Sunday, December 25, 2011

నువ్వంటే...???

నువ్వంటే...???







అప్పుడెప్పుడో.. నన్ను తిట్టుకొంటూ తిరిగి చుడకుండా
వెళ్ళిపోయిందన్న కసితో...
ఎప్పటికప్పుడూ.. నన్ను తట్టిలేపుతూ
కళ్ళుతెరిస్తే కరిగిపోయే అద్భుతాంలా మారినా..
గుండెలముందు బంధించుకోవాలని
నాకెందుకు అనిపించలేదు?


నా ఈసడింపునీ తన కన్నులతో పొదవిపట్టుకొని
ఆశ చావని అడుగులతో దూరమవుతున్న
ఆ పాదాల పగుళ్ళనే చూస్తూ..,
కలుక్కున జారిపోతున్న కన్నీళ్ళని కనికరించలేని
రాతి హృదయాన్ని.. నేనెందుకు గుర్తించలేదు?


గుండేలేని తోటలో మెదడుని పాతేసి
అంబరం ఎత్తున బలిసిన అహం వృక్షాల నీడతో
ఏ ప్రణవానికి హారతి పడతాను?


ప్రణయం పిలిస్తే పలకదు,
అదే పిలిచిందా.. మనమెంత?
ఈ రెండింటిమధ్యనా నేను సాధించే..మనఃసాక్షే..
నువ్వవుతావని ఇప్పుడే తెలుస్తుంది.




శ్రీఅరుణం,
విశాఖపట్నం.

Sunday, December 11, 2011

నా ప్రేయసి నన్ను "కన్నా" అని పిలిచినప్పుడు కలిగిన ఆనందం మీ ముందు ఈ కవితగా.

అప్పుడెప్పుడో అమ్మ సృష్టించినట్లు గుర్తు


ఆ తర్వాత...

వయసు దాచేసుకొందో???

మనసు కప్పేసుకొందో???


సమాజం చెరిపేసిందో???


నా కొసమేనంటూ...అదే పిలుపు మళ్ళీ...


ఉంటుందని మరిచిపొయాను.


పెద్దరికపు ప్రాపులో.. ఖద్దరు బట్టలు చుట్టుకొని


నా అడుగుల శబ్దానికి నేనే గాంభీర్యాన్ని పెంచుకొన్నాను,


ఇంతలోనే...


హృదయంలో తేనె ఒలకపోసుకున్నట్లు..


అమ్మ దోసిళ్ళలో మళ్ళీ వెన్నపూస బువ్వ తింటున్నట్లు..


చాలా రోజుల తరువాత


"కన్నా" అన్న ఆ పిలుపు నా కొసం వినిపిస్తే..


నేను నిలుపుకొన్న ప్రేమే నాకీ అదృష్టాన్ని ఇస్తే...


చాలదా ఈ తృప్తి ...నన్ను నేను ప్రేమించుకొవటానికి.




శ్రీ అరుణం
విశాఖపట్నం.









Saturday, November 19, 2011

marala modhalupydadham

chalaa rojula tharvaatha maralaa ee sunday nundi kaludhdhaam.

Saturday, April 10, 2010

అద్దం

అద్దం ముందు జీవితం ఎప్పుడూ

సరిపుచ్చుకొవటంతోనే గడిచిపోతుంది,

ఆత్మముందు పరుచుకున్న ఆవిష్కరణ

అవనిముందు నిన్ను తలెత్తుకొనేలాచేస్తుంది.

అద్బుతాలు పుట్టుకురావు...

అంబరం నీ తోడు వచ్చినట్లు కనిపించినా

ఒంటరితనాన్ని నువ్వెందుకు ఫీలవుతున్నావు?

సమతూకం సాధించాలంటే ముందుగా

బరువు తెలుసుకోవాలికదా?

శబ్దం ఎన్ని మెళికలు తిరిగితేనో

శంఖం నుండి మధురంగా వినిపిస్తుంది.

నమ్మకం నీ అస్థిత్వంలో మిళితమైతే

అనంతంలోను గమ్యాన్ని అన్వేషించొచ్చు.

శ్రీ అరుణం

విశాఖపట్నం.


Tuesday, January 26, 2010

దేవుడి నిట్టుర్పు

జన్మ, గుండె, మెదడు,

ఇవి మూడూ మనిషికి దేవుడిచ్చిన వరాలు


జన్మకెప్పుడూ జవాబుంటుంది
నీకోసం వున్నానంటూ వెతికే మరో జన్మ తోడుంటుంది,
అందుకే అంతటా వేళ్ళూనుకుంటుంది.


గుండెకెప్పుడూ ప్రశ్నలే...
అక్కున చేర్చుకొనే దగ్గర కోసం నిరంతరం గాలింపులే,
అ నిర్వేదంలో నిరర్దకభావలను నిజాలుగా అపాదిస్తే...
అస్తిత్వం అద్దకమేలేని ప్లాస్టిక్ ముద్దవుతుంది,
ఏ రక్తమూ తనలో ఇంకని అడ్డుగోడవుతుంది,


అప్పుడే మెదడు పనిచేయాలి
జ్ఞాపకాల నర్తనని ఆపాదమస్తకం సవరించాలి
హృదయపు పాత్రలో నిండిన కన్నీటిని నవీన ధాతువుతో నియంత్రించి
నువ్వు అనే పరీక్షకు నిన్ను మళ్లీ సిధ్ధం చేయాలి.


అక్కడే నీకు దేవుడు కాండాక్ట్ సర్టిఫికెట్ ఇస్తాడు,
నీ గెలుపును చూసి...
సృష్టికి తనూ అర్హుడినేనని నిట్టుర్పు విడుస్తాడు.






శ్రీఅరుణం .

Saturday, January 16, 2010

పెద్దపండుగ

మా ఇంటి చివరన
సందుమూలన
మురికికాలువ పక్కన
చిరిగిన గోనిపట్టాని పరుచుకొని
కొబ్బరిబొండాలమ్ముకొనే మామ్మ,
ఒక్కరొజు సెలవు పెట్టి
నేతచీర కట్టుకొని
బోసినవ్వులతో కనిపించిందంటే...
ఆ రోజు నాకు సంక్రాంతి పండుగని అర్ధం అయిపోతుంది.

గుమ్మం అంచున చెల్లి
బ్యాలెన్స్ గా నిలబడి
బావ రాకకోసం
కనుగ్రుడ్లను రోడ్డుకు అతికించుకొంటే
పండగొచ్చిందని తెలిసిపోయింది.

మేమంతా కొత్తబట్టలు కట్టుకొంటే
చూడాలని అమ్మ కళ్ళు ఆత్రంగా వెదుకుతుంటే
నేనూ సిద్దం అయిపోయాను కనుమ కోసం.

మా అందరి ఆశలూ తీర్చడం కోసం నాన్న
మౌనంగా షావుకారింటికి అప్పుకోసం బయలు దేరితే
పూర్తిగా తెలుసుకున్నా...
మన పెద్ద పండుగ ఇదేనని.

శ్రీఅరుణం
విశాఖపట్నం.

9885779207

Saturday, January 9, 2010

ఒకే ఒక్కసారి

మనలో చాలామందిమి నేను ఎంత ప్రేమించినా అవతలివాళ్లు నన్ను దూరం చేసుకుంటున్నారని భాద పడుతుంటారు.కాని నిజమైన ప్రేమే మనలో ఒకసారి మొదలైందంటే...శూన్యంలోనూ ఆనందాన్ని అనుభవించగల మనసు మన సొంతం అవుతుంది.అటువంటప్పుడు మన ప్రేమని పొందలేకపోవటం వారి దురదౄష్టం . ఆ అద్భుతమైన ప్రణయానందం మనల్ని ఎప్పటికీ హాయిగానే వుంచుతుంది.ఆ విషయాన్ని నా అనుభవం ద్వారా నేను పొందిన క్షణాలను మీ ముందు వుంచుతున్నను ఇలా... [ఆంధ్ర భుమిలొ ప్రచురితమయింది]


ఒక్క చూపురా కన్నా
కనగానే అమ్మ చూస్తుందే....అలా,
ఒక్క నవ్వురా బుజ్జీ
నేనంతా నీదే కదరా అన్నప్పుడు నవ్వుతావే...అలా,
ఒక్క స్పర్శరా తల్లీ
నా భుజంపై సేదతీరినప్పుడు..
నీ తల వెంట్రుక ఎగిరి నన్ను తాకు తుందే...అలా,
ఒక్క ఉత్తరం రా బంగారం
ప్రేమతో నీ చేతివ్రేళ్లు నా గుండెలపై రాస్తాయే...అలా,
ఒక్క ముద్దురా ప్రియా
కనురెప్పలు చివరిసారి మూతలు పడుతున్నప్పుడు
ఆర్తి తీరని మెహం వుంటుందే...అలా,
ఒక్క జీవితం రా ప్రేమా
నిన్ను హత్తుకొని నా హృదయం అలాగే ప్రణమిళ్లేంత వరకూ.


Sunday, December 27, 2009

చిద్విలాసం [కవిత]

చిద్విలాసం [కవిత]

ఈ కవితకి నేపధ్యం అవసరంలేదు, అని అందరికీ తెలుసు.ఆ తిరుమల గిరిపై నేను అనుభవించిన అనుభుతికి ఇలా అక్షరరూపం ఇచ్చాను.అంధ్రభూమి వీక్లీలో 2009లో ప్రచురించబడింది.

కోటి సిరులు పండిన చోటు
కోనేటిరాయుడు నిలిచిన చోటు
కొంగున కట్టిన మొక్కులను
వడ్డీలతో కలిపి వసూలు చేసుకోనే చోటు,
ఆ గిరి సుగంధాల ఆవిరి
ఆ నిధి లక్ష్మిదేవి పుట్టినింటి దరి
అమృతపు భౌతికత్వాన్ని
కనులముందుంచే గోవిందస్మరణ
పిల్లతెమ్మరలా పలకరిస్తుంది,
చలువరాతి కౌగిళ్ళు
జీవన ఆర్ధతని హత్తుకుంటాయి,
ఆ మేము వీక్షణకై...
ఎన్నివేల వరుసలో...చీమల దండ్లలా
ఆధ్యాత్మిక సమరం చేస్తుంటాయి,
తిరునామం కప్పిన నయనాలు
చిద్విలాపంగా నవ్వుతుంటే
ఆ కొసరి మురిపానికే...
ఎన్నివేల గుండెలు తపిస్తున్నాయో,
తన్మయత్వపు అంచులవరకూ తనువులు తరియించాలంటే...
శ్రినివాసుని ఇంటికి వెళ్ళొధ్ధాం రండొకసారి.

నా కవితల వెనుక....?

ముందుగా నవల ఆపుతున్ననంధుకు... సారీ. ఈ కధలో నిజజీవిత పాత్రలుకుడా వుండటం వలన వారి అభిప్రాయంలను మన్నిస్తూ కొంతకాలం ఆపివేస్తున్నాను. ఈలోపు పభ్లిష్ అయిన నా కవితలని వాటి నేపధ్యంతో ప్రతీ ఆదివారం మీ ముంధు వుంచుతాను.మీ కామెంట్స్ పంపుతూ నన్ను ప్రోత్సాయిస్తారని నమ్ముతూ....

మీ
శ్రీఅరుణం.

Monday, December 29, 2008

మార్పు

ఇటీవల ఒక న్యూస్ చదివాను.బెంగులూరులో ఇద్దరు ప్రేమించుకున్నారు.ఇద్దరూ డాక్టరులే. ఒక సంవత్సరం తరువాత ఆ అబ్బాయి మరొక అమ్మయిని వివాహం చేసుకున్నాడు.దానితో కోపం కట్టలు తెంచుకున్న మొదటి అమ్మాయి అతడిని మంచిగా హాస్పటలుకి పిలిచి మత్తుమందిచ్చి అతని మర్మాంగం కోసేసి పారిపోయిందట.అది చదివిన మరుసటి రోజే స్వప్నిక సంఘటన,మరో దాడి...,శ్రిలక్ష్మి, అయొషా,ఇలా చాలా సంఘటనలు జరిగిపొతూనే వున్నాయి???అందరం ఖండిస్తునే వున్నాం ???ఈ సమస్య విషయంలో ఇప్పటికే మొదలైన కౌన్సిలింగులు,వేదికలూ చాలావరకూ శ్రమిస్తున్నాయి కానీ... ఈ సమస్యలోని విషయాన్ని అమ్మాయిలు,అబ్బాయిలు అని రెండు విభాగాలుగా చీల్చేసి మాట్లాడుతున్నారు.నిజానికి ఇది మనవసంబందాల విషయంలో పెచ్చురిల్లుతున్న విశృంఖలధోరణిని అరికట్టాల్సిన సమస్యగానే కానీ,అమ్మయిలదనో..అబ్బాయిలదనో.. ఒక వర్గాన్ని నిలబెట్టడం వలన పరిష్కారమయ్యే సమస్య కాదు.ఇటువంటి ఉన్మాద చర్యలు ఎవరు చేసినా తీవ్రంగా ఖండించాలి.అదే సమయంలో వాస్తవికతను కూడా అవగతం చేసుకోవాలి.ఎందుకంటే ఇప్పుడు..ఇది మన అందరి సమస్య.
నిజానికి ప్రస్తుతం మన సమాజం సంధియుగంలో వుంది.పాశ్చాత్యసంస్కృతి ప్రభావంతో రెచ్చగొట్టబడుతున్న ఆశలు ఒక వైపు..,తరతరాలుగా కుటుంబం అందించిన భారతీయసంస్కృతి మరో వైపు..,పరుగులజీవితాలలో కుటుంబంలోని మనుషులతో గడిపే క్షణాలు కుచించికుపోవటం ఇంకొకవైపూ..,మనిషిని స్వాంతన లభించని స్థితికి తీసుకువెళ్ళిపోతున్నాయి. అందుకు మరొక కీలకమైన కారణం..ప్రాధమికస్థాయిలో సమస్యల్ని నిర్మూలించే విషయంలో పెరిగిపోయిన నిర్లక్షధోరణి. వీటి విషయంలో ముందుగా మనం ద్రష్టి నిలపాలి.అది చెబుతూనే ఈ మార్పు కవిత.


నిప్పుకణికలోంచి చిట్లుతున్న
ఆశలు కొన్ని...
నిజాలని నిర్లక్షం చేస్తూనేవున్నాయి,
గొంతులు పూడుకుపోయిన ఆ నిశీధిలో..
అస్థిత్వం లేని నిర్ణయాలు
తలలు వంచుకుంటున్నాయి,
కల్మషపు కార్చిచ్చు కౌగిలిస్తుంటే..
మూలం తెలుసుకోకుండానే
సముద్రాలు తిరగబడుతున్నాయి,
వంచించిన బందం ముంగిట
ప్రాణమే ప్రార్ధించినా ఫలితం శూన్యం,
మేకప్పులు మార్చుకోవటం మార్పంటూ విరగబడితే..
లోతులలో నిండిన సంస్కృతి చాయలు
బూడిదకుప్పల్ని సృష్టిస్తుంటాయి,
కన్నుకు కన్నే వివేకమైతే..
కాలలెప్పుడో గుడ్డివైపోతాయి,
డబ్బుల కట్టలు దొరికినప్పుడల్లా
దిష్టిబొమ్మలు నీపంచన నర్తిస్తాయి,
ఆ దారులవెంట సహగమనాలు జరిగినా
హృదయపుకోవెల్లో స్మశానం జన్మిస్తుంది,
నీ పాదాలను కడిగే కన్నీరే...
చేతబడిలా వికటాట్టహాసం చేస్తుంది.

శ్రిఅరుణం



Monday, December 15, 2008

అశోకచక్రం

ఆర్ధిక మాధ్యం ,తీవ్రవాదం వంటి సమస్యలతో సతమవుతున్న మనలో..ఏదో అసహనం కట్టలు తెంచుకుంటుంది.ఆ భావనలో మనసు కోరుకుంటున్న పరిష్కారం ఒక్కోసారి హద్దులుకూడా దాటుతుంది. ఈ దారిలో శాంతి సహనం కాస్త పక్కన పెట్టాలన్న ప్రశ్నలూ...మొదలవుతున్నాయి. కానీ అపురూపమైన వారసత్వాన్ని సంపదగా కలిగిన భారత భూమి కోరుకునేది...శాంతియుత సహగమనమే. అది మన తర్వాతతరం వారికి ఆస్తిగా ఇవ్వాల్సిన భాద్యత మనందరిదీ అని నమ్ముతూ...ఈ అశోకచక్రం కవిత.

నా దేశపు వీధిబడిలోకి
మళ్ళీ వచ్చేసింది జెండాపండగ,
వృధ్ధాప్యం దరిచేరిన ఊపిరిలా..
జెండాకర్ర వొణికిపోతుంది!
మూడురంగులనూ ముచ్చటగా నింపారు
శాంతిచక్రాన్ని మాత్రం ఎక్కడనో వొదిలేశారు..
ఏమయిందంటూ..వెతుకుతూ వెళ్ళాను,
వీధిమలుపులోనున్న చెత్తకుండీనిండా
తగలబడుతున్నాయి....
రాత్రిముగిసిన మతఘర్షనల్లో ముగిసిన
జీవితాల కాష్టాలు!!!
ఆ కుళ్ళు భరించలేక మరో మలుపు తిరిగాను,
గరిక పిలిచింది
గ్రామం ఇటుందని..
ఆశలగాలితెరలు ఊతమిస్తుంటే
పొలాలు చేతులు చాపి దారిచూపుతున్నాయి,
ఏముందక్కడా?
బంధాలు పూరి గుడెశెచూరులో చిక్కుపడిపోయాయి..
తాత కాల్చి వదిలేసిన చుట్టముక్కలా..,
ఎక్కడంతా లెక్కలు తారుమారయ్యాయి
ఇప్పుడిక్కడ ఏ విత్తనం వేసినా పండేది విషమే!
ఏ అంతచ్చేధనతో...
అసలు అశోకచక్రం ఎందుకు? శాంతి ఎక్కడుంది మనకూ?..
అనుకుంటూ వెనుదిరగబోయాను..,
నా సణుగుడు వినిపించిందేమో...
ఒక లేత గుండె స్ఫంధించింది
ఆగమని సైగచేస్తూ...
భుజం పైనున్న తన బడిబస్తాను దించి
తెల్లని కాగితాన్ని బరబరా చింపి
ఆ కమ్మని హౄదయపు రంగుల పెన్సిళ్ళతో
లేతనైన ఆశల మునివ్రేళ్ళతో గీసిచ్చింది,
అశోకచక్రాన్ని....
అంకుల్! మాకోసం ఇది అంటించండని.





Saturday, November 29, 2008

జై వీర జవాన్

జై వీర జవాన్
ముకులించిన కోట్ల జోతలు
వదలలేని కన్నీటి వీడ్కోలు
కదనరంగంలో ఫణంగా పెట్టిన
ప్రాణం విలువను చేప్పకనే చెబుతున్నాయి,
ఉరితాడు
రైలుపట్టాలు
పురుగుమందులు
నరికివేతలు
కాల్పుల చిట్టాలు
ఇవికావు చావంటే!
మరణంకూడా మనసున్నదే,
చనిపోయినమరుసటి క్షణం నుండీ ఉదయించే నీ ఙ్ఞాపకాలనే అది ప్రేమిస్తుంది,
ప్రేమించామనీ
వంచించబడ్డామనీ
తెగనరికామనీ
తెగించలేకపోయామనీ
కుళ్ళిపోతూ
కుమిలిపోతూ
భయపెడుతూ
భాదపడుతూ
కాష్టం వైపు నడిస్తే
నీ ఆత్మకూడా వెంట రాదు.
నమ్మిన వంచకాలు
నమ్మని నిజాలూ
ఆశించిన ధామలూ
అనుభవించని శవాలూ
ఇవికాదు...మన చావుకు కారణాలు!!!
ఏ సంబంధం వుందని..ఉన్నిక్రిష్ణన్ తెగించాడు?
నువ్వేమవుతావని..సాలస్కర్ సాగిపోయాడు?
నా ఒక్కడితో ఏమవుతుందనుకుంటే???
వందకోట్ల మనల్ని రక్షిస్తున్న
జవానులు ఎంతమందుంటారు?
లోపల నీ ఆనందం కోసం
బయట..తమ గుండెకాయల్ని పేర్చి
కాపుకాస్తున్న ఆ త్యాగాలకు
మనమందిస్తున్నదేంటి?
చావంటీ అందరికీ ఒకటే..
మనిషికీ
ముష్కరులకీ
మరి..చచ్చాక..
బ్రతుకింకా ఉండేది ఎవరికీ?
మనకోసం మరణించిన
వీరులకి నివాళులివ్వాలంటే..
మన చావుకూ పవిత్రత వుండే..
జీవితాల్ని ప్రేమిద్దాం,
మన ప్రేమే వారికి దన్నుగా
దేశమాత సన్నిధిలో తరిద్దాం.




Thursday, November 27, 2008

మన ముంబాయి కోసం .

మన ముంబాయి కోసం .

ఒరేయ్..
వస్తున్నా రా..
మా రక్తాన్ని గడ్డకట్టించి
సంకల్పంతో ఆయుధాలు చేసి నా ఇంటిని మసిచేస్తున్న
నీ చేతులను తెగనరకడానికి,
ఎవడబ్బసొమ్మనుకున్నావ్ నా దేశాన్ని,
ఏ అబ్బా లేని బ్రతుకెందుకు ఈడుస్తున్నావ్?
అమ్మ చనుబాలకీ విషం కలిపే
మానవత్వపు నపుంసకత్వాన్ని ఏం చేసుకుంటావ్?
నీలాంటి బ్రతుకులు బ్రతకాలంటే..
ఎప్పుడో..ప్రపంచాన్ని శాసించే వాళ్ళం,
మా నవ్వులపై నిప్పులు వేస్తే
మీ రక్తంలోకి లావాను దొర్లించేస్తం!
బాంబులకు భయపడి

భిభత్సాలకు నక్కి
దాక్కున్నామనుకోవద్దు,
మహాత్ముని మాటకోసమే..
మమతల్ని మన్నించికొంటున్నాం,

పందుల్లా చొరబడుతూ
పదుల్లో వున్న దేశద్రోహులను చూస్తూ...
ఇదే భారతమనుకోకు,
ప్రజాస్వామ్యం విలువలు సర్దామంటే..
మీ నరాల చివరి అంచు వరకూ
ఖైమా కొట్టేస్తాం.
మరో ప్రపంచానికి కూడా
మీ బూడిదను అందకుండా చేస్తాం.


శ్రీ అరుణం
విశాఖపట్నం.

Wednesday, November 12, 2008

ప్రేమగమనం

చాలా వరకూ ప్రేమల్లో వస్తున్న సమస్యల్లా..మనం ప్రేమిస్తున్న స్థాయిలో అది అందుకుంటున్న వ్యక్తి వున్నారా?అనే సందేహం. చాలా ప్రేమబంధాలలో హృదయం పై నిమురుతున్న చేతులు గుండెలతో మాట్లాడుతున్నాయా? లేక డబ్బులు వెతుకుతున్నాయా? అనేది అర్ధంచేసుకునే లోపునే....ముగింపు తొందరపెడుతుంది.ఈ ద్వంధ్వవైఖరి మన ఆలోచనల నుండి తొలగి పోవాలి.అందుకు ఒకటే మార్గం.అది నమ్మకం.ఎటువంటి ఇగోలూ లేని స్వచ్చమైన దగ్గరితనం మన మద్యన వున్నప్పుడు.. మరో భావం మనమధ్యన చేరదు. అది గెలుపు లోనైనా,ఓటమిలోనైనా.
అదే ఈ ప్రేమ గమనం.

ఉచ్చ్వాసం ఉనికిని చేరాలంటే
ఉధ్విగ్న గమనాలలో
ఊపిరి పయనమవాల్సిందే ,
శిఖరపు అంచుల ఆవిష్కరణకై..
లోతుల అంతచ్చేదన జరగాలి.
తాత్వికత తత్వంలో కంటే
ఆత్మను నమ్ముకోవాలి,
రెండుమనసుల వివాహవేధిక
నమ్మకం పునాదులతో కట్టబడుతుంది,
అందాన్ని నమ్ముకొని అక్షరాల్ని మలుచుకొంటే..
అభిమానం, అనుమానంఒకే రూపంలో ఇమిడిపోతాయి,
నమ్మకం వేళ్ళు ఆత్మలో మొలిచాయా?
దాన్నెప్పుడూ పెకిళించకు
అగ్నికీలలముందు.........
దూదిపింజతో చేసే సాహసం అది!
రోదించిన మనసుకు సమాధానం...
తెగిపడే భౌతికాలదైతే
సృష్టించిన కారకుడే ఎప్పుడో..
ఆత్మహత్య చేసుకొనేవాడు,
ప్రాణంతీయాలంటే..పావలా కత్తి చాలు,
పాశం నిన్ను కౌగిళించాలంటే..
ఎన్ని కోట్ల అణువులు కదలాలో..మీ రెండురక్తాల్లో....!


శ్రీఅరుణం,
విశాఖపట్నం.


Thursday, November 6, 2008

ప్రసవ వేదం

సృష్టిలో గొప్పది అమ్మతనం .తన ప్రాణాన్నే పంచి మనకు జీవితాన్ని ప్రసాదించే ఆ ప్రసవవేదన మనకు వేదంతో సమానం.ఆ అనుభవాన్ని చుసిన కన్నులు లిఖించుకున్న కవనం ఈ ప్రసవ వేదం.


అమ్మ ఊపిరికి అడ్డం పడుతూ
అనంతానికి అర్ధం చూపెడుతూ..
త్యాగాన్ని చీల్చుకువచ్చే తుది ప్రణవనాదం..
జీవనసంగీతంలో..అత్యుత్తమరాగం,

చిన్ని పొట్టలో ఆకలి కొత్తగా పుడుతుంటే
ఆకృతీకరించిన ఆత్మచలనంలా..
ఉద్దీపిస్తున్న ఏడుపు
ఎన్ని గమకాలను తాకుతుందో?

బుడిబుడి అడుగులతో
భూమిపై పడుతున్న దర్ఫం
ఆక్రమించబోయే సాధననిఎత్తిచూపుతున్నట్లుంది.
కల్మషం అర్ధం తెలియని బోసినవ్వు..
పాదరసపు వరదలా
హృదయపు ఇరుకులలోంచీ ప్రవాహిస్తుంది,

ఎన్ని ఆవరణలు బ్రధ్ధలవుతున్నా
మరెన్ని అవతారాలు అంతరిస్తున్నామానవుడు ఫరిడవిల్లుతున్నాడంటే..
పరిమళిస్తున్న అమ్మతనంమనకందిస్తున్న రక్తబందానికే.
శ్రీఅరుణం,

విశాఖపట్నం.

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.