దీపావళి అనగానే నా చిన్నతనం ముందు కొచ్చి కూర్చుటుంది
ఆ రోజంతా ఆనాటి ఙ్ఞాపకాల వెలుగుల్ని నా చుట్టూ
పరుచుకొని మురిసిపోతుంటాను.
అప్పుడే మొదలైన చలిగాలులు దుప్పట్లో దూరకుండా
కప్పుకుంటూ కుస్తీలుపడుతుంటే
రాత్రంతా కష్టపడి తయారుచేసిన
సీమటపాకాయల్ని పొద్దున్నే పరీక్షించటం ప్రారంబించేసాడు అన్నయ్య.
మరోపక్క అమ్మ చెవి మెళిపెట్టి లేపి
కుంకుడుకాయ పులుసుని నెత్తిపై మర్ధించేది,
కంట్లో చురుక్కుమన్న భాదకి కెవ్వున నేను పెట్టే ఏడుపుకి
చెల్లి నవ్వుతో జతకలుపుతూ చిచ్చుబుడ్డిలా గెంతేది.
ఉండుండీ వినిపించే టపాకాయల శబ్దం..
కాలు నిలవనిచ్చేది కాదు.
సర్రున బయటికి పరిగెడితే..వెనకనే..
కర్ర పట్టుకొని వచ్చే నాన్నమ్మను.. కాసేపు ఏడిపించి,
పక్కసందులో నిన్న కాల్చేసిన నరకుని బొమ్మ శిధిలాలలో
మిగిలిపోయినవేమన్నా వున్నాయేమోనని వెతికేవాడ్ని,
అప్పటికే .. ఆ పని పూర్తి చేసిన స్నేహితుల నవ్వు చూసి
అలిగొచ్చి మంచంపై ముడుచుకొనేవాడ్ని.
అమ్మ చేసే హల్వా పూరీలని చప్పరిస్తూ..
రాత్రికి కాల్చబోయే టపాసుల గురించి సమావేశమయ్యేవాళ్ళం.
ఆ క్షణం నుండీ మొదలయ్యేది..
నాన్న అడుగులశబ్దం కోసం మా కర్ణభేరీల వెదుకులాట.
సాయంత్రం వరకూ నాన్న తెచ్చిన బరువైన సంచి దగ్గరే
ప్రాణమంతా కాపలాకాసేది,
అప్పటికే మా వదనాలు సగం దీపావళిని చేసేసుకొనేవి..
ఇంక రాత్రికి ఎలా వెలిగిపోయేవో మీరే ఊహించుకోండి.
శ్రీఅరుణం
9885779207
No comments:
Post a Comment