Wednesday, July 31, 2013

సోదరా......వెళ్ళొద్దూ...


అబ్బా!పెరికేశావా...
ఒక కంటిలో నలుసుపడిందని చూపిస్తే
రెండుకళ్ళనూ నరికేసి దూరంగా విసిరేశావా.
ఎన్నివేల సంవత్సరాలుగా కూర్చుకున్న అక్షరాలకు
తెలుగుతల్లివని రూపం ఇచ్చి
నేనే పసిపాపనై..నిన్ను పూజించుకున్నానే,
అలాంటిదిప్పుడు
నాలో ఎక్కడో లోపంవుందని...నిలువునా నరికేయటం...
నైతికమా? నీచమా?
నిన్ను చీల్చటానికి ఎందరో నడుంకట్టారు,
రాజులున్నారు
పేదలున్నారు
గురువులున్నారు
విధ్యార్ధులున్నారు
అందరితోకలిసిపోయిన దొంగలూ వున్నారు.
ఇప్పుడు నువ్వు చంపబడింది ఆ దొంగల చేతిలోనేకావటం మాత్రం నిజంగా ధారుణం.
ఇది నిజంగా అవసరమా?
పాలు చాలటంలేదని అమ్మ స్తనాల్ని రెండుగా చీల్చినట్లుంది నీ విభజన
ఆశలు అఖండజాతిని ముక్కలు చేస్తుంటే...
అవసరాలు సమగ్రతని నాశనం చేస్తున్నాయి...
అటువారైనా, ఇటువారైనా...అమ్మమీద ఒట్టేసి చెప్పండి
ఇదంతా సాటిమనుషుల మంచికోసమే చేశారా?
మరి ఎటువైపైనా ఎందుకు ఆత్మహత్యలు కొనసాగుతూనేవున్నాయ్?
పిచ్చికుక్కల పైశాచికత్వానికి
రాజకీయపు క్యాబరేనాట్యం కలగలసి చేసిన దోపిడీ చేస్తుంటే..
58రోజుల ఆమరణ సమైక్యంకోసం ఎన్నికోట్ల రక్తపు కట్టేలలో చలనం రాలేదెందుకని?
ఓట్ల ఎంగిలి విస్తరాకులు పంచుకోవటానికి
అంగలార్చిన కాకులు నడిపిన కుళ్ళినమాంసపు పంపిణీలా
అమృతం లాంటి తెలుగుగడ్డ విరిగిపడిపోయింది.
ఏప్రాంతమైనా నాకనవసరం, నేను మొదట భారతీయుడ్ని...
ఓట్ల అంగడిలో మానాల్ని అమ్ముకుంటున్న రాజకీయవేశ్యల వొంపులకు
నా మరో సోదరుడు  బలయ్యిపోయాడిప్పుడు,
రక్తపుచుక్కలు కారుతున్న కన్నీళ్ళతో నా సోదరునికి వీడ్గోలు చెప్పలేక చెబుతున్నా నీ మాటల్ని...
జాగ్రత్త...జాగ్రత్త...భారతీయ సోదరా...
రాజకీయబందిపోట్లు దేశంలో నిండిపోయారు
వాళ్ళ బొక్కసాలు నింపుకోవటానికి నీ ఇంటిని నాశనం చేస్తున్నారు
ఆ పిశాచాల అరుపులను నమ్మి నువ్వూ పరిగెత్తకు
ఏదో ఒకరోజు నిన్నే సరిహద్దు అవతల పారేస్తారు.
ఇప్పుడు మా ఇంట్లో జరుగుతున్నదదే...
అదిగో అలాంటివాళ్ళ మాటలు వినే నా  సోదరుడు వెళ్ళిపోతున్నాడు ఇంటిలోంచి....

2013జులై30నాటి రాజకీయ చదరంగానికి బలైన కొందరి ఆశల్ని నేను ఇక్కడ వ్యక్తీకరిస్తున్నాను.ఇందులో నేను అడుగుతున్నది ఏ ఒక్క ప్రాంతానికి సంబందించినది కాదు. సామాన్యుల మనసులలో వున్న బాధకి రూపం ఇవ్వటమే నా ఉద్దేశ్యం.ఆనాడు కలిసివుండటానికి చేసిన 6సూత్రాల పధకానికి బదులుగా ఈ 6 ప్రశ్నల విషయాన్ని ఇప్పుడు కాస్త పరిశీలించండి.
1.నీటి భాగాలు,పదవులు లాంటివాటికంటే ముందు మనిషికి మార్పుతాలుకా సంకేతం నమ్మకం అందించాలి. లేకుంటే తరువాత ప్రక్రియ శాంతియుతంగా సాగలేదు.ప్రజల మనోభావాలు దెబ్బతినటానికి కారణం కూడా అదే ఇప్పుడు.
2. ఉద్యోగాలకోసం ఎదురుచూస్తూ, ప్రకటించిన కొత్త నోటిఫికేషన్లకోసం వేలకువేలు కట్టి రాత్రింబగళ్ళు చదువుతున్న విధ్యార్ధులకు మీరు ఇవ్వబోతున్న నమ్మకం ఏమిటి? ఆ నోటిఫికేషన్లు అలాగే వుంటాయా? రద్దవుతాయా? వుంటే ఆ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది? లేకుంటే ఇల్లు, పొలాలూ అమ్మి కట్టిన కోట్ల రూపాయల మా ఫీజులను ఎవరు రికవరీ చేస్తారు?
3.ఆంధ్రా,తెలంగాణాలో వుంటూ అక్కడే తమ జీవితాలను నిలుపుకున్నవారికి మీరు ఏం చేయబోతున్నారు?
4.ఒకేరాష్ట్రంగా వున్నప్పుడే ఆంధ్రప్రాంత,తెలంగాణాప్రాంత ఉద్యోగులని నానా అవమానాలకు గురిచేసినప్పుడు, ఇప్పుడు విడిపోబోయే ప్రకటన పూర్తయ్యేముందు మీరు తీసుకోబోతున్న విధానమేమిటి?
5.పెద్దమనుషుల ఒప్పందాన్ని రాజకీయ అవసరాలకు తుంగలోతొక్కి తెలుగుప్రజలను విడదీసిన పాపం మూటగట్టు కున్న వాళ్ళను మళ్ళీ నమ్మాలంటే మా కోసం మీరు ఏం చేయబోతున్నారు?
6.14రాష్ట్రాలు 28 అయినాయి. అందులో మరొకటి ఇప్పుడు బయలుదేరింది.సరే దేశాన్ని అసలు ఎన్నిరాష్ట్రాలుగా విభజించాలనుకుంటున్నారు? దానికి అంతం లేదా? మన సమగ్రతకోసం ఏదైన చేద్దామన్న ఆలోచనలేదా? వీటికి సంబంధించిన మార్పులపై ఎప్పటికైనా దృష్టి సారిస్తారా? లేకపోతే ఎప్పుడు ఏ రాష్ట్రానికి చెందినవాడిగా నేను మారతానో తెలియని అయోమయంలోనే నేను మిగిలి[పోవాలా?




శ్రీఅరుణం










Sunday, July 21, 2013

ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్


నా ఫ్రెండ్ ఒకడు రాసుకున్నది చూడండి.
వాడికి పసితనంలోనే తండ్రి పోయాడు. పేదరికం. బంధువులెవ్వరూ దగ్గరకు తీయని స్థితి. అమ్మ అడ్డమైన కాళ్ళు పట్టుకొని స్వీపర్ గా జాబ్ సంపాధించుకుంది. ఇంటిలో వాడిది ఒంటరి బ్రతుకే. కనీసం అన్నం తినటానికి కూడా అమ్మ తోడులేని మధ్యాన్నాలెన్నో. రాత్రికి నిద్రమత్తులో అమ్మ తినిపించిన అన్నం రుచి పూర్తిగా తీరేదే కాదు. అలాంటి జీవితంలో దాపరికం లేని తోడు దొరకటమే వాడికన్నీ. అలా పదవ తరగతి పాసయ్యి, ఒక కంప్యూటర్ కేంద్రం లో పనికి కుదిరాడు. అక్కడ పెరిగిన పరిచయాలను వాడు ఎలా రాసుకున్నాడో చూడండి.
మొత్తం ప్రేమించిన అమ్మాయిలు = 70మంది.
వారి అవసరాలకి నన్ను ఉపయోగించుకొనేవారు = 40మంది [అనగా.. వీళ్ళకి నేను ఖర్చుపెట్టేంతవరకూ నాతో వుంటారు. కనుక వీళ్ళని వదిలించుకోవటం తేలికే ].
నా అవసరాలకి పనికొచ్చేవారు = 10 మంది. [ అనగా నాకు కావలినప్పుడు నా అవసరాలు తీర్చటానీకీ ముందుకొస్తారు. కనుక వీళ్ళు నాకు పెట్టుబడిలాంటి వాళ్ళు. వీరిని కాపాడుకోవాలి]
మరో 10 మంది కేవల టైం పాస్ రకాలు. [ అంటే సినిమాలకీ, తింటానికీ వచ్చేవారు]
మిగిలిన వారిలో అయిదుగురు = పెళ్ళైన వారుకనుక, వారి గురించి పెద్దగా నావైపునుండి ఆలోచనలుండకూడదు]
ఇక చివరి అయిదుగురూ మాత్రం నన్ను ప్రాణంగా చూసుకొనేవారు. నా అమ్మా,నాన్నల వలన దూరమైనది వారిదగ్గరే దొరుకుతుందికనుక, ఎంత కష్టమైనా వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.]
ఇలాంటి అనేక జీవితాల అనుభవలసారంతో october మొదటి వారంలో విడుదలవుతున్న నా పుస్తకం ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్ లో చదవండి.
శ్రీఅరుణం 

Friday, July 12, 2013

జవానన్నా...
నీకు దేవుడిచ్చిన జీవితమే జవాబన్నా.
జీతం కోసమా నువ్వు మా మంసాన్ని రక్షిస్తున్నావు?
జీవించడానికైతే మరణంతో సహవాసం దేనికి నీకు?
అమ్మ కన్నపుడే దేవుడు నిన్ను స్నేహితుడవనుకుంటాడేమో???
మా అందరికోసం తానే నీతో కలిసి రక్షిస్తూ వుంటాడు.
నిజం గా చెప్పూ? నీకూ బ్రతుకు మీద ఆశ వుండదా?
మరెందుకు ఎప్పుడూ నిప్పులతోనే చెలగాటం చేస్తుంటావు?
అప్పుడప్పుడూ నువ్వు ప్రత్యక్షమవుతూ మా ప్రశ్నలకు సమాధానం చెబుతున్నా..
ఎప్పుడు నిన్ను గుర్తుంచుకోనే దైవత్వం మాకు పంచుతావు.
మానవుడే మాధవుడైతే..ఆ మాధవుడే నువ్వన్నా,
నీకు పాదాభివందనం చేయకుంటే ఎంతటివారమైనా...మేము మనుష్యులమే కాదన్నా.
శ్రీఅరుణం

Wednesday, July 10, 2013

హృదయపు చెలమలు

కన్నీటికి వరదొస్తేనే
హృదయపు చెలమలు నిండుతాయి,
మరపు చేతకాని మనోవల్మీకాలే
ఆ తీరం వెంబడి సాగిలపడి కవనాన్ని రచిస్తాయి.
మిణుగురులు మెరుపనుకొని
మేఘాలు వర్షించేస్తే..
అభిమానం తలదాచుకొనే తావెక్కడ దొరుకుతుంది?
బ్రతుకు ఆటయితే భరించడమే నేరం ,
సంద్రాన్ని ఎప్పుడైనా ప్రశ్నించావా?
ఆ కెరటాల నిరంతరత ఎందాకని?
దిగంతాలు దొర్లుతున్నా..
ఏ అంతరాలను అందుకోవాలని ప్రాకుతున్నాయవి?
వర్షించే ప్రతిమేఘం
హిమం కరిగిన శుద్దమే కాదు,
వక్రించిన కూహకాలెన్నో ధూళికణాలై అడ్డుకుంటే
భళ్ళున పగిలిన హ్రుదయాలు భాష్పించిన రుధిర ధారలెన్నో !
పలకరించే ప్రతీ ప్రణయం
ప్రణవాన్ని చేరుకోలేదు,
అరుణోదయాన్ని వీక్షించలేని మనసుకు
శ్రీ రాగాలెన్నున్నా..
మూగవైన షడ్జమాలే.

శ్రీఅరుణంవిశాఖపట్నం.

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.