Wednesday, July 10, 2013

హృదయపు చెలమలు

కన్నీటికి వరదొస్తేనే
హృదయపు చెలమలు నిండుతాయి,
మరపు చేతకాని మనోవల్మీకాలే
ఆ తీరం వెంబడి సాగిలపడి కవనాన్ని రచిస్తాయి.
మిణుగురులు మెరుపనుకొని
మేఘాలు వర్షించేస్తే..
అభిమానం తలదాచుకొనే తావెక్కడ దొరుకుతుంది?
బ్రతుకు ఆటయితే భరించడమే నేరం ,
సంద్రాన్ని ఎప్పుడైనా ప్రశ్నించావా?
ఆ కెరటాల నిరంతరత ఎందాకని?
దిగంతాలు దొర్లుతున్నా..
ఏ అంతరాలను అందుకోవాలని ప్రాకుతున్నాయవి?
వర్షించే ప్రతిమేఘం
హిమం కరిగిన శుద్దమే కాదు,
వక్రించిన కూహకాలెన్నో ధూళికణాలై అడ్డుకుంటే
భళ్ళున పగిలిన హ్రుదయాలు భాష్పించిన రుధిర ధారలెన్నో !
పలకరించే ప్రతీ ప్రణయం
ప్రణవాన్ని చేరుకోలేదు,
అరుణోదయాన్ని వీక్షించలేని మనసుకు
శ్రీ రాగాలెన్నున్నా..
మూగవైన షడ్జమాలే.

శ్రీఅరుణంవిశాఖపట్నం.

Sunday, June 23, 2013

తప్పెవరిది???

శివా....
నిన్ను దర్శించాలని నిప్పులను తొక్కినవారిని
నీళ్ళతో వధించావా?
నీకోసం కాళ్ళునరుక్కున్నవారికి 
కన్నీళ్ళే మిగిల్చావా?
నువ్వు నిలిచావని వెతుకుతూ వచ్చిన అభాగ్యులను
హారతిపళ్ళెంలో పడవేశావా?
ఇవన్నీ నువ్వే చేశావా?
శివా అంటే మంగళం కదా? మరెందుకింత అమంగళం జరిగింది?
నీకోసం నిద్రను మానుకున్న వారు...మెలకువలేని నిద్రలోకి ఎలా జారిపోయారు?
ఇలాంటి ప్రశ్నలతో అన్వేషిస్తున్న నాకు గంగమ్మ ఎదురైంది కలలో,
చిరుకోపంతో వెళ్ళిపోతున్న నన్ను ఆపింది చెయ్యిపట్టుకొని..
"శివున్ని చూడాలంటే నిన్ను నువ్వు చూసుకొంటే చాలదా?
ఆ స్వామిని వెతకాలని అంతదూరం అవసరమా?" అంటూ ప్రశ్నిస్తే..
అయోమయంగా చూస్తున్న నన్ను ఆ తల్లి మళ్ళీ తనే సమాధానమై ...
"పచ్చని ఆయన దారిని మీ రహదారుల కోసం నాశనం చేయటమెందుకు?
విశాలమైన నా దారిని వ్యాపారం చేయటమెందుకు?
దేవున్ని చూడాలంటే..ఆ దారిలో కష్టాన్ని భరించిరావాలి,
ధుర్గంధమైన మీతప్పులతో ఆ స్వామి సన్నిధికోసం మలినం చేయక్కరలేదు,
ఇప్పటికైనా నమ్మండి...
ప్రకృతే పరమాత్మ...
దానిని కాపాడటమే నీకు స్వర్గపుదారి...
అందుకే మునులు తరాలుగా ఆ ప్రకృతి ఒడిలో పరమాత్మను సేవించారు.
మీరూ మునులు కావాలంటే మా దగ్గరకు రావక్కరలేదు
మీరున్న చోటునే పచ్చదనంతో నింపండి...హిమాలయాలు మీ ఇంటిముందుకే నడచి వస్తాయి". 

శ్రీఅరుణం 
    


Friday, June 21, 2013

ఆశలు

నిప్పుకణికలోంచి చిట్లుతున్న
ఆశలు కొన్ని...
నిజాలని నిర్లక్షం చేస్తూనేవున్నాయి,


గొంతులు పూడుకుపోయిన ఆ నిశీధిలో..
అస్థిత్వం లేని నిర్ణయాలు
తలలు వంచుకుంటున్నాయి,


కల్మషపు కార్చిచ్చు కౌగిలిస్తుంటే..
మూలం తెలుసుకోకుండానే
సముద్రాలు తిరగబడుతున్నాయి,


వంచించిన బందం ముంగిట
ప్రాణమే ప్రార్ధించినా ఫలితం శూన్యం,


మేకప్పులు మార్చుకోవటం మార్పంటూ విరగబడితే..
లోతులలో నిండిన సంస్కృతి చాయలు
బూడిదకుప్పల్ని సృష్టిస్తుంటాయి,


కన్నుకు కన్నే వివేకమైతే..
కాలలెప్పుడో గుడ్డివైపోతాయి
డబ్బుల కట్టలు దొరికినప్పుడల్లా
దిష్టిబొమ్మలు నీపంచన నర్తిస్తాయి,


ఆ దారులవెంట సహగమనాలు జరిగినా
హృదయపుకోవెల్లో స్మశానం జన్మిస్తుంది,
నీ పాదాలను కడిగే కన్నీరే...
చేతబడిలా వికటాట్టహాసం చేస్తుంది.

శ్రిఅరుణం

Thursday, May 30, 2013

దేవుడి నిట్టూర్పు...

నమ్మిన ప్రేమ నన్ను వంచించిందన్న బాదతో గడిపిన నాకు..నన్ను నేను తిరిగి పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడిందనిపించింది.ఆ బాధతో కోపం,ఆవేదన,ఉక్రోషం,కసి లాంటి అనేక భావాలు నన్ను చుట్టుముట్టాయి. అంతలోనే నన్ను నేను గుర్తుకు తెచ్చుకోవాల్సిన ఆవస్యకత నా ముందున్న వాస్తవజీవితం చూపెట్టింది. అందుకి నేను ఆశ్రయించింది కేవలం పది నిముషాల ఆలొచన.అదే ఇలా కవితా రూపం దాల్చింది.



జన్మ, గుండె, మెదడు
ఇవిమూడూ మనిషికి దేముడిచ్చిన వరాలు.
జన్మకెప్పుడూ జవాబుంటుంది,
నీ కోసం ఉన్నానంటూ వెతికే మరో జన్మ తోడుంటుంది,
అందుకే అంతలా వేళ్ళూనుకుంటుంది.

గుండెకెప్పుడూ ప్రశ్నలే?
అక్కున చేర్చుకునే దగ్గరకోసం.. నిరంతరం గాలింపులే!
ఆ నిర్వేదంలో నిరర్దకభావాలను నిజాలుగా ఆస్వాదిస్తే ,
అస్థిత్వం అద్దకమే లేని ప్లాస్టిక్ ముద్దవుతుంది.
ఏ రక్తమూ..తనలోన ఇంకని అడ్డుగోడవుతుంది.
అప్పుడే మెదడు పనిచేయాలి,
ఙ్ఞాపకాల నర్తనని ఆపాదమస్తకం సవరించాలి.
హృదయపుపాత్రలో నిండిన
కన్నిటిని నవీన ధాతువుతో నియంత్రించి ..
నువ్వు అనే పరీక్షకు నిన్ను మళ్ళీ సిద్దం చేయాలి.
అక్కడే..నీకు దేవుడు కాండాక్ట్ సర్టిఫికెటిస్తాడు,
నీ గెలుపును చూసి..
తనూ సృష్టికి ..అర్హుడినేనని
తనకుతాను నిట్టూరుస్తాడు.

మీ
శ్రీ అరుణం .



Sunday, May 19, 2013


విశాఖ సముద్ర తీరానికి లేత యవ్వనం లాంటి ప్రకృతి ప్రసాదం యారాడ ప్రాంతం. అమాయకంగా కవ్వించే... ఆ ఏకాంతం, ఆహ్లాదం ఇక్కడే పుట్టిందా అనిపించే...కొండలు, హృదయాలను మమేకం చేసే...పచ్చదనం .....వెరసి , అదొక ఆనంద విహారం. ఒకప్పుడు ఆ యారాడలో అనుభవించిన ప్రేమానుభూతులు ఈ కవితలో నింపాను. చిత్తగించండి ఈ కవన సేద్యం కవితని.


పచ్చని పొలాల పాపిడిలో
మన ఇద్దరి అడుగుల సంగమం
ఉసిరికాయల చెట్టు దోసిళ్లలోన
పురివిప్పిన పసితనపు
అస్తిత్వంఊటబావి నీటిపైన
నిటారున పడ్డ అరుణకిరణం
తొంగిచూస్తున్న మన ఆశలను
చటేల్మని కమ్మేస్తే...
 హృదయపు చేలో
మన కలల విత్తనాలు
ప్రసవించిన మొగ్గలు నా కవితలు,
నీ ఙ్ఞాపకాలతో నాట్లు వేస్తుంటే..
పిల్లకాలువలా సిరా ధారధరిత్రిని నూర్పిస్తూ..
ఉద్దీపించిన పంటకుప్ప అక్షరాల సేద్యం
కల్పనలకు అంట్లు కడుతుంటే
అవి కవితా పుష్పాలవుతున్నాయి,
కల్పనలనే నిజం చేసిన నీ ప్రణయపు మేరువులు 
ఎన్ని అక్షర మొక్కలను నా కవన క్షేత్రంలో పండించాయే?
జిహ్వగా మారిన కావ్యమాతే
కాళిదాసు అవతారమైతే...
నా జీవాన్నే పరీవృతం చేసిన నీ అనుభూతులు
నా కవనసేద్యానికి సర్వేంద్రియాలు.


శ్రీఅరుణం.

Sunday, May 12, 2013

అమ్మ


అమృతం త్రాగిన దేవుని త్రేనుపు...అమ్మ,
గుండెకున్న తీపిని నయనాలు వీక్షించగలిగితే...ఆ రూపం అమ్మ.
ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాన్నీ దోసిటపట్టి బువ్వపెట్టగల అద్భుతం...అమ్మ,
మృత్యువుతో కావాలని యుద్దానికిదిగి నన్ను కన్న దేవుని ప్రతినిధి...అమ్మ,
"నాన్న" అనే పిలుపుకు నన్నూ అర్హున్ని చేసిన ప్రేమ..అమ్మ,
"అమ్మ"అనే తనవిలువకోసం, ప్రాణమైన బంధాన్నే వదులుకొన్న త్యాగం..అమ్మ,
కాలానికి జీవం...
జీవాలకు కాలం...
ప్రకృతికి నేస్తం...
ప్రపంచానికి ఆధారం...అమ్మే.
ఆ అమ్మకు నా పాదాభివందనం.

శ్రీఅరుణం. 
 

Saturday, May 11, 2013

పచ్చని చేలో..
పూరిగుడిశెలో..
దూరంగా పలకరిస్తున్నసముద్రపు అలల హోరులో..
నువ్వు తెచ్చిన ఇడ్లీ ఆవకాయా తింటూ ..
మనం అనుభవించిన పరవశాలు..
ఒక్క గంట..కాదు కాదు,
ఒక్క నిముషం..అదీ కాదు,
ఒక్క క్షణం..ఇస్తానని చెప్పు నేస్తం,
ఈ క్షణమే వాలిపోతాను నీ దోసిళ్ళలోకి.




నా "నీ అడుగులలో నాఙ్ఞాపకాలు" నుండి.


శ్రీఅరుణం.

Friday, May 3, 2013

నా "శ్రీఅరుణం" కలం ద్వారా రాబోతున్న రచనలు...

ప్రపంచంలో ప్రసవవేదన అనుభవించగలిగేది ఇద్దరే..
ఒకటి స్త్రీమూర్తి అయితే,
రెండు కవి.
ఒక రచన చేయటానికి కవి ఎన్ని అనుభవాలను మోస్తాడో...ఆ పుస్తకం విడుదలకోసం అంతగా తపిస్తాడు. అప్పుడు అనుభవించేదే ప్రసవవేదన. ఆ ప్రసవవేదన నుండి పుట్టే ఆ సాహిత్యం సమాజానికి ఉపయోగపడితే ఆ కవితండ్రి ఆనందం ఎంతగానో...చెప్పలేం. ప్రస్తుతం మొదటి పుస్తకం ప్రచురణకోసం పబ్లిషర్ వారికి పంపించి ఎదురుచూస్తున్న నా తపనా అలాగే వుందిప్పుడు.
ఒకవైపు నా మనసూ,
మరో వైపు నా కుటుంబం,
ఇంకోవైపునుండి నన్ను అభిమానించే నా సన్నిహితులూ,విధ్యార్ధులూ...వీరందరూ "ఎప్పుడు సార్ మీ పుస్తకం వస్తుందని" అడుగుతుంటే...నాకు ఒక వైపు ఆనందంగానూ, థ్రిల్లింగ్ గానూ, కొంచం భయంగానూ వుంది. అందుకే కవిగా మీరూ ఈ పారవశ్యాన్ని పొందగలిగే ప్రయత్నాలు మొదలుపెడుతూ కలం పట్టుకుంటారని రాస్తున్నానిలా.

1. నీ అడుగులలో... నా ఙ్ఞాపకాలు... --- కవితా సంపుటి
2. అంతర్ భ్రమణం…  --- వ్యక్తిత్వ వికాస పుస్తకం [తర్కం]  
3.ఒక పరిభ్రమణం…--- కవితా సంపుటి
4. నేనేవరిని చంపాలి ??? --- నవల [ప్రేమ]
5.నేను???   --- కవితా సంపుటి
6.లైన్ ఆఫ్ కంట్రోల్  --- నవల [కోపం]
7.సుందరకాండ  

 "శ్రీఅరుణం"
                  

Saturday, April 20, 2013

ఐదేళ్ళ పసి పాపపై అత్యాచారం !!!



పొత్తిళ్ళలో పసిపాపపై అత్యాచారమేంట్రా...? 
మనుష్యులకేనా మీరు పుడుతుంది...మదపిశాచాల్లారా,
కనికరం లేని కామం..ఏ సిగ్గులేని నరాల్లొ వేడిని పుట్టిస్తుందో...
ఆ మర్మాంగాలను నడిరోడ్డుమీద ఖైమా కొట్టేస్తా,
అమ్మనుండి పుట్టినదారి మాత్రమే తెలిసిన ఆ పసిమొగ్గను చూస్తే
పువ్వులకూ జాలి కలుగుతుందికదరా...మరి
ఆ లేతతనంపై నీ విధ్వంసం...మగజాతికే వినాశనంకదరా సచ్చినోడా,
ఈ వార్తను చదువుతున్న క్షణాలలో...నా కొడకా...నువ్వు కనిపిస్తే...
పోతేపోయింది ఒక జీవితకాలమనుకొని..అడ్డంగా నిన్ను నరికేయనూ,నా అక్కాచెల్లెల్లకు నేనే సైనికుడినై,
ఇంత ధారుణాలు జరిగిపోతున్నా...మనం లెక్కలేస్తున్నామెందుకో???
చట్టాల పుస్తకాలాలో ఏ నీతులు వెతుకుతున్నామో??? 
అవన్ని మనుషుల కోసం కదా...
ఇలాంటి పశువులకోసం సమయం ఎందుకు వృధా?
రండి...మానవజాతినే నీచం చేస్తున్న ఇలాంటి మృగాలకోసం
మనమే స్వయంగా కభేళాలను తయారుచేద్దాం,
స్త్రీ జీవితాలను అవనతం చేస్తున్న కుక్కలని ఏరుకొచ్చి...నిలువునా చీరెద్దాం.


శ్రీఅరుణం

Thursday, April 11, 2013

ఉగాది రుచులతో ఒకరోజు




ఉగాది కవిత రాద్దామని వుదయాన్నే నిద్రలేచి
ఉపమానాలు వల్లెవేస్తూ కూర్చున్నాను.
ఇంకా పేపరుబిల్లు కట్టలేదని కోపంతో..
బయటనుండి పేపర్ బాయ్ విసిరిన పేపరొచ్చి నెత్తిమీద మొట్టికాయ వేసింది...వగరుగా.

ఆ దెబ్బనుండి తేరుకోని, సరే..కాసేపు పేపర్ తిరగేస్తే ఏదన్న ఐడియా వస్తుందని మొదటిపేజీ తిరగేశాను
ఆకాశమంత ఎత్తున పెరిగిన కరెంట్ చార్జీలు షాకిచ్చాయి చేదుగా.

ఆ వార్తని మర్చిపోవటానికై కాస్తంత తీపిని ఎక్కువగా తగిలించి
కాఫిపెట్టుకొని తాగుతూ టి.వి.ముందు కూర్చున్నాను
"తీపి తినకండి.షుగరొచ్చి చస్తారు" అనే కార్యక్రమం అప్పుడే జరుగుతుంది టి.వి.లో నా టైం బాగోక.

ఇంతలో ఉప్మాలో ఉప్పు వేయటం మర్చిపోయానని మా ఆవిడ డాబాపైనుండీ కేకేసింది గట్టిగా
ఆ కేకని భరించలేక ఠక్కున పరిగెత్తాను వంటగదిలోకి...ఆ ఉప్మా ముందుగా తినాల్సింది నేనే కనుక.

ఇన్నీ భరించి...
మళ్ళీ మాములయ్యి...
కవిత రాద్దామని కూర్చున్నాను..అందులో లీనమవుతూ..
కళ్ళల్లో నలక పడినట్లనిపిస్తే...నలుపుకుంటూ చూశాను నా అరచేతి వైపు.
అప్పటికే నా చేతికంటుకొని వున్న ఎర్రని కారం విరగబడి నవ్వుతుంటే.. అప్పుడు అర్ధమైంది...
ఇంతకుముందు...నేను వంట గదిలో ఉప్పనుకొని పొరపాటున కారం కలిపానని.

అప్పటికే మంట నషాళానికెక్కి నేను గెంతుతుంటే మా అమ్మాయి సాహిత్య కంగారుగా...
తన చేతిలోని కుంకుడు పులుపుని నా మొఖాన్న కొట్టింది ... నీళ్ళనుకొని.

ఇలా మంటమీద మంటెత్తుతున్న బాధని భరించలేక నేను వేస్తున్న కుప్పిగంతుల్ని చుస్తూ
మా అబ్బాయి శ్రీ శరణ్ "డ్యాన్స్ బాగుంది డాడీ " అంటూ ప్రాక్టీసు మొదలుపెట్టేశాడు.

ఇలా ఉగాది కవిత రాయాలనుకున్న నా ప్రహసనం
నాకు అన్ని రుచుల్నీ చూపించిన ఆరోజు గుర్తుకువస్తే
అయ్యబాబోయ్ ఇంక ఉగాది కవిత నేనేందుకు రాస్తాను చెప్పండి?

శ్రీఅరుణం






Wednesday, March 13, 2013

సెలవా???



అరుణానికి సెలవిస్తారా
?
అంబరమిక బ్రతికేదేలా
.
చుట్టుముట్టిన సెగలపై చిరాకుపడి

తను పుట్టిన శూన్యం దగ్గరకే పొమ్మని

సాగనంపగల వారెవరసలూ
?
మనకు తెలీదా తన అస్తిత్వం శూన్యానికి శత్రువని
,
జాగృతికి చుక్కానీలు రచించే
....
కావ్యగణితం

తన కిరణాలతో ఎన్ని వెలుగుల్ని బ్రతికిస్తుంది
.
ఆస్వాదనని హత్తుకొనే ఆ పిలుపు కోరాలే కానీ

తన జ్వాలానేత్రం నుండి
..ఎన్ని
నులివెచ్చని కంబళ్ళను

మన మంచునిద్రపై కప్పుతుంటుంది
.
నిరంతరం నిప్పుల్ని తను కాగుతూ

నవ్వులరేకుల్ని నీకు పువ్వులుగా అందిస్తుంది
.
ఆర్ధత నిండిన భువిని తనివితీరా కౌగిలించుకొని

లోతుల వైషమ్యాన్ని బయటకు నెట్టేస్తుంది
.
ప్రేమతో ఆగినవారికి
..
ప్రేమనే పంపిస్తుంది
.
పగతో వంచించేవారికి
..
లావాతో సమాధానమిస్తుంది
.
మరి
?ఎలా?
అరుణానికి సెలవిస్తారు
?
తను లేకుండా ఈ నిశిలో

ఎన్నాళ్ళని దాక్కుంటారు
?

Thursday, March 7, 2013

మహిళా సాధికారత


హృదయం బరువెంతో తెలుసా?
నీ అడుగులలో తడబాటును చూసి
తడిసిన ఆ నయనాలను కురిపించే
కన్నీటిని తూకం వెయ్యి, టక్కున చెప్పేస్తాయి.

అమ్మపెట్టిన సున్నిపిండికే రగిడిపోయిన చర్మం
మత్తిళ్ళిన పతిమృగాలు పాశవికంగా చీల్చుతున్నా..
ఎందుకలా??? వెంటుండి బజ్జోపెడుతున్నారో... అడుగు తెలుస్తుంది...
హృదయం బరువెంతో.

తను కొనుక్కున్న కట్నపు కొలిమి, తననే దహిస్తుంటే..
ప్రేగుతెగిన పాపాయిలకోసం
పాపం తనపై వేసుకుంటున్న అమ్మలనడుగు...తెలుస్తుంది..
హృదయం బరువెంతో.
భంగపడ్డ మానమంటూ..శిక్షా తనకే వేస్తుంటే..
యాక్సిడెంటులవుతున్నాయని ఎడారులలో బ్రతకాలా?

రిజర్వేషన్లు నువ్విచ్చే భిక్షాలు కాదు,
ఎందులో తక్కువని కోటాలిస్తావు?
గుండెబలంలోనా?
సునీతా విలియంసు ని అడుగు. 
కండబలం లోనా?
లైలా ఆలీని అడుగు.
త్యాగధనం లోనా?
అమ్మ కంటే చిరునామా ఎక్కడుంది మనకు.
ఎందులో తక్కువని పర్శంటేజులిస్తావు?
పంతం పట్టిందంటే.. సృష్టికి పరమార్ధం తనే.
ఎందుకైనా మంచిది.. మగాడిగా చెప్పేస్తున్నా..
సమానత్వం యిస్తేనే సర్ధుకుపోతారు, 
లేకుంటే సర్దుకో..
నిన్ను త్రోసేసి పైపైకి ఎదిగిపోతారు.
 

శ్రీఅరుణం

Friday, March 1, 2013

హైదరాబాద్ పేలుడులో మరణించిన నా వాళ్ళకోసం

నిప్పులెప్పుడూ రగులుతూనే వుంటాయి
నిజాలు మాత్రమే నిలబడి ఆలోచిస్తుంటాయి,
నవ్వులపై పగబడితే..
పెదవులు కాలకూటంగా మారిపోతాయి,
మనిషిని మనిషి చంపుకుంటే
ప్రపంచం మాయమైపోతుంది,
భావం చెప్పడానికి భాషవుంది,
మౌనం పంచటానికీ మమత వుంది,
బ్రతుకు ఇవ్వటానికి బాధ్యతలున్నాయి,
అన్నిటికీ ఆధునికం అవకాశాలనిచ్చింది,
మరి???
ఎవడబ్బసొమ్మని మరొకరి జీవితం లాక్కుంటున్నావ్?
నీ అమ్మ ఇచ్చిన ప్రాణాన్ని ఎలా అమ్ముకుంటున్నావ్?
 నువ్వు బాంబులతో  మా గుండెలు పేలుస్తున్నా..
నాకు అన్నయ్యా అనే పిలవాలనుంది.
అందుకే మళ్ళీ మేమంతా మాములుగా నడక మొదలుపెడుతున్నాం.
లోతు నువ్వే తెలుసుకో..
గీత అయినా,
ఖురాన్ అయినా
బైబిలయినా
మరేదయినా
మనకోసం చెప్పినవే కానీ..మరో ప్రపంచం కోసం కాదు,
సాటిమనిషిని చంపాలనుకొనేదే మనిషికాని లోకం.
ఈలోకం మనిషిగా ఇప్పటికైనా మారు..లేకుంటే..
పరలోకానికి నిన్ను పంపించే ప్రయత్నం మేమూ మొదలుపెట్టక తప్పదు.
 [హైదరాబాద్ పేలుడులో మరణించిన నా వాళ్ళకోసం]
శ్రీఅరుణం
విశాఖపట్నం.

 

Wednesday, February 13, 2013

స్పెషల్ డే.

అందరం మంచివాళ్ళమే. మన అంతరాత్మే మన జీవితాన్ని నడిపిస్తుంది. ప్రేమకీ, పెళ్ళికీ, స్నేహానికీ, మంచికీ, చెడుకీ..స్పెషల్ డేస్ అవసరం లేదు. మనసులో నిజం, అబద్దం రెండే వుంటాయి. నిజాలే మనం నిలుపుకొనే రిలేషన్స్. మిగిలినవి అన్నీ అబద్దాలే.  నీ నిజం నీ మనస్సులోనే వుంటుంది.  OPEN & BE LIVE & ALSO WALK ALONG WITH THAT. అదే నీ హృదయానికి నిజమైన స్పెషల్ డే.

Tuesday, February 12, 2013

జీవితాన్ని గెలుచుకోవటానికి వ్యక్తిత్వవికాసం లక్ష్యంగా నిలుపుకొనే మార్గం అవసరం. దాని కోసం ఎందరి జీవితాలనో అన్వేషించి నేను రాస్తున్న  పుస్తకానికి పెట్టిన పేరు " FACTS OF INNER SELF". ఉగాదికి నేను విడుదల చేయబోయే దీని పేరు ఎలావుందో.. ఈ ప్రారంభం చదివి తెల్పండి.

"కలలు మనసును నిలుపుతాయి..
మనసు కవిత్వాన్ని నింపుతుంది..
కవిత్వం జీవితాన్ని నిలబెడుతుంది..
జీవితం మనిషిని నిలబెడుతుంది..
మనిషి ప్రపంచాన్ని నిలబెడతాడు..
ప్రపంచం వాస్తవాన్ని నిలుపుతుంది..
వాస్తవం ఆశల్ని బ్రతికిస్తుంది..
ఆ ఆశలే మనకు రేపటిని ముందుంచుతాయి. ఇదే నా ఈ పుస్తకం రాస్తూ నాకు నేను తెలుసుకున్న నిజం.
జీవితంలో ప్రతీక్షణం ఓడిపోతూ..మూడు నాలుగుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించబోయీ.. విరమించుకున్న ఒక మనిషి, ఆ విషాదపు కోరలలో తనకు కరవైన `తోడు`ని మిగిలిన వారికీ ఇవ్వటం ద్వారా నేడు అనేకమందిలో పేరుకుపోయిన అంతర్మధనాన్ని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నమిది. 
ఈ పుస్తకాన్ని రాయటం ప్రారంభించినప్పుడు మనసులో వున్నది పై భావనొక్కటే. కానీ దీనికొరకు తవ్వుతున్న గతం, ఇతరుల జీవితాలూ, భావావేశాలూ, తర్కం.. ఇవన్నీ నాలో నన్నే విమర్శించాయి. ముందు నన్ను నేను మార్చుకోవలసింది చాలావుందని దీన్ని రాస్తున్నప్పుడు నాకు అర్ధమైంది. ఒకరకంగా అది నాకు మొదటి గెలుపు. అలా కొనసాగించిన ఈ రచన పూర్తి అయ్యేనాటికి..  నాకు ఓటమి నుండి తప్పించుకోవాలన్న అభధ్రతాభావం కంటే, విజయాన్ని అందుకోవాలన్న వాంచకంటే, విజయంపైనే గెలిచితీరటం జీవితపు సహజగుణం అని తెలిసిపోయింది". 
మీ
శ్రీఅరుణం
  

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.