Thursday, May 29, 2014

నా జీవితంలో ఒకరోజు మధ్యాన్నం.....

నా జీవితంలో ఒకరోజు మధ్యాన్నం రెండుగంటలసమయంలో, అప్పటికి సుమారుగా ఆరుసంవత్సరాలపాటుగా సాగిన ప్రేమ అనే సంబంధం…. కొన్ని పరిస్థితులనే అవసరాలు చుట్టుముట్టినప్పుడు, `పిరికితనం`అనే ఒక అవకాశాన్ని ఉపయోగిస్తూ ఇన్నాళ్ళ నా ప్రేమ బంధాన్ని ` టీనేజ్ లో తెలియక చేసిన తప్పు` అంటూ జస్టిఫై చేసి మార్చుకోవాలని చూసినప్పుడు...నేను కృష్ణతత్వం చదువుతూ ప్రేమతత్వం తెలుసుకుంటున్నాను. 
"కృష్ణుడంటే పాలసముద్రం. ఆ పాలు మధరమై మనకు అందాలంటే...తేనె కలాపాల్సిందే. ఆ తేనే మనం కోరుకొనే ప్రేమ. ఇక్కడ మనం ప్రేమ అనే తేనెని ఎంతగా పాలసముద్రంలో కలపగలమో... అంతగా కృష్ణుడు మనకి మధురమై లభిస్తాడు. ఇదే ప్రేమ తత్వం. అందువల్లనే ఎనిమిది మంది భార్యలనూ, వేలమంది గోపికలనూ, తనని మోహించిన ప్రతీ దాని వద్దనూ ఆయన ప్రేమ కనిపిస్తుంది" 
నేను ఆమె సంబంధాన్ని ప్రేమగానే నమ్మాను కనుకా...
ఆమెకి ఇవ్వటంలోనే తప్ప, తీసుకోవటంలో నాకు నమ్మకంలేదు కనుకా...
అంతగా నేను నమ్మిన ప్రేమని తను `తప్పు`గా చిత్రిస్తూ నా హృదయాన్ని గాయపరిచిన ఆ సమయంలో…….. నా చేతులలో కృష్ణుని ప్రేమ తత్వం వుందేమోనని నమ్ముతానిప్పటికీ. 
అలాంటి ఫలితం నాకు భగవంతుడిచ్చిందే కదా? 
అందువల్ల నాజీవితాన్ని నేను ఎలా మలుచుకోగలిగానన్నది తెలుసుకోవాలంటే...రేపు ఇక్కడే కలుద్దాం.

శ్రీఅరుణం


9885779207
విశాఖపట్నం-530001

Wednesday, May 28, 2014

ప్రేమ......

"ప్రేమ అనేది కూడా ఒక మానసిక భావనే" అంటూ నేను చెప్పడం ప్రారంభించగానే.. ఒక విధ్యార్ధి లేచి "అంతేనంటారా? సార్" అంటూ చాలా ఆతృత ప్రదర్శించాడు. ఇంతకీ అతని సమస్య ఏమిటంటే.. తను తీసుకుoటునట్లు తన ప్రేయసి.. తన ప్రేమని సీరియస్ గా తీసుకోవటం లేదని. తను ఎంత మనస్ఫూర్తిగా చెప్పినా, ఆమె మాత్రం "అంతుందా?" అంటూ తీసిపారేస్తూ రిప్లయ్ ఇవ్వటం, అతనిలో ఎన్నో సందేహాలను రేకెత్తిస్తుందట. అలాంటి సమయంలో నేను "ప్రేమ అనేది కూడా ఒక మానసిక భావనే" అంటూ చెప్పటం అతనికి చాలా రిలాక్స్ గా అనిపించింది. కానీ నిజానికి ఆ మాట నేను చెప్పకపోయినా అతని మనసు చెబుతూనే వుందతనికి. కానీ.. మరొక పుస్తకమో, పెద్దవారో, మేధావో... ఇలా అతని మనసుకు దగ్గర వున్నవి ఏవైనా, అదే మాటని చెబితే.. వెంటనే ఈ సందేహపు తలనొప్పినుండి బయట పడాదామని మనసులో చిన్న కోరిక. అది నా దగ్గర దొరకగానే అతను తన మనసు అప్పటివరకూ తయారుచేస్తున్న ఫైల్ ని ఇక ఏమాత్రమూ అలోచించకుండా.. సేవ్ చేసేశాడు.
ఏమిటీ ప్రాసేసంతా?
అసలు ప్రేమంటే ఏమిటి?
ఎలా అది మనల్ని చేరుతుందనేది నా అనుభవంలో ఎలా నాకు తెలిసిందో...ఈరోజునుండి 5రోజులవరకూ రాయబోతున్నాను.

శ్రీఅరుణం
విశాఖపట్నం
9885779207

Saturday, May 24, 2014

సాహిత్య సంస్కృతి



కలానికీ కాలానికి వివాహం నిశ్చయమైతే...
తెల్లనికాగితపు కాన్వాసుపై పొర్లాడే అక్షరాలే వారి తొలిరేయి ఙ్ఞాపకాలు.
జీవితకొక్కాలకు తగిలించేసిన ఆశల బూజు దులిపి
తెల్లారినా తరగని కావ్యకచేరీ చేస్తూనేవుంటారు.
గతజన్మలో వదిలేసిన గమకాలనూ ఏరుకొచ్చి
అనుభూతుల కోనేరుగట్టున.....
అనురాగపు మట్టిబొమ్మలను తయారుచేస్తుంటారు.
అంతస్థులచూరు పలకరిస్తున్నా...
తాటకులగుండెల్లోకి తొంగిచూస్తుంటారు,
అమృతంలో ఏముందంటారు?
గంజినీళ్ళతోనే ఘీంకరిస్తుంటారు,
శూన్యాన్ని అద్దంలో నింపేసి ప్రపంచంతో వాజ్యాన్ని మొదలెడతారు,
చందమామ సాంగత్యాన్నీ కాదని...
సూర్యుని భూజాలకెక్కాలని ప్రాకులాడుతుంటారు,
కర్ణున్నీ కృష్ణున్నీ కాదని...
మద్యలో లేచిన వికర్ణునిపై పుంఖానుపుంఖలు రాసిపడేస్తుంటారు,
భావాలను ఎక్కడ దొరుకుతాయో... అక్కడకు
పదాల అణుబాంబులను మూటలుగా భూజాన్న వేసుకుని
ప్రపంచవీదులన్నిటినీ ఊహల విమానాలతో చుట్టేస్తుంటారు,
కన్నీళ్ళు వారి కలానికి ఇంధనం
నోబుళ్ళూ, ఙ్ఞానపీఠ్ లూ వారి సాంగత్యానికి వారసత్వాలు
కక్షలలో బంధించబడిన కాంక్షలను సమాజానికి శుద్దిచేసి అందించే
వసుధైక కుటుంబానికి వారిద్దరే నిజమైన అమ్మా నాన్నలు.

శ్రీఅరుణం
విశాఖపట్నం-530001
సెల్ = 9885779207
e mail = sssvas123in@rediffmail.com

Wednesday, May 21, 2014

కామం అనేది......

కామం అనేది ఇద్దరు స్త్రీపురుషుల మధ్యన జరిగే ఒక మనసిక కళగా చెప్పిన వాత్యాయనుని కామసూత్రన్ని గౌరవించండి. జీవితంలోనే అలౌకికమైన అనుభూతిని అందించే కామరహస్యాన్ని అర్ధం చేసుకోండి. ప్రేమతో నిండిన ముద్దు కూడా నీకు జీవిత కాలం ఆనందించగలిగే అనుభూతిని అందిస్తుందన్న సత్యాన్ని, అనుభవపూర్వకంగా చెబుతున్నా నమ్మండి.
"వస్తాను నాకోసం చూస్తుండు" అని నా ప్రేయసి నాతో చెప్పిన ప్రేమ పలుకులే, నా ఊహలతో ఆశలై.. నాకు కవిగా గొప్ప అనుభూతులను అంధించగలిగాయి. ఇక ఆమె నా కౌగిళిలోకి వస్తే...అంతకంటే కామం నాకు ఏ దేవుడివ్వగలడు? అదే మీ ఆశ కావాలి కామసుఖం కొరకు.
వాంఛనీయమైన శృంగారానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి వివాహం. రెండు... నీకోసం ఏదైనా చెయ్యగల తోడుని అందించగలిగే ప్రేమ. ఇవిలేకుండా పొందే కామం... కేవలం అవసరం లేదా వ్యాపారం అంతే. అది మనిషికైనా పశువుకైనా ఒకటే. అలాకాకుండా...
సంద్రపు ఇసుక తిన్నెలపై...
పౌర్ణమి అందాన్ని వీక్షిస్తూ...
కెరటాల నీటితుంపరలు చల్లచల్లగా పలకరిస్తుంటే...
గాలికూడా దూరనంతగా బిగికౌగిళి బంధించివేస్తూండే అధ్బుత క్షణాలను అనుభవించి చూడండి.
ప్రేమ మాత్రమే నిండిన రెండు అరసున్నలవంటి స్త్రీపురుషుల శరీరాలూ ఆత్మలూ సంగమిస్తుంటే... అలాంటి కామంకోసం ఆనందంగా చచ్చిపోవాలన్న ఎదురెళ్ళమూ.

నా "అంతర్ భ్రమణం"పుస్తకం నుండి
శ్రీఅరుణం
9885779207

Saturday, May 17, 2014

మహాభారత ఉద్యమం


ప్రజాస్వామ్యమే గెలిచిందిప్పుడు. ఎన్ని ఆశలను ఎరవేసినా ప్రజల మనసులోతుల్లో చూపిన ప్రభావమే ఎప్పటికీ నిజమైన ఫలితాన్నిస్తుందనేది ఈ ఎన్నిక ఫలితాలు మరోసారి నిరూపించాయి. డబ్బూ, మద్యం, పధకాలూ, వాగ్దానాలూ...ఎవరు ఎన్ని చెప్పినా అంతిమ ఫలితందగ్గర మాత్రం ప్రజలమనోనిశ్చయాన్ని ఏమాత్రం మార్చలేకపోయారన్నది వాస్తవం. రాష్ట్రవిభజనపేరుతో ఒక సాధారణ విషయాన్ని తేల్చటానికి రెండుప్రాంతాల ప్రజల జీవితాలని అస్తవ్యస్తం చేసిన వారికి తమ సత్తా చూపించారు. తెలంగాణా కొరకు ఎందరో యువకులు బలిదానాలు చేస్తున్నా, నేలలతరబడి ప్రజలు రోడ్డుమీదకొచ్చినా, అలాగే సమైఖ్యాంద్ర కొరకు నెలలతరబడి ప్రజలు అరచి గగ్గోలుపెట్టినా, పిల్లలుసైతం ఎండలో ఉద్యమాలు చేసినా చలించని ప్రభుత్వానికి ఇలాంటి సమాధానం చెప్పి రెండుప్రాంతాలప్రజలు నిజమైన ప్రజాస్వామ్యన్ని బ్రతికించుకున్నారు. తెలంగాణాలో కాంగ్రేస్ కి కొంత అధిక్యం వచ్చినా అది తమ కలని నిజంచేసిందన్ని కొద్దిపాటి విశ్వాసం మాత్రమే. అంతకంటే తెలంగాణాకోసం అవిర్భవించిన టీఅర్.యస్. ని ప్రజలు ఎక్కువగా ఆదరించటానికి కారణం అంతిమంగా ప్రజలుకోరుకున్న లక్ష్యసాధానకోసం దేనికైనా తెగించినిలబడినందుకే అన్నది ఇక్కడ గమనార్హం. అదే భావజాలం సీమాంద్రలోనూ కనిపించింది చూడండి. సమైఖ్యాంద్ర సాధనలో భాగంగా ఎవరెన్ని మాయలను ప్రజలముందు ప్రదర్శించాలని చూసినా ప్రజలిచ్చినతీర్పులో కాంగ్రేస్ ఏమయ్యిందో...చూశాం కదా. అదొక్కటే నిజమైన ప్రజాతీర్పుకు సూచిక. మిగిలిన పార్టీల విషయమంతా వారివారి సొంతవ్యవహారం గానే సాగిందికదా. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నవి రెండు అంశాలే.
ఒకటి...ప్రజాస్వామ్యం మన దేశంలో ఇంకాబ్రతికేవుందన్న నమ్మకం.
రెండు...ఎన్ని రాష్ట్రాలుగా విడదీసినా తెలుగువాడి మనసు ఒకేలా ఆలోచించగలిగే భావజాలం కలిగివుంటుందన్న నమ్మకం.
ఈ రెండూ మిగిల్చిన ఆనందంతో నాభారతావనికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.

శ్రీఅరుణం
విశాఖపట్నం
9885779207

Tuesday, May 13, 2014

ప్రేమ. అంతే...మరింకేమీ లేదు.



నిజంచెప్పు....నీలో వున్నది నేనే అయినప్పుడు...
నాకిప్పుడు నువ్వు దూరంగావున్నావని బాధెందుకు కలుగుతుంది???
నువ్వూ నేనూ కలిసి "మనం"అయ్యావన్నవే ...మరి...
నేనింకా నీదగ్గరకు రాలేదని కోప్పడతావేం???
నువ్వు చెప్పింది నిజమా...
నేను నమ్మింది నిజమా...
ఇన్నిసంవత్సరాల మన ప్రణయగమనంలో ...ఇంకా
ఒకరినొకరం నమ్మించుకోవాలా???
హృదయాలదగ్గర పరిపూర్ణమైన మన ఆశలను...
ఇప్పుడెవరు వచ్చి లాక్కుపోతారు???
నాకెప్పటికీ నువ్వే దేవతవైనప్పుడు...నేనింక ఏ దేవుడికోసం తపస్సుచేయాలి??
నాకంతా నువ్వే
ప్రే మా
కోపం
కసి
అసూయా
జీవితం
నమ్మవూ...నా మరణం కూడా నీదేరా.
శ్రీఅరుణం
9885779207

Sunday, May 11, 2014

అమ్మా......


పులకరించిన మేని....
పాశాన్ని పలకరిస్తే..
మతృత్వానికి అర్ధంచెబుతూ
అనురాగపుకేక మరో జీవితాన్ని హత్తుకుంటుంది.
నీడకుకూడా గొడుగుపట్టే అమ్మతనం
ఆర్తితోకప్పే చీరకొంగులా నిరంతరం నిన్ను కాపాడుకుంటుంది.
ఇకనుండి నీ ప్రతీఅడుగూ...
అమ్మ కళ్ళల్లో పుట్టే మెరుపులతో రక్షించబడుతుంది.
ఆ తన్మయం కోసమేనేమో...
తన గుండెల్ని చీల్చుకువచ్చినా నిన్ను తన ప్రాణంలా మార్చుకుంటుంది.
కనులముందు కణేల్ మంటున్న నిప్పుకణికని కౌగిలించుకుంటావా?
నచ్చినరంగే కదా అని రక్తాన్ని కుళ్లబొడుచుకోగలవా?
ఇవన్నీ అమ్మే చేయగలుగుతుంది
అందుకే దేవుడికైనా తాను అమ్మే అవుతుంది.
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం-530001







Thursday, May 8, 2014

నా భారతదేశమా...నమో నమామి

మొరాయించిన ఈవియం లు, వరదలా పారుతున్న మద్యం, కట్టలు త్రెంచుకున్న డబ్బు, తిట్లూ, విమర్శలూ, దాడులూ, ప్రతిదాడులూ....మనమందుకొస్తున్న ఈ వార్తలని చూసి అదే భారత ఎన్నికల క్షేత్రమనుకోకండి. అదంతా రాజకీయం చాటున జరిగిపోతున్న అవకాశాలప్రపంచపు స్వరూపం మాత్రమే.
ఒక్కసారి దేశ పరిపాలనలో భాగమై సాగుతున్న సమర్ధత కలిగిన యంత్రాగపుకోణాన్ని పరిశీలించండి. అందుకు ఉదాహరణగా ఎన్నికల నిర్వహణని గమనించండి.
328 మిలియన్ హెక్టార్ల భుభాగం
121కోట్ల ప్రాజానీకం
35 నైసర్గికాలు
వీటినుండి సేకరించిన సుమారు డెబ్బైశాతం ఓటర్లు తమనితాము భారతీయుల్గా గుర్తించుకోగలిగే ఎన్నికల తతంగాన్ని పూర్తిచేయాలంటే ఎంత కార్యదక్షత కావాలి?
ఎన్నికలనోటిఫికేషన్
అభ్యర్ధుల స్క్రూటినీ
నామినేషన్ల స్వీకరణ
కోడ్ జాగ్రత్తలు
ఓటింగ్ ఏర్పాట్లు
ఓటర్ల జాగృతి
బూత్ ల నిర్వాహణ
శాంతి భధ్రతల నిర్వాహణ
సిబ్బంది కూర్పు
సమస్యాత్మక ప్రాంతాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
బ్యాలెట్ బాక్స్ ల కాపలా
ఓట్ల లెక్కింపు ఫలితాలు
ఇలా చెప్పుకుంటూపోతే కనిపించేవీ, కనిపించనివీ మరెన్నో ఎదుర్కోవాల్సివుంటుంది. వీటికితోడుగా ప్రపంచంలోనే అత్యంత నీచంగా తయారయిన మన రాజకీయపు ఎత్తుగడలనుండి మన రాజ్యాంగస్ఫూర్తిని కాపాడుకోవాలి.
ఇదంతా ఎంత అద్బుతమైన నిర్వాహణ నిర్వాహణ!!! అయినా ప్రతీసారీ ఈ అద్బుతం మనదేశంలో సాధ్యమవుతూనేవుందంటే కారణాలు...
1.అపూర్వమయిన మన రాజ్యాంగ రచన
2.దానికి అనుగుణంగా ఏర్పడిన అధికారయంత్రాంగం
3.రాజకీయాలకు అతీతంగా పనిచేసే అవకాశం అతికొద్దిమాత్రమే వున్నా, తమ ఉద్యోగనైపుణ్యాన్ని సాద్యమైనంతవరకూ ప్రదర్శించగలుగుతున్న ఎన్నికలయంత్రాంగం వంటి వాటి కార్యదక్షతలు. ఇలాంటివన్నీ మనదేశానికి నమస్కరించాలని చెప్పట్లేదూ....
ఒక మద్యతరగతి ఇంట్లో జరిగే అతిచిన్న ఫంక్షన్లోనే భోజనాలకి ఎందరొస్తారో సరిగ్గా లెక్కెయ్యలేక అభాసుపాలవుతున్న సంఘటనలు చుస్తుంటాం. అలాంటిది పేరుకి అభివృద్దిచెందుతున్నదేశం అని బోర్డు తగిలించుకున్న ఈ వెనుకబడిన ఆర్ధికవ్యవస్థ కలిగిన దేశంలో ఎంతపెద్ద కార్యనిర్వాహణ ఎలా సాద్యమవుతుంది? ఈ కోణంలో ఆలోచన ప్రారంబిద్దాం. ఇప్పటికీ మన దేశ బంగారు భవిష్యత్ మనచేతుల్లోనే ఉందనిపించట్లేదూ....
శ్రీఅరుణం
9885779207

Saturday, May 3, 2014

వ్యక్తిత్వ వికాసానికి లక్షణాలు



ఒక పని సాధించాలంటే దానికై చూడవలసిన భిన్న కోణాలుంటాయి. వాటన్నిటినీ సమ్మిళితం చేయటంలో మనం సంపాధించుకున్న విఙ్ఞానమే వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది. సహజంగా ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని అభివృధ్ధి చేసుకోవటానికి తన జీవిత విధానాన్ని మార్చుకోగలిగితే చాలనుకుంటారు. కానీ మానవుడు సంఘజీవిగా తనతో పాటూ బ్రతుకీడుస్తున్న సమాజంలో అతని వ్యక్తిత్వవికాసం తనతోనే కాక, ఎదుటి వారినుండి కూడా ప్రభావితమవుతూ వుంటుదని మర్చిపోకూడదు. అందులో భాగమే కనుక  బయట ఇంటర్వూలకు వెళ్ళేటప్పుడో, పదిమందిలో ప్రత్యేకంగా కనిపించటానికో, సమాజంలో అందరికంటే ముందుగా పరిగెత్తటానికో మాత్రమే మన వ్యక్తిత్వ వికాసానికి కావలసిన వివిధ అంశాలను నేర్చుకోవాలని చాలామంది నమ్మకం. అది మన పనికి మంచి ఫలితాన్నిస్తుంది, నిజమే.అయితే ఆ వ్యక్తిత్వం మనకొక కోర్స్ లా కాకుండా, మన జీవితంలా మార్చుకోగలిగితేనే `నువ్వు` అనేది ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వం అవుతుంది. అందుకు కొన్ని లక్షణాలు కావాలి. అవి...
1.డ్రస్ కోడ్
2.సంభాషణ
3.ఎదుటివారిని గౌరవించటం
4.సంధర్బోచిత విఙ్ఞానప్రదర్శన
5.ముగింపునివ్వగల సమర్ధత
from my book "anthar bhramanam"

“శ్రీఅరుణం”
9885779207

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.