప్పుచేశాడు?
రాజ్యం నిజమా?
రావణకాష్టం నిజమా?
నమ్మకం నిజమా?
నమ్మటం నిజమా?
చక్రవర్తిగా తను నిలవటం నిజమా?
మనిషిగా తనను తాను నిలబెట్టుకోవటం నిజమా?
ఏది ఈ ప్రపంచాన్ని ఏకత్వంగా నిలిపివుంచగలుగుతుంది?
బలమా? విధ్వంసమా? పదవా? అధికారమా?....
వీటిల్లో ఏ ఒక్కటి నిజమైనా తాను యువరాజుగా వున్నపుడూ, మహారాజుగా మారినప్పుడూ, సామ్రాట్టుగా రూపొందినప్పుడూ ఎప్పుడూ ఇదే సమస్య ఎలా తలెత్తుతుంది? 
అసలు శాశ్వతమైన సామరస్యం నిరంతరమూ ఈ మనుషుల మధ్యన వుండకపోవటానికి కారణం ఎవరు?
1.ఏకత్వసాధనను కేంద్రీకరించాలనుకోవటమా?
2.రాష్ట్రాలు,ఆహారాలు,ప్రాంతాలు అని పాలనాసౌలభ్యం కొరకు విభజించిన ఫలితమా?
3.మానవ ప్రవృత్తిలోనే వున్న వ్యక్తిత్వపు నిరంకుశమా? 
ఏది ఈ విశ్వానికి శాంతి నిస్తుంది?.....
అర్ధశాస్త్రంలో వున్నట్లు ఎవరికివారు తమ పదవికున్న ధర్మాన్ని పాటించుకుంటూ పోవటమేనా జీవితసాఫల్యం. అలాగైతే, ఈ భిన్నత్వాలు ఎప్పటికీ సమసిపోవుగా. మనిషి మనిషికీ మధ్యన ఎడారి పెరిగిపోతుంది కదా. ఒకరి శాంతి మరొకరి అశాంతిగా మారని విశ్వమానవ కళ్యాణానికై ఏం చేస్తే బాగుంటుందో...అది చేయటానికి సంకల్పిస్తేనే తనలోని ఈ మానసికవేధనకి నిజమైన ప్రశాంతత కలుగుతుందేమో...
ఇలా....
 ఆయన పడిన వేధనకి సమాధానంగా బౌద్ధాన్ని అనుసరించారేమో కానీ, అది సమస్యకి పరిష్కరం మాత్రం కాలేకపోయింది.ఎందుకంటే ఆయనలోని ప్రశ్నలు మానవులందరికోసం అయినా తను చెప్పుకున్న సమాధానం మాత్రం తానొక్కడికోసమే. అంతటితో అశోకుని చిత్తం శాంతించేమోకానీ, ఈనాటికీ మనిషి మనిషికీ మధ్యన వైషమ్యాల చిచ్చు అలా రగులుతూనేవుంది. ఎలాంటి విభిన్నతల ప్రపంచం కక్కుతున్న ఉధ్యమాలకు ఏది పరిష్కారం? ఎప్పటికి ముగింపు?...
ఈ ప్రాచీనభారత యుగపు  ఆలోచనేమధ్యయుగానికి పయనించి అక్బర్ సామ్రాట్ మదిలో గూడుకట్టుకుంది. ఏదో ఒక సంధర్భంలో ఆ గూడులోంచి ఆలోచనలు భళ్ళున ఆయనను చుట్టుముట్టాయి
ఎందూకూ?
ఎలా? అంటే మరోసారి...వాటిని వచ్చేవారం ఇదేరొజు[28ఆగస్ట్]న ఇక్కడే చదువుదాం.   









Monday, August 19, 2013

మహాభారత ఉధ్యమం

మీరు చదువుతున్నది కరెక్టే. నేను రాయబోతున్నది మహాభారతంలో జరుగుతున్న  ఉద్యమం గురించే. అందుకే ఆ పేరు పెట్టాను.
ఒక రాజ్యం వుండేది.దాన్ని ఇద్దరు అన్నదమ్ములు తమకున్న శక్తియుక్తులతో నిర్మించుకొని అభివృద్ధి చేసుకున్నారు. వారిద్దరికీ ఒకే ఆశయం వుంది కనుక మరో ఆలోచనలేదు.కానీ కాలక్రమంలో జరిగిన మార్పుల దృష్ట్యా వారి కుమారుల మధ్యన సొంత ఆలోచనలు మొదలైయ్యాయి. అవి  రాజ్యం విషయంలో భాగాలుగా మారి, పంపకాల కొరకు వాదనలు మొదలైయ్యాయి.  ఆ వాదన యుద్దానికి దారితీసింది.అందులో విజయం ఆధారంగా సమస్యకు పరిష్కారం లభించింది, స్థూలంగా ఇదీ కధ అంటూ ముగిస్తే ఎవరైనా సులువుగానే సమాధానం చెప్పేస్తారు "మాహాభారతం" అని.
మరి, ఆ మాత్రం కధ ఒక అత్యున్నతమైన గ్రంధరాజంగా ఎలా మారింది?
గొప్ప పురాణంగా...
పద్దేనిమిది పర్వాల రచనగా...
అందూలోనూ ఉపకధలూ, పిట్టకధలూ నిండిపోయి...
కొన్ని వందల వ్యక్తిత్వాలూ, వాటి చరిత్రలూ అనే
సందేహాలూ, మరెన్నో సూత్రాలూ వీటన్నిటితో నిండిన విభిన్న అంశాల సమాహారం అది. ఎంతో సుధీర్ఘమైన ఆ పరంపరలో భిన్నత్వంతో కూడిన ఏకత్వం కోసం పాటుపడుతున్న భావనని చాటిచెప్పే భగవానుని స్తుతి అంతర్లీనంగా గోచరిస్తూనే ఉంటుంది. ఇవన్నీ వున్నా కక్షలూ కార్పణ్యాలూ నేరాలూ దోషాలూ ప్రతీచోటా మనకు అందులో దర్శనమిస్తూనే వుంటాయి. ఇంతాచేసి మనకు దానినుండి లభించే ప్రధాన అంశం  కేవలం ఒక రాజ్యం, రెండు భాగాలు. ఇదే.
మరెందుకు భారతం మహాభారతం అయ్యింది? అయినా పరవాలేదు.ఎందుకంటే ఆ రోజుల్లో యుద్దం అనేది రాజుధర్మం కనుక పరిష్కారం తొందరగానే దొరికింది.
మరి...ఈ రోజుల సంగతేంటి?
ప్రజలకొరకు, ప్రజల చేత, ప్రజలే నిర్మించుకున్న ప్రజాస్వామ్య రాజ్యంలో రెండు వర్గాలవారు ఎవరుంటారసలు?
"మా కోసం మేము తయారు చేసుకొని, మాకు మేమే సమర్పించుకుంటున్నాము" అని పూజించుకొనే రాజ్య[గం]ధర్మం ధిక్కరిస్తున్నవారు ఆ ప్రజలుకాక మరింక ఎవరు?
కుల,మత,వర్గ,భాష,ప్రాంతీయ...ఇంకా ఎన్నివుంటే అన్నిరకాల విభిన్నత్వాలకు అతీతంగా ఏర్పడిన వ్యవస్థలో ఉధ్యమం పేరిట తలెత్తుతున్న వివాదాలూ, విధ్వంసాలూ,ఆరోపణలూ ఎవరు? ఎవరిమీద? ఎవరికోసం చేసుకుంటున్న ఉన్మత్తాలు!!!
వీటన్నిటికీ రూపమే ఈ మహాభారత ఉధ్యమం .
మొదట నేనుకూడా ఈ విషయంలో ఏదో ఒక విషయానికి మాత్రమే పరిమితమైపోయిన సంకుచితత్వంతో ఎగిసిపడ్డాను. కానీ, అన్నిటికంటే అత్యున్నతమైన నా అంతరాత్మ నన్ను నిలదీసినప్పుడు...నాలో నిలిచిన ఒకే ఒక్క భావన "నేను ఒక భారతీయుడని"అన్న నిజం. ఆ నిజమే నాతో ఈ రచన రాయటానికి అర్హతనిచ్చింది.అదే భావనతో ఈ రచన చదవండి.  తరువాత మీ అంతరాత్మ ప్రభోధం ఎప్పుడూ మీతోనే వుంటుందిగా.ఆలోచించండి.
20 ఆగస్ట్  బుధవారం ఇక్కడే మొదటిభాగం కోసం కలుద్దాం.
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం. 




 





Thursday, August 15, 2013

జెండాపండుగ


 నా దేశపు వీధిబడికి మళ్ళీ వచ్చేసింది జెండాపండుగ
వృద్ధాప్యం దరిచేరిన ఊపిరిలా జెండాకర్ర వొణికిపోతుంది,
మూడురంగులూ ముచ్చటగా నింపారు
శాంతిచక్రాన్నిమాత్రం ఎక్కడో వదిలేశారు,
ఏమయిందంటూ వెదుకుతూవెళ్ళాను...
వీధిమలుపులో చెత్తకుండీనిండా తగలబడుతున్నాయి
రాత్రి మతఘర్షణల్లో ముగిసిన జీవితాల కాష్టాలు..
ఆ కుళ్ళుభరించలేక మరోవైపు కదిలాను,
గరిక పిలిచింది "గ్రామం ఇటుందని"
ఆశల గాలితెరలు ఊతంగా నిలవగా
పొలాలచేతులుపట్టుకొనినడిచానటువైపు
ఏముందక్కడ?
స్వఛ్చమైన ఆప్యాయతలుపూరిగుడిశె చూరులో చిక్కుబడిపోయాయి
తాత కాల్చి వదిలేసిన చుట్ట ముక్కలా?
ఆ తపోభంగం నన్ను అక్కడ వుండ నివ్వక మళ్ళీ రొడ్డెక్కాను...
ఏ దిక్కున నిలబడి చూసినా...
ఇప్పుడిక్కడ భారతదేశం కనిపించనివ్వటంలేదు,
ఎవడికి కావలసిన పీలికనివాడే చీల్చుకుంటున్నాడు.
నాయకులు నయవంచకులవుతుంటే...
నమ్మకాలు నడిరోడ్డుపై ఉరితీయబడుతున్నాయి,

శాంతి ఎక్కడుందనిపించగా..
ఇంకెందుకులే అశోకచక్రం అనుకుంటూ వెనుదిరగబోయాను.
నా సణుగుడు వినిపించిందేమో...
ఓ లేతగుండె స్ఫందించింది
ఆగమని సైగచేసి భుజంపైనున్న బడిబస్తాను క్రిందకి దించి
ఆ కమ్మని హృదయపు రంగులపెన్సిళ్ళతో...
లేతనైన ఆశల మునివ్రేళ్ళతో గీసిచ్చింది అశోకచక్రాన్ని
"అంకుల్, మా కోసం ఇది అంటించండంటూ..."
శ్రీఅరుణం
విశాఖపట్నం



Thursday, August 8, 2013

కవిత్వం రాయాలంటే

కవిత్వం రాయాలంటేకలానికి కన్నులు మొలవాలి
అవి వీక్షించే కలలనే
కాగితం కవ్గిలించుకుంటుంది,
కనుమరుగవని ఙ్ఞాపకాల నిధులు
రాతలుగా వరసలు కడతాయి,
కావ్యరసం వొలికిపోతూ..హృదయపుజిహ్వకు
దాసోహమవుతుంది,
అప్పుడే కవిజన్మిస్తాడు.
జలగలా మారిన వంచన
హృదయపుమూలుగులోంచి తడిని
పీల్చిపారేస్తుంటే..
పాలిపోయిన కళ్ళు గ్రుడ్డివైపోయాయి,
ఆశల వెలుగులో విరజిల్లిన
కల్పనల కాంతులు
కనుల ముందు వికటాట్టహాసం చేస్తూ..
ప్రేలిపోయాయి,
చేతులలోని పాపాయిని లాగేసుకున్నట్లు..
స్వార్ధం నమ్మకాన్ని భేర్లు కమ్మించింది.
ఆ ప్రళయానికి ..
ఆలోచనలకు పక్షవాతం వచ్చి
మస్తిష్కం మొద్దుబారిపోతుంది,
ఇక అంతా శూన్యం!
కలం,
కాగితం,
కల్పన,
కవిత్వం.


మీ శ్రీఅరుణం.

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.