Friday, September 27, 2013

మహాభారత ఉధ్యమం part7


ఆ సిద్ధాంతం ఎప్పుడు మొదలైoదో...అప్పుడే మహాభారత ఉద్యమానికి మనిషిలో అంకురార్పణ జరిగింది. ఆ మహాభారత సంగ్రామంలో పాండవులు,కౌరవులే రెండు పరస్ఫర అస్థిత్వాలు. కానీ ఈ మహాభారత ఉద్యమంలో ఎన్నో అస్థిత్వాలు మనిషిలోని స్వార్ధానికీ ఆవేశానికీ అవసరానికీ హేతువులుగా పుట్టుకొస్తున్నాయి.
ఒకవైపు మతం...మరోవైపు చాందసం
ఒకవైపు అభివృద్ధి...మరోవైపు వెనకబాటుతనం
ఒకవైపు కులం...మరోవైపు అణచివేత
ఒకవైపు పేదరికం...మరోవైపు అవినీతి
ఒకవైపు భాష...మరోవైపు ఆవేశం. 
ఇలాంటి వాటితో తాత్కాలిక యుద్దానికి తెరతీయటందానికోసం మిఠాయిలు పంచే చలివేంద్రాలను దోసిళ్ళలో పోయటం... ప్రస్తుతం జరుగుతున్నదదే.  అందువల్లేనేమో ఇప్పుడు ఏఉద్యమానికీ ఒక నిర్ధిష్టమైన దిశా, కారణం, సిద్ధాంతం, ఫలితం...,లేకుండాపోయాయి. వాటిన్నిటికి మార్గనిర్దేశం చేయాల్సిన రాజ్యాంగం సవరణల పోట్లతో దారుణంగా మోసపోతుంది.  చివరికి ఈ వ్యవస్థ రాజకీయం - అధికారం అనే రెండు పాత్రలతో నడిచే నాటకానికి ప్రదర్శనశాలగా మిగిలిపోయింది. అలా వదిలేద్దామా? లేక... మన భవిష్యతుకోసం, మన తరువాత తరాల మార్గం కోసం మరోసారి మనల్ని మనం సమీక్షించుకుందామా?
 ప్రస్తుతం నేను ఈ రచన ద్వారా చేస్తున్నదదే.
ఎన్ని విధానాలు వచ్చినా
ఎన్ని యుగాలు మారినా
ఎన్ని ప్రవచనాలకు తలవూపినా... "ప్రతీ మనిషీ ఎప్పటికీ ఒక ప్రత్యేక శక్తే" అన్న అంబేద్కర్ గారి మాటలు మన భారతావనికి అక్షరసత్యాలు. ఆ ప్రత్యేక అతనిలో వుండబట్టే ఎన్ని దాటుకొని వచ్చినా ఎప్పుడూ మార్పుకోసం సాగుతూనేవున్నాడు. అత్యంత గొప్ప నాగరిక ముంగిట్లో నిలిచామనుకుంటున్న ఇప్పటి మనిషి, నిజానికి ఒక రోబోట్ లా మారిపోయానని తెలుసుకోలేకున్నాడు. అదే మన ధౌర్భాగ్యం. దేశం ఇప్పుడు బ్లాక్ బోర్డ్ లా తయారయ్యింది. ఎవడికి కావలసినదానికోసం వాడి అవకాశాన్నిబట్టీ ఒక వాదమో... సిద్ధాంతమో... ఉద్యమమో... పుట్టిస్తున్నాడు. దానికి ఆ బ్లాక్ బోర్డే ఒక మార్గం. దానిపై తనకు కావలసినదానికొరకు 
ఎందరు?  
ఎలా?  
సమకూరుతారో లెక్కలుకడతాడు..వాడి లెక్కలు తేలేసరికే,  పాత లెక్కలమూటలు దాచుకున్న బ్రోకర్లు చుట్టూ చేరుతుంటారు. అలా చేరిన ముఠా అంతాకలిసి దేశ ప్రజల సంఖ్యకీ తమకీ కావలసిన అవసరానికీ మద్యన ఎలా చిచ్చు రగులుతుందో నిర్ణయించుకుని, దానికి చరిత్రను మేకప్ గా వేసి రంగంలోకి దిగుతున్నారు. అంతే అశోకుడినీ,అక్బర్ నీ,మహాత్ముడినీ ఆఖరికి తాము నిర్మించుకున్న రాజ్యాంగాన్నే నమ్మని మనమంతా... ఆ చరిత్రని పట్టుకొని చేతబడిచేసినట్లు ఉద్యమాలకి బయలుదేరుతున్నాం. ఇలా బయలుదేరినవారిలో...
పనులు మానుకున్నవారున్నారు
ప్రాణాలు అర్పిస్తున్నవారున్నారు
నిజానికీ వాస్తవానికీ మద్యన తేడాని గుర్తెరగని వారున్నారు.
ఒక్క క్షణం ఆగండి. ఆలోచించండి, నిజానికీ వాస్తవానికీ మద్యనున్న తేడా.
నిజం...ఉన్నదాన్ని గురించి తెలుపుతుంది.
వాస్తవం...జరుగుతున్నదాన్ని గురించి తెలుపుతుంది.
ఈ రెండింటి మద్యనున్న ఆ సున్నితమైన పొరను చూడలేని కళ్ళు నిజమైన అభివృద్ధిని ఎప్పటికీ చూడలేవు. అలాంటి చీకటియుగంలో వుంటూ ఎప్పుడో అభివృద్ధీ సాధిస్తామని శతాబ్దాలు వేచివుండే జఢత్వం నుండి బయటకి వద్దాం. ఆ నమ్మకం కోసం మన ముందు మరాలి. అందుకోసమే మహభారత ఉద్యమాన్ని అన్నికోణాలనుండి సమీక్షించుకోవాలి.  దానికి నిజమైన ఆధారం మన రాజ్యాంగమే. దానినుండే నేను నా తరువాత ఉద్యమకోణాన్ని రచించబోతున్నాను.
శ్రీఅరుణం.
మీ అభిప్రాయాలను పంపండి.
sssvas123in@rediffmail.com
no : 9885779207
facebook - sriarunam rao
నా కవితల కోసం sarithasrinivasam.blogspot.com చూడండి.

Saturday, September 21, 2013

మహాభారత ఉధ్యమం Part 6


"డిస్కవరీ ఆఫ్ ఇండియా" నెహ్రూగారి ఈ పుస్తకం చదివినప్పటినుండీ నా మదిలో సుడులు తిరుగుతున్నవి రెండు విషయాలు.
ఒకటి భారతదేశం,
రెండు భిన్నత్వంలో ఏకత్వం.
ఇప్పటికీ ఆ మాటను మనం ఉపయోగించుకుంటున్నట్లుగా మరెవరూ ఉపయోగించుకోలేరేమో. నిజానికి రెండు చిన్నపదాల మద్యన వాక్యంపేరిట వేసిన అత్యున్నతబంధం అది. కానీ ఇప్పటికీ అవి మనకు వేర్వేరు పదాలుగానే కనిపిస్తున్నాయి. ఎప్పటికీ వాటిని వాక్యంగా మనం నమ్మమేమో అనిపించేలా దేశం నిత్యం ఉద్యమాలతో రగులుతూనే వుంది. అడపాదడపా ఏకత్వం అనేది ఎప్పుడైనా వినిపిస్తుందంటే...అది
విదేశీ దాడులప్పుడో..
దేశపు క్రీడా టీం కప్పు గెలిచినప్పుడో...
ఎన్నికలలో అందరిఓట్లూ సాధించాల్సివచ్చినప్పుడో...
ఇలాంటప్పుడే ప్రత్యేక పాత్ర పోషిష్తుందది. ఆ నాటకం అయిపోగానే చెరిపేసే మేకప్ లా మళ్ళీ ఏ పాతపెట్టెలోనో దాచేస్తాం. బ్రతుకంతా భిన్నత్వాన్నే పట్టుకొని వ్రేలాడి, ఓడిపోతున్నప్పుడో పరిస్థితులు అనుకూలించనప్పుడో మరేదైనా లాభం వస్తుందనుకున్నప్పుడో "అందరం"అంటూ మన ప్రయోజనం కోసం ప్రయోగాలు చేస్తున్నాం.
దీనంతటికీ కారణం ఏమిటి? గుండెలమీద చెయ్యివేసుకొని ఆత్మని ప్రశ్నించుదాం రండి. మస్తిష్కం నుండి హృదయానికీ, హృదయం నుండి బుద్దికీ, బుద్దినుండి వాస్తవానికీ వచ్చి మన ప్రశ్నకి సమాధానం చూడండి...అక్కడ...కొన్నికోట్ల మంది సమూహం కనిపిస్తుంది.
ప్రజలు..
ప్రజలు..
ప్రజలు...
ఖచ్చితంగా వీటికి కారణం ప్రజలే. తెల్లవాని వ్యాపారం ఆర్ధికపరమైన దోపిడీకోసమే అయితే..., దేశవారసత్వపు సంపదలమైన మనం చేస్తున్న వ్యాపారం అన్నివిధాలా వ్యవస్థని మానభంగం చేయటంలేదూ? ఏం? అశోకుడూ
అక్బర్
మహాత్ముడూ
రాజ్యాంగం... ఎందరుచెప్పినా వినని ఈ ప్రజలు ఈనాటి ధారుణాలకి ఎవరిని నిందిస్తారు? రాజకీయాలనా సరే. ఎక్కడ నుంచి వచ్చాయవి? ఎవరివల్ల పాతుకుపోతున్నాయవి? సంధించండి మీ మనసాక్షిమీదకు ఈ శరాల్ని
అక్కడ మీకు మీరే కనిపిస్తారు...
రాజకీయవాదం ఏమన్నా దేశం కన్న కొత్తజాతా?... కాదే. మొదట దేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులే రాజకీయవేత్తలయ్యారు. రాజకీయాపు పరిధిని పెంచుకోవటం మొదలయ్యాక వారిలో రాజకీయమే సొంతవాదమై ఊడలువేయటం మొదలుపెట్టింది. ఆ మహావృక్షాన్ని మనిషి తాకకుండా వుండేందుకు దేశాన్నీ రాజ్యాంగాన్నీ వదిలేసి పార్టీ అనే నుసుగును కప్పుకోవటం ప్రారంభించిన వారికి... ఇక పార్టీ మనుగడే ప్రపంచం అయిపోయింది. ఆ పార్టిని నిలుపుకోవాలంటే పదవికావాలి, ప్రభుత్వం తమదవ్వాలి. వీటిని సాధించుకునే అధికారమే వారికున్న ఒకేఒక్క బ్రతుకుతెరువయ్యింది. అలా తాను దేశం కోసం కాక, దేశాన్ని తమకోసం వాడుకోవటం మొదలైంది. ఇదంతా జరగటానికి వారేమన్న తపస్సులు చేశారా? లేదే. అందుకు వారికున్న ఆయుధం ప్రజలే. ఆ ప్రజలు తమకోసం తాము తయారుచేసుకొని అమలుచేసుకుంటున్నామని నమ్ముకున్న రాజ్యాంగాన్ని అడ్డుగా వుంచుకొని ఎన్నికల క్రీడని మొదలుపెట్టారు.
ఆ ఎన్నికల క్రీడ ఎలా వుందో sep28thన చూద్దాం
శ్రీఅరుణం
మీ అభిప్రాయాలను పంపండి.
sssvas123in@rediffmail.com
no : 9885779207
facebook - sriarunam rao
నా కవితల కోసం sarithasrinivasam.blogspot.com చూడండి.

Sunday, September 15, 2013

మహాభారత ఉధ్యమం Part5


స్వాతంత్ర్యవేడుకలు ముగిశాయి.  ప్రజలు తమ బ్రతుకుతెరువు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు వారందరికీ ప్రాతినిద్యం వహిస్తున్న దేశం ముందు అతి పెద్దబాద్యత నిలబడివుంది. దేశ పరిపాలనకీ,వ్యవస్థని పునర్నిర్మించుకోవటానికీ కావలసిన ఒక స్పష్టమైన విధానాన్ని తయారుచేసుకోవాల్సిన కార్యక్రమం అది.
అది భారతరాజ్యాంగ నిర్మాణం.
ఆ దిశగా భారత రాజ్యాంగాన్ని తయారుచేసే ముసాయిదా నిర్మాణానికి డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో కమిటీ ఏర్పడింది.
అప్పుడే యం.ఎ.పస్ట్ క్లాస్  రిజల్ట్స్ తో ఇంటికొచ్చిన నాకు "రాజ్యాంగం అంటే ఏమిటన్నయ్యా?"అని అడుగుతూ నిలబడిన పక్కింటి తమ్ముడి ప్రశ్న చాలా బరువుగా తగిలింది. 385 ఆర్టికల్సూ కంఠత పట్టిన నాకు ఆ ప్రశ్నకి జవాబు చెప్పడానికి కొంత సమయం పట్టడానికి కారణం రెండు అంశాలు. ఒకటి రాజ్యాంగం గురించి వాడి స్థాయికి తగినట్లుగా చెప్పాలన్న ఆకాంక్ష. రెండు నేను చదివిన ఆ రాజ్యాంగానికీ...ప్రస్తుతం దేశం రాజ్యాంగాన్ని వుపయోగిస్తున్న తీరుకీ మద్యనున్న తేడా. సుధీర్ఘ, ధృఢ, అధృఢ, లిఖితపూర్వక వంటి అనేక లక్షణాల సమ్మిళితమైన దేశపు అత్యున్నత రూపాన్ని గురించి చిన్నమాటలో చెప్పి ఒక భావితరపు వారసుడిని పంపించాలని నాకనిపించలేదు. అలాగని వాడి స్థాయికి సరిపడేలా చెప్పటం కూడా నాకూ నాకు అంత తొరగా సాధ్యపడలేదు. ఇలా ఎందుకంటే ?భారత రాజ్యాంగం నాకిష్టమైన పుస్తకాలలో అత్యంత ప్రాణప్రదమైనది.రవిగాంచని చోటునూ కవి గాంచగలడన్నట్లు...తమ అపూర్వమైన వీక్షణశక్తితో విచక్షణమైన ఒక విధానాన్ని దేశానికి అందించడానికై "అన్నింటినీ"ఒక గ్రంధంగా కూర్చడమంత అద్భుతం వేరొకటి వుంటుందా?.అదే మన రాజ్యాంగం.
ఈ దేశం ఎలా ఏర్పడింది...?
ఎలా రూపుదిద్దుకుంది...?
గతమేంటి?
వర్తమానం ఎలా సాగాల్సివుంది?
భవిష్యత్తుకు ఏం అందించాలి?
వంటి అనేక విస్తారమైన విఙ్ఞానానికి ఒకే రూపం కలిగిస్తే అది మన రాజ్యాంగం.
రాజులు పోయారు. రాజ్యాలకు అవశేషాలుగా మిగిలిన సంస్థానాలూ కలిపేశాం. దేశంలో రాష్ట్రాలూ, ప్రాంతాలూ, కేంద్రపాలితాలూ అంటూ రకరకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
భౌగోళికంగా
వ్యవస్థాపరంగా
పాలనాపరంగా
ప్రాంతాలపరంగా
మతాలు కులాలపరంగా
జాతులపరంగా
ఇలా రకరకాల విషయాలపరంగా, విభిన్నతలకు పుట్టినిల్లు అనబడేలా ఉన్న దేశం మొత్తం "ఒకేచోట" తమనితాము నమ్ముకోగలిగేలా ఒక పుస్తకం రాయగలగాలంటే ఎంత అసాధ్యం...
లక్షలమందిని తన కరవాలానికి బలిచేసి, సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగిన అశోకసామ్రాట్ సాధించలేని సమగ్రతని...ఒక పుస్తకం ద్వారా సాధించాలి.
అఖండ భారతంలో మతలకు ఆలవాలమైన ప్రజలందరినుండీ జాతీయసార్వభౌముడనిపించుకోగలిగిన అక్బర్ చక్రవర్తికి సమాధానం దొరకని లౌకికత్వాన్ని...ఒక పుస్తకం సాధించాలి.
స్వచ్చమైన హృదయంతో కోట్లమందితో పూజలందుకున్న బాపూజీనే కలవరపరచిన ప్రజల మద్యనున్న మానసిక లోతులకు పరిష్కారం...ఒక పుస్తకం కనిపెట్టాలి.
ప్రాచీన,మద్య,ఆధునిక యుగాలలో ఒక భ్రమలా మిగిలిపోయిన భావాలన్నిటికీ అందమైన ఒకే భవనాన్ని ఒక పుస్తకం సాధించగలుగుతుందా?...అదే మొదట్లో నా అనుమానం. చరిత్ర విధ్యార్ధిగా భారత రాజ్యాంగానికి ముందున్న పరిస్థితులన్నీ చదివితెలుసుకున్న నాకు రాజ్యాంగపు రచనకు ముందున్న అవశ్యకాలేమిటో???తెలియటం వల్ల ఇదంతా మదిలో మెదులుతూ వుండేది.
అలాంటి అనేక సందేహాలకు సమాధానం గా మన రాజ్యాంగాన్ని చదువుతూవుంటే...దానిలోని
అత్యున్నతమైన మేధస్సు,
భవిష్యత్ వీక్షణ,
నిస్వార్ధపు ఆలోచనాశైలీ,
దేశ భక్తీ,
సమానత్వపు ధోరణీ ఇవన్నీ నాలోవున్న అనుమానాలను పటాపంచలుచేస్తూ...ఒక సంపూర్ణమైన భారతీయుడిగా నేను మారటానికి దోహదం చేశాయి. ఆ పుస్తకాన్ని చదవటం పూర్తిచేసిన క్షణం దానికి ఒక మనిషిగా సాష్టాంగ ప్రమాణం చేశాను భక్తితో.
కానీ,ఇప్పుడు సమకాలీన ప్రపంచపుదారులలో నడక సాగుతున్న నాకు...
నాదేశం అనుసరిస్తున్నదారి, ఆ రాజ్యాంగం చూపించిన దారికి ఎంతదూరంగా వుందో కొలవటానికే అంతు చిక్కని పరిస్థితి?...అసలు రాజ్యాంగం మనతో వుందా?అన్న ప్రశ్న...
ఒక ఆవేశం కానీ, సమస్యకానీ దేశం నుండి మొదలై...
రాష్ట్రం
ప్రాంతం
జిల్లా
నగరం
తాలూకా
గ్రామాం
వీధి
సందూ
చివరకు మనిషి స్థాయికి చేరిపోతున్నాయి. మనిషి మనిషినీ దూరం చేస్తున్నాయి. కొన్ని వేల సంవత్సరాలక్రితమే ధర్మానికి వేధికగా నిలిచిన మహాభారత యుద్దాన్ని పురాణంగా గౌరవించుకుంటున్న ఈ భూమిపై నేటికీ అశాంతి తప్ప మరోటి మిగలని ఉద్యమాలు రగులుతూనేవున్నాయి. వీటికి ముగింపులేదా? రాజుల మార్పు, సామ్రాట్టుల చర్యలు, మహత్ముని శోకం, అత్యూన్నతమైన రాజ్యాంగం ఈ ప్రజల్లో శాశ్వతమైన మార్పుని ఎందుకు సాధించలేకపోతున్నాయి?
మార్పురాదా... వీరిలో?
లేక, తొలి నాగరికతలోవున్న జఢత్వమే వీరికి శాశ్వత శాపమా?
మారాలన్న కోరిక వీరిలో వస్తుందా?
మరి "భారత ప్రజలమైన మేము మాకోసం మేము తయారుచేసుకొని ఆమోదించుకుంటున్నామని" చెప్పిన మాటలు అబద్దాలుగా మిగిలిపోతున్నాయా?
ఇదంతా ప్రజల బాధ్యతేనా?
లేక, రాజ్యాంగం విఫలమైందా?
అదీకాక ప్రజనుండి తయారైన మరో శక్తి...ఇలా వ్యవస్థ తయారవటానికి కంకణం కట్టుకుందా? 
ఆ శక్తి గురించి వచ్చే వారం 22 సెప్టెంబర్ న చుద్దాం.
శ్రీఅరుణం.
మీ అభిప్రాయాలను పంపండి.
sssvas123in@rediffmail.com
no : 9885779207
facebook - sriarunam rao
నా కవితల కోసం  sarithasrinivasam.blogspot.com చూడండి.

Monday, September 9, 2013

మహాభారత ఉధ్యమం part4

అలా స్తబ్ధత ఆవరించిన ఆర్యవ్యవస్థలోని పాలకుల వలసవిధానలకు తలొగ్గి జీవించటం ప్రారంభించారు.
అశొకుడు వంటి చక్రవర్తుల కాలం నుండీ రాజు యొక్క మానసిక పరిస్థితికి తగినట్లుగా తమ బ్రతుకులను మార్చుకుని బ్రతకటం అవసరమైంది వారికి.
అలా అనేకమంది రాజుల అవకాశాలతో విసిగి వేసారిన వారి మనసులకు అక్బర్ వంటి జాతీయసార్వభౌముడి పాలనలో కొంత సేదతీరగలిగే అవకాశం ఏర్పడింది. కానీ,అదీ ఎన్నినాళ్ళో మిగలని పరిస్థితి మళ్ళీ ఔరంగజేబు ద్వారా సంక్రమించింది.
తమలోని ఏకత్వ భావనకు తూట్లు మొలిచిన ఆ కాలంలో  మనిషి మతం మార్చుకునో,కులాన్ని నమ్ముకునో, ప్రాంతాలను మార్చుకునో, చివరికి మనిషే మారిపోతూనో జీవితాల్ని నిలుపుకోవాల్సిన పరిస్థితి.ఇదంతా ఎందూకంటే? ముందు మనిషి బ్రతకాలికదా.అలా పొర్లుతూ వచ్చి బ్రిటీష్ వారి పాలనకొచ్చి పడ్డారు.
1922లో సహాయనిరాకరణ జరిపినప్పుడు పిలిస్తేకానీ ఉద్యమంలోకి రాని ప్రజలూ,
1930 శాసనోల్లంఘనానికి పిలవకున్నా ముందుకొచ్చారు,
అదే 1942నాటి క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకులమైన తామంతా జైళ్ళలో వున్నా వారే అత్యంత తీవ్రంగా ఉద్యమించి ప్రభుత్వాన్ని పెకళించగలిగేలా నిలిచారు.అలా పరాయివారి పాలన నుండి తమనితాము రక్షించుకోవాలన్న ఆశయం వారిలో మళ్ళీ ఒక గొప్ప ఏకత్వ భావనకు దారితీయగలిగింది.కానీ, మళ్ళీ ఇప్పుడు వందలసంవత్సరాలు పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించుకుంటున్నామనుకుంటున్న ఈ దశలో వీరికి మళ్ళీ ఆ పాత వాసనలు కావలసి వచ్చాయంటే కారణం ఎవరు???...
నిజానికి ప్రజలు అమాయకులు. తమకోసం తెలివితేటలను ఉపయోగించుకునే కొందరు, ప్రజలను ఇలాంటి దారులలోకి మళ్ళిస్తున్నారు. ఈ దేశప్రజలకు నిండుగా శక్తిసామర్ధ్యాలున్న, వాటిని నిరంతరమూ వినియోగించుకోగల అవకాశం వారికి ఈ నేల అందించలేదు. ఒక రాజుకాలంలో చేయతగినది మరో రాజు కాలంలో అనైతికం అయ్యే పరిస్థితి. ఇప్పుడా స్థానం మతం తీసుకుందేమో.అందువల్లనే ఆయా కాలాలకు తగినట్లుగా తమనితాము మలుచుకునే వెన్నపూసబొమ్మలయ్యారు ప్రజలు.ఒకరకంగా అది తమ తరం నాయకులకు గొప్పవరం.స్వాతంత్ర్యం సాధనతో నూతన భవిషత్తుని స్వేఛ్చగా నిర్మించుకోగల ఈ అవకాశం నిండుగా లభించిన తమకు ఇప్పుడే ప్రజల్ని పాతకాలపు నిస్తేజం నుండి బయటకు తీసుకురావాల్సివుంది. నడిపించగలిగే నాయకత్వం వుండాలేకానీ వారికోసం ఏదైనా చెయ్యగల చరిత్ర ఈ ప్రజలది.ఒక మాములుమనిషినయిన నన్నే మహత్ముడిగా నమ్ముకోగలిగారు వీళ్ళు.అలాంటివారి నడకలో తేడా వస్తుందంటే కారణం తామేకద.నాయకులమైనందుకు మరి మనమేం చేస్తున్నాం?
1919లో పరాయివాడి అసూయలోంచి పుట్టిన మత నియోజకవర్గాలన్ని చీలిక స్వభావానికి తలొగ్గాం. అదేకదా ఇప్పటి ఈ విభజనకి కారణం.ముక్కలుగా చేసిన ఈ గడ్డపై అటు ఇటూ రాలిపోతున్న ప్రాణాలెవరివి? మనవారివికదూ? వారికి జరిగిన మానసిక వ్యధకు చికిత్య చేయటం మాని, మావాళ్ళిందరూ...మీవాళ్ళిందరూ అని రక్తానికీ చీలిక లెక్కలను కడుతున్న మన నాయకత్వానికి ఏ పాపం అంటుకోనుంది?
మనం నాయకులమా? లేక...
మనపై పెట్టిన నమ్మకాల కాష్టాలను కాల్చుకుతుంటిన్న దోపిడిదారులమా?
కలిసుండాలనుకున్నా,విడిపోవాలనుకున్నా అది ప్రజల తప్పు కానేకాదు.నాయకులదే తప్పు. ఎందుకంటే 'మేము మీకంటే కాస్తంత తెలివైనవారిమని" చెప్పి మనం నాయకత్వం వహించి వారిని నడిపించాం.
నా చుట్టూ వున్న పిల్లలకు నేనోక ఆదర్శపాఠ్యాంశం కాగలనన్న నమ్మకంతోటే నేనూ ఈ స్వాతంత్ర్యపోరాటంలోకి రాగలిగాను. అలాంటి నేను ఈ దేశ స్వాతంత్ర్యంతో పాటు విభజననీ ఎలా అందించగలనూ. అందుకే మీరంతా స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకుంటుంటే,నాకు ఆనందం లేదు.అందరినీ ఏకతాటిపై నడిపి నేను సాధించాలనుకున్నది... చీలికద్వారా వచ్చిందన్న బాధే నాకు విలాపంగా మారింది. 
కుటుంబం
చదువు
ఉద్యోగం
ఆస్తి
చివరకు ప్రాణం కూడా దేశానికి ధారబోసి, తనపై భరోసాతో మరణించినవారి ఆత్మలకు నేనేమని సమాధానం చెప్పాలి?ఇది ఇలా వదిలేసివచ్చావే అని వారు రేపు నన్ను అడిగే ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు?స్వాతంత్ర్యం కోసం మనలో మనమే చీలికలు తెచ్చుకొనే కొత్త సంస్కృతికోసమా నువ్వు ఈ పోరాటం చేశావని అడిగేవారి ముందు నా ఆహింసా, సత్యాగ్రహం ఏమని బదులిస్తాయి.
"హే భగవాన్.నా ప్రజలకి ఒక మంచి దారినివ్వు.మళ్ళీ అదికారం ఆడించే బొమ్మలుగా వారిని మార్చకు.దేశానికి లభించిన స్వాతంత్ర్యమే ఇంత పెద్ద విభజనకు దారి తెలిస్తే , ఇక అంతర్గత స్వాతంత్ర్యం లభించే స్వాతంత్ర్యం ఏం చేయబోతుంది"అంటూ ఘోషిస్తున్న గాంధీజీ ఆత్మ సాక్షిగా మన పెద్దలు దేశాన్ని నడిపించటానికి మన రాజ్యాంగాన్ని తయారు చేయటం ప్రారంభించారు.
అత్యున్నతమైన ఆ రాజ్యాంగం మనకు ఏం చెప్పింది...మనం దానిని ఎలా నమ్ముకున్నామన్నదీ తరువాత వార [sep17] నుండి చూద్దాం... 
శ్రీఅరుణం

Tuesday, September 3, 2013

మహాభారత ఉధ్యమం part3

1947ఆగస్ట్15.
ఈ రోజుకు ఏ భారతీయుడికీ ఉపోధ్ఘాతం చెప్పనవసరం లేదు.ఎన్నో సంవత్సరాల పోరాటఫలితంగా మన స్వాతంత్ర్యం సాకారమైన రోజది. ఆ రోజున అందరి గుండెలలోనూ భారతమాత నిండిపోయింది. ఆమెతోపాటూ వారిని అపాదమస్తకమూ కదిలించేలా చేసిన ప్రశ్న ఒకటుంది  అది"మహాత్ముడెక్కడా?"అని.....
నిజం ఎప్పుడూ నిలకడగానే వుంటుంది.సర్దుబాట్లూ,సందర్భాలూ,అవకాశాలు,అవసరాలు దానినెప్పుడూ ప్రభావితం చెయ్యలేవు. అలా చేసేవయితే అది నిజమే కాదు. నిజం అని మనం నమ్మించుకున్న ఒక నీడ.
మహాత్ముడూ అంతే. ప్రజలకోసం ఆయన చేసిన త్యాగం ఈ రోజున రెండుగా చీలిపోయిన దేశంగా తనముందుంది. ఆ చీలిక అంచులలో కూర్చుని ఆయన తన శాంతి ధీక్షను పాటిస్తున్నారు. రెండుగా చీలిన తన ప్రజలను చూస్తూ కన్నీరు కారుస్తున్న ఆ హృదయానికి స్వాతంత్ర్యం ఎలా ఆనందాన్ని మిగులుస్తుంది పాపం.
అతి విలువైన జీవితాన్నే అర్పించుకున్న ఆ శాంతిదూతకు ఈ దేశం అందించిన బహుమతి అదే.
ఆ విచారం ఆయనలో నిరంతరాయమైన ఆలోచనల్ని రగిలించింది. ఎందుకు తానీ పోరాటం చేశాడు? ప్రజలకోసమేగా. మరి వీరిమద్యలోనే ఇన్ని ఆవేశాలుంటే..., ప్రారంభంలోనే ఇంతగా సెగలుకక్కుతుంటే... రేపు వీరికి ఏ భవిష్యత్ అందుతుంది? 
ఒకప్పుడనుకునేవాడు"ఎందరో గొప్ప చక్రవర్తులేలిన ఈ భూమిపై ప్రజలందరిమద్యనా ఏకత్వం ఎందుకు సాధించలేకపోయారని. ఆ ప్రయత్నాలు చేసిన వారూ వున్నారు. అందులో అశోకుడూ, అక్బర్ వంటివారు మరింతగా తపించారు. కానీ ఫలితం ఎందుకు రాలేదు?అంటే...వారిద్దరూ... అధికారం కోసం, దానిని సద్వినియోగం చేసుకోవటం కోసం సమగ్రతని కోరుకొని వుండవచ్చు. కానీ తాను ఏం కోరుకుని ఈ ప్రజలకోసం పోరాటం చేశాడు? చివరికి స్వాతంత్రదేశంగా మారినతరువాత కూడ తనకి ఈ దేశంపై విడిపోయిందన్న బాదే తప్ప మరో ఆనందం మిగిలిందా? తన పోరాటానికి గౌరవంగా మహాత్ముడన్న బిరుదునిచ్చి పక్కకు తోసేశారు. వారు మాత్రం
మతం ఆధారంగానో,
కులాల ఆధారంగానో,
ప్రాంతాల ఆధారంగానో ఎవరికివారు వేరవటానికి సిద్ధమైపోతున్నారు. పైగా వాటికి మానవహక్కులూ,భిన్నత్వాలను గౌరవించటం అని రకరకాలుగా పేర్లు పెడుతూ ఊగిపోతున్నారు. దేశం కోసం ఎంతో త్యాగం చేసిన మహాత్ముడు తన కోసం ఏ పదవీ అడగలేదని అంటున్నారేకానీ... మనుషులందరూ ఒకటే అంటూ నిరంతరం తన మనసు ఘోషిస్తున్న "రఘుపతిరాఘవరాజారాం..." ఆన్న అంతరంగాన్ని కేవలం రికార్డులకెక్కించి, తాము మాత్రం తన్నుకుంటున్నారు. నిజంగా అది వీరికి వినపడకా? లేక వినపడినా వారి మానసిక స్థితి అదేనా? అదే అయితే తాను చేసిన ఈ పోరాటమంతా నిష్ఫలమేగా. అవును తాను కేవలం ఒక జాతికోసమో, ఒక మతం కోసమో,ఒక ప్రాంతం కోసమో పోరాడలేదు. అహింసా,సత్యాగ్రహం వంటి పవిత్రమైన విధానాలను కేవలం ఒక దేశ స్వాతంత్ర్యం కోసం ఉపయోగించాలనుకోలేదు,అలా అనుకోవటమే వాటి విలువను తెలుసుకోకపోవటం.
తన పోరాటం మనిషి స్వాతంత్ర్యం కోసం.
అందుకే పరాయివాడినైనా అహింసయుతంగానే గౌరవించాలన్నాడు. ఆ అహింసలో ప్రేమ వుంది. సాటిమనిషినీ తనలాంటి మనిషిగా గుర్తించగలిగే వ్యవస్థకు అదే మార్గం. మనిషిని ప్రేమించగలిగినప్పుడు ప్రపంచంలో మనకు భిన్నత్వం ఎలా కనిపిస్తుంది? అదే తాను దక్షిణాఫ్రికాలోనూ అనుసరించాడు, ఇక్కడా అనుసరించాడు.  ఇన్ని సంవత్సరాల నా పోరాటాన్ని నమ్మి ప్రజలంతా తనని అనుసరిస్తుంటే...అహింస అనే మార్గం ద్వారా విశ్వశాంతికై సిద్ధమౌతున్న చుక్కానీలనుకున్నాడు.కానీ...
ఇప్పుడిక్కడ జరుగుతున్నదేంటి? తను ప్రతీ క్షణం నడయాడిన ఈ గడ్డ రెండు దేశాలుగా చీలిపోతుంది.స్వాతంత్ర్యం కోసం ప్రతీ క్షణం వెచ్చించిన రక్తాన్నీ శాoతిధామం చేసి, కలిసిసాధించుకున్న గుండె... మతంకోసం విడిపోతానంటుంది.
అసలు ఈ మార్పు ఎలా వచ్చింది?
మనిషికోసం నేను చేసిన ఈ సుధీర్ఘమైన పోరాటంలో ఎవరి సొంత ప్రయోజనాలు ఈ చీలికని తెచ్చాయి?
ఎవరి స్వార్ధం దీని ఆజ్యం పోసింది?
ఎవరిని ఆక్రోశం ఈ పరిస్థితికి దారులు వేసింది?
వీటికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది???
అసలు తప్పెవరిది?
నాయకులమైన తమదా?
ప్రజలదా?...
నిజానికి ఈ దేశప్రజలు గొప్ప సహనవంతులు. దానిని పిరికితనమనీ, అతిగా పాటించే శాంతిమంత్రానికి వారసులనీ  కొద్దిమంది అన్నంతమాత్రాన్న అది ఎప్పటికీ నిజం కాలేదు. తమ మొదటి నాగరికతనుండి, ప్రతీసారీ వారిమీద ఏదో ఒక నూతన వ్యవస్థ, విధానమో, మతమో, అదికారమో వారిపై స్వారీ చేయటం నేర్చుకున్నాయి.అయినా వాటికి తగినట్లుగా తమ నడకను మార్చుకున్నారే కానీ , ఎన్నడూ దేశాన్ని వదిలించుకోవాలని వారు అనుకోలేదు. అలా అనుకొనివుంటే...ఈ పాటికే దేశం ఖాళీ అయిపోయివుండేదేమో.
తమ మొదటినాగరికత అయిన సింధూలోనే అత్యున్నతమైన పట్టణ నాగరికతకు ఆలవాలమైన దేశం, ఆర్య సంస్కృతి వచ్చేసరికి మళ్ళి ఎలా వెనక్కెళ్ళిపోయారు!!!
తరువాత వారంseptember 10  చూద్దాం...
శ్రీఅరుణం

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.